Share News

ఈజీఎస్‌ కూలీలకు అందని వేసవి భత్యం

ABN , Publish Date - Feb 23 , 2025 | 01:00 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలకు అందించాల్సిన వేసవి భత్యం రెండు సంవత్సరాలుగా అందడం లేదు. ప్రస్తుత వేసవిలోనైనా భత్యం అందుతుందా లేదా అన్న సందిగ్ధం కూలీల్లో నెలకొంది.

ఈజీఎస్‌ కూలీలకు అందని వేసవి భత్యం

జగిత్యాల, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కూలీలకు అందించాల్సిన వేసవి భత్యం రెండు సంవత్సరాలుగా అందడం లేదు. ప్రస్తుత వేసవిలోనైనా భత్యం అందుతుందా లేదా అన్న సందిగ్ధం కూలీల్లో నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 53.09 లక్షల జాబ్‌కార్డులు ఉండగా అందులో 110.70 లక్షల మంది కూలీలుగా నమోదయ్యారు. ఇందులో 34.55 లక్షల జాబ్‌కార్డుల్లో 58.06 లక్షల మంది కూలీలు యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత వేసవి సీజన్‌లో సగటున రోజుకు ఇప్పటి వరకు 12,618 గ్రామ పంచాయతీల్లో 2,02,928 మంది ఉపాధిహామీ పనులకు వెళ్తున్నట్లు సంబంధిత అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల జాబ్‌ కార్డులు ఉండగా అందులో 2.73 లక్షల మంది కూలీలున్నారు. వేసవిలో ఉపాధి పనిదినాలు పెంచేందుకు ప్రతీ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు అదనపు భత్యాన్ని అందజేసేది. ప్రస్తుతం వేసవి భత్యం అందకపోవడంతో కూలీల్లో నిరాశ వ్యక్తం అవుతోంది.

ఫగతంలో వేసవి భత్యం చెల్లింపులు ఇలా..

వేసవిలో పనిచేసిన కూలీలకు ఫిబ్రవరి నెలలో 20 శాతం, మార్చి మాసంలో 25 శాతం, ఏప్రిల్‌, మే మాసాల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం అలవెన్స్‌గా చెల్లిస్తుండేవారు. ఉపాధిహామీ పథకం పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో వినియోగించిన సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఇర్మమెటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో రెండు సంవత్సరాలుగా ఉపాధిహామీ కూలి చెల్లింపులు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐసీ సాఫ్ట్‌వేర్‌ ద్వారా చెల్లిస్తోంది. కానీ కొత్త సాఫ్ట్‌వేర్‌లో వేసవి భత్యం చెల్లింపునకు సంబంధించిన ఆప్షన్‌ లేకపోవడంతో అందడం లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఉపాధిహామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఒక రోజుకు గరిష్టంగా రూ.300 కూలి చెల్లిస్తుంది. కూలీల వేతనాలు సైతం వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వేసవి భత్యం ఇచ్చే అవకాశం లేకపోడంతో కూలీల అలవెన్స్‌కు బ్రేక్‌ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఇప్పటికే ఉపాధిహామీ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నర్సరీల్లో బ్యాగ్‌ ఫిల్లింగ్‌, మొక్కల పోషణ తదితర పనులు కొనసాగుతున్నాయి.

Updated Date - Feb 23 , 2025 | 01:00 AM