నారీ.. ఆర్థిక విజయభేరి..
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:38 AM
సిరిసిల్ల ఆర్థిక అవనిపై అతివలు ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లోనే కాదు పరుషులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. అంతేకాకుండా వ్యాపార రంగాల్లో శక్తివంచన లేకుండా విజయభేరి మోగిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలతో ముందడుగు వేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సిరిసిల్ల ఆర్థిక అవనిపై అతివలు ఆదర్శంగా నిలుస్తున్నారు. కుటుంబ వ్యవహారాల్లోనే కాదు పరుషులకు ఏ మాత్రం తీసిపోని రీతిలో చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. అంతేకాకుండా వ్యాపార రంగాల్లో శక్తివంచన లేకుండా విజయభేరి మోగిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలతో ముందడుగు వేస్తున్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు ఐకేపీ, మెప్మా, స్త్రీనిధి ద్వారా అందించే రుణాల లక్ష్యం వంద శాతంపూర్తి చేశారు. మరోవైపు ప్రభుత్వం మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. జిల్లాలో వివిధ యూనిట్లు స్థాపించి విజయవంతంగా ముందుకు వెళుతున్నారు.
మహిళా శక్తి ద్వారా వ్యాపారాలు..
మహిళా శక్తి ద్వారా రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పంతో రాజన్న సిరిసిల్ల జిల్లా స్వశక్తి మహిళలు ముందడుగు వేస్తున్నారు. జిల్లాలో విభిన్నమైన యూనిట్లను స్థాపించి మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాల ప్రొత్సాహంతో మూడు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించారు. కలెక్టరేట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు ఇల్లంతకుంట మండల కేంద్రంలో రూ.3లక్షల బ్యాంక్ రుణాలను అందుకొని క్యాంటీన్లు ప్రారంభించుకున్నారు. వీటితో పాటు డెయిరీ యూనిట్లు, ఆయిల్‌మిల్, పెరటి కోళ్ల పెంపకం, కుట్టు మిషన్ కేంద్రం, బేకరీలు, గిఫ్ట్ ఆర్టికల్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, మొబైల్ టిఫిన్ సెంటర్లు, రిటైల్ ఫిష్ అవుట్‌లెట్‌లు, చట్నీస్, స్నాక్స్ వంటి వ్యాపారాలను ప్రారంభించుకున్నారు. వీటి కోసం రూ.10 లక్షల వరకు రుణాలను అందించారు. వ్యాపార రంగంలో మేము సైతం అంటూ ముందుకు సాగుతున్నారు.
వంద శాతం రుణాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వశక్తి సంఘాల మహిళలకు బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి, వివిధ యూనిట్లకు రుణాల లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేశారు. బ్యాంక్ లింకేజీల ద్వారా జిల్లాలో స్వశక్తి సంఘాలకు రూ.533 కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ.59 కోట్లు, వ్యాపారాల కోసం వివిధ యూనిట్లకు రూ.105 కోట్ల రుణాలను మంజూరు చేశారు. మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ల ద్వారా 5,123 యూనిట్లకు రూ.100.91 కోట్ల రుణాలను అందించారు. 185 పాడి గేదెల యూనిట్లకు రూ.1.57 కోట్లు, 621 పెరటి కోళ్ల పెంపకం యూనిట్లకు రూ.93 లక్షలు, 9 మదర్ యూనిట్‌లకు రూ.31 లక్షలు, మెబైల్ ఫిష్ అవుట్‌లెట్‌కు రూ.10 లక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్ అవుట్‌లెట్‌కు రూ.10 లక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్ 53 యూనిట్‌లకు రూ.98 లక్షలు, 3 మిల్క్ పార్లర్‌లకు రూ.7.50 లక్షలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ యూనిట్‌లకు రూ.3 లక్షలు, మూడు క్యాంటీన్‌లకు రూ.8 లక్షలు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతతో జిల్లాలో మహిళలు పురోభివృద్ధి సాధిస్తున్నారు.
జిల్లాలో 1.15 లక్షల మంది స్వశక్తి మహిళలు..
జిల్లాలో 411 గ్రామైక్య సంఘాలు, 9,854 స్వయం సహాయకసంఘాల్లో 1,15,656 మంది సభ్యులు ఉన్నారు. 154 దివ్యాంగుల పొదుపు సంఘాలు ఉండగా, 1,194 మంది సభ్యులు ఉన్నారు. జిల్లా సమాఖ్యతో పాటు 12 మండల సమాఖ్యలు పనిచేస్తున్నాయి.
ఆర్థిక ఎదుగుదలకు అవకాశం..
- ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్
ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను కోటీశ్వరులుగా మార్చే దిశగా రుణాలు అందిస్తున్నది. ఆర్థిక ఎదుగుదలకు మహిళలకు మంచి అవకాశం. మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలు పొందాలి.
ప్రణాళికాబద్ధంగా ముందడుగు..
- సందీప్‌కుమార్ ఝా, కలెక్టర్
మార్కెట్‌కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి మహిళలు ఆర్థికంగా బలపడే విధంగా ముందడుగు వేస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ స్వయం సమృద్ధి సాధించాలి. మహిళా శక్తి పథకంలో అర్హులైన మహిళలు అందరికి ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక చేయూత అందిస్తున్నాం.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రుణాలు..
- శేషాద్రి, డీఆర్‌డీవో
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మహిళా శక్తి పథకం ద్వారా అర్హులైన వారికి రుణాలు ఇప్పిస్తున్నాం. అర్హులైన మహిళలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి రుణాల లక్ష్యాన్ని ఈ ఆర్థిక సంవత్సరం సాధించాలి.
మొబైల్ క్యాంటీన్ ద్వారా ఉపాధి..
- టేకుమల్ల లక్ష్మీ, తంగళ్లపల్లి
మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నాం. తంగళ్లపల్లిలోని శ్రీసాయిరాం మహిళా సంఘం ద్వారా రూ.3 లక్షల రుణాన్ని మహిళా శక్తి పథకంలో పొందాము. దీని ద్వారా నిర్వహణ ఖర్చులు పోను రూ.25 వేల వరకు ఆదాయం సమకూరుతోంది.
రూ.30 వేల అదాయం వస్తోంది...
- అలూరి ప్రేమల, గోపాల్‌రావుపల్లె
ఇందిరా మహిళా శక్తి ద్వారా పెరటి కోళ్ల పెంపకం చేపట్టాం. వ్యవసాయ భూమి వద్ద షెడ్డులో కోడి పిల్లలను తీసుక వచ్చి పెంచుతున్నాం. రూ.35కు ఒక పిల్లను తీసుకవచ్చి 45 రోజుల పాటు పెంచితే కోడి రూ.100కు విక్రయిస్తున్నాం. అన్ని ఖర్చులు పోను రూ.30 వేల వరకు మిగులుతోంది.