RBI: మార్గదర్శిపై కేసు కొనసాగాల్సిందే!
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:29 AM
మార్గదర్శి అవిభాజ్య హిందూ కుటుంబం (హెచ్‌యూఎఫ్) కర్త అయిన రామోజీరావు మరణించినప్పటికీ ఆ సంస్థపై కేసు కొనసాగించాల్సిందేనని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) శుక్రవారం హైకోర్టును కోరింది.

అదనపు కౌంటర్ సమర్పించిన ఆర్బీఐ
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి అవిభాజ్య హిందూ కుటుంబం (హెచ్‌యూఎఫ్) కర్త అయిన రామోజీరావు మరణించినప్పటికీ ఆ సంస్థపై కేసు కొనసాగించాల్సిందేనని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) శుక్రవారం హైకోర్టును కోరింది. మార్గదర్శి చట్టబద్ధమైన సంస్థగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నందున కేసును కూడా కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో అదనపు కౌంటర్ దాఖలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు అప్పటి ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి సంస్థ దాఖ లు చేసిన క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు వరకు వె ళ్లింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ హైకోర్టు విచారణ చేపడుతోంది. తాజాగా శుక్రవారం జస్టిస్ శ్యాంకోషి, జస్టిస్ కే సుజన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది.
ఈ కేసుపై ఆర్బీఐ తన వాదనను వినిపించింది. ఆర్బీఐ చట్టంలోని 45 (ఎస్) నిబంధనలను ఉల్లంఘించి, అర్హత లేకపోయినా అక్రమంగా డిపాజిట్లు సేకరించినందుకు పీనల్ సెక్షన్ అయిన 58(బీ)5ఏ ప్రకారం శిక్షను మార్గదర్శి ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూ థ్రాలు వాదనలు వినిపిస్తూ ఒకవేళ తండ్రి తప్పు చేసి మరణిస్తే అతడి వారసులపై ఆ క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడం సాధ్యం కాదని ధర్మాసనానికి నివేదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. మార్గదర్శి హెచ్‌యూఎ్‌ఫ ఇప్పటికీ వ్యాపా రం నిర్వహిస్తోందని, సివిల్ తప్పులకైనా బాధ్యత వహించాల్సి వస్తుంది కదా? అని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.