Share News

Srisailam Tunnel: ఒక్కసారిగా కూలిన పైకప్పు.. శ్రీశైలం టన్నెల్‌లో ప్రమాదం

ABN , Publish Date - Feb 22 , 2025 | 11:51 AM

Srisailam tunnel: శ్రీశైలం ఎడమ టన్నెల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Srisailam Tunnel: ఒక్కసారిగా కూలిన పైకప్పు.. శ్రీశైలం టన్నెల్‌లో ప్రమాదం
Srisailam Left Tunnel

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 22: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ఎల్‌బీసీ ఎడమవైపు సొరంగం పనులు జరుగుతుండగా సుమారు 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. అయితే నాలుగు రోజుల క్రితమే ఎడమవైపు సొరంగం పనులు మొదలయ్యాయి. ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నల్ బోర్ మెషిన్‌తో పని జరుగుతున్నప్పుడు సొరంగంలో ఏడుగురు కార్మికులు ఉన్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల పనిచేస్తున్న కార్మికులు అప్రమత్తమై లోపలికి పరిగెత్తారు.


ప్రమాద సమయంలో పలువురు కార్మికులు పనులు చేస్తుండగా పైకప్పు పడిపోవడంతో వారంతా గాయపడ్డారు. సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఏడాదిలోపు పనులు పూర్తి కావాలన్న ప్రభుత్వ టార్గెట్‌తో ఇంజనీర్‌ల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఇరగేషన్‌ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటనే దానిపై ఇరిగేషన్ అధికారులు ఆరా తీస్తున్నారు.


మంత్రి ఆరా..

Uttam.jpg

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాద ఘటనపై నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆరా తీశారు. టెక్నికల్ అధికారులు, వర్క్ చేస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి ఫోన్‌లో సంభాషించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


సీఎం రేవంత్ దిగ్భ్రాంతి...

revanth-reddy.jpg

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్‌ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్. ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు.


ప్రమాదం ఎలా జరిగింది... బాధ్యులు ఎవరు: కవిత

kavitha-mlc.jpg

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంపై ఎన్‌డీఎస్‌ఏ స్పందించాలని.. నులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పైకప్పు కూలి కూలీలు గాయపడటం అత్యంత దురదృష్టకరమన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ హయాంలో పది కిలోమీటర్ల మేర టన్నెల్‌ తవ్వారని... ఏ ఒక్క రోజూ ఇలాంటి ప్రమాదం జరగలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు రోజుల కిందనే పనులు మొదలు పెట్టిందని... అంతలోనే ఈ పెను ప్రమాదం ఎలా జరిగింది? దీనికి ఎవరు బాధ్యులు? నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఈ ప్రమాదంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంకా 9 కిలోమీటర్లకు పైగా టన్నెల్‌ తవ్వాల్సి ఉందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Hyderabad Property Tax: ప్రాపర్టీ ట్యాక్స్.. బకాయిలు ఎంత పేరుకుపోయాయో తెలిస్తే షాక్ అవుతారు..

Hyderabad: స్వచ్ఛమైన గాలి.. అరగంటకు రూ.5 వేలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 22 , 2025 | 12:39 PM