TG News: ఛీ ఛీ అనిపించుకోను
ABN , Publish Date - Jan 13 , 2025 | 07:21 PM
TG News: ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలోని మంచుకొండ ఎత్తిపోతల పథకానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతోపాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరులు సోమవారం శంకుస్థాపన చేశారు.
ఖమ్మం, జనవరి 13: గత ప్రభుత్వం రూ. పది వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా సాగునీరు ఇవ్వలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూలూరుపాడు టనెల్ పూర్తయితే.. పాలేరుకు గోదావరి జలాలు వస్తాయన్నారు. ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలు సస్యశ్యామలం చేయాలన్నదే తన రాజకీయ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే సీతారామ ప్రాజెక్ట్ పూర్తి కావడంతోపాటు భద్రాచలంకి రైల్వే లైన్, కొత్తగూడెంకు ఎయిర్ పోర్ట్ రావాలన్నారు. మీ కష్టాలు తెలుసు, మీ అవసరాలు సైతం తనకు తెలుసునన్నారు. అన్ని పనులు పూర్తి చేసి.. మీతో శబాష్ అనిపించుకుంటా నని.. అంతే తప్ప. ఛీ చీ అని మాత్రం అనిపించుకోనని ఆయన పేర్కొన్నారు.
సోమవారం ఖమ్మం జిల్లాలోని రఘునాధపాలెం మండలం మంచుకొండ ఎత్తిపోతల పథకానికి తుమ్మలతోపాటు ఇతర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తదితరులు శంకుస్థాపన చేశారు. అనంతరం వరుసగా మంత్రులు మాట్లాడారు. ఆ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ ఏడాది సత్తుపల్లి ట్రంక్ పూర్తి చేసి గోదావరి జలాలను పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. పామాయిల్ సాగు చేయాలని ఈ సందర్భంగా రైతులకు ఆయన పిలుపు నిచ్చారు. ప్రతి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీలు స్దాపించి.. రైతులను రాజులుగా నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు. 46 మండలాలకు సాగు నీరు అందించే భాగ్యం తనకు దక్కిందంటూ మంత్రి తుమ్మల ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.
ఒక్క రఘునాధ పాలెం మండలానికి సాగు నీరు ఇవ్వ లేక పోయానన్న బాధ గతంలో ఉండేదని.. ఇప్పుడా ఆ బాధ సైతం తనకు లేదన్నారు. మీరు పామాయిల్ సాగు చేయండి.. ఉగాది నాటికి సాగు నీరు తీసుకు వచ్చి మీ మొక్కలు బతికిస్తాంటూ రైతులకు మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం వచ్చి ఏడాది పూర్తియిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఒకోక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. ప్రతిపక్షం అవాక్కులు చవాక్కులు పేలినా.. వాటిని పట్టించుకోకుండా అభివృద్ది, సంక్షేమం కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి పేద వాడికి అభివృద్ది సంక్షేమం అందజేస్తామన్నారు.
Also Read: నెలకు రూ. 20 వేలు పెన్షన్.. శుభవార్త చెప్పిన సీఎం
అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. 2500 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పధకం పనులు ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. అపర భగీరధుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీకు మంత్రిగా ఉండటం అదృష్టమని పేర్కొన్నారు. మంత్రులమంతా సమన్వయంతో పని చేస్తున్నామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read: మహా కుంభమేళలో విగ్రహం కారణంగా రేగిన వివాదం
ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మంచుకొండ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ను తక్కువ ఖర్చు రూ. 54 కోట్లతో 2,500 ఎకరాలకు సాగునీరు అందించనుండడం సంతోషంగా ఉందన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ది, సంక్షేమ పధకాలు తాము అమలు చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం జిల్లాకు వ్యవసాయంతో పాటు పరిశ్రమల స్దాపనకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Also Read: కోడి పందాల్లో గెలవాలంటే.. ఇలా చేయండి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను మంత్రి తుమ్మల పట్టబట్టి మరి సాధించారన్నారు. సంక్రాంతి కానుకగా రఘునాధపాలెం ప్రజలకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఇవ్వాలని తుమ్మల పట్టుబట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మంత్రులమందరం అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. రూ.1.8 లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రంగా ఆయకట్టు నిర్మించినా.. సాగులోకి మాత్రం తీసుకు రాలేదన్నారు. రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మించి.. ఒక్క ఎకరాకు సైతం సాగు నీరు అందించలేదన్నారు.
Also Read: పందెం కోళ్లు ఎన్ని రకాలో తెలుసా..?
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా రైతులు పంట పండించారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే నాలుగేళ్లలో అన్ని ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సీతారామ పూర్తి చేసి గోదావరి జలాలు.. ఖమ్మం జిల్లాకు తీసుకు వస్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన మీ త్యాగాలు మర్చిపోమని ఆయన పేర్కొన్నారు.
For Telangana News And Telugu News