GHMC: బర్త్ సర్టిఫికెట్లపై ఎస్‌బీ విచారణ
ABN , Publish Date - Jan 25 , 2025 | 08:22 AM
గ్రేటర్ పరిధిలో గత ఆరు నెలల్లో 74 హోం బర్త్ (ఇళ్లలో ప్రసవం జరిగినట్టు) సర్టిఫికెట్లు జారీ కావడంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబరిది(GHMC Commissioner Elambaridi) స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) పోలీసు విచారణకు ఆదేశించారు.

- జీహెచ్‌ఎంసీలో 74 జారీ అయినట్లు గుర్తింపు
- అనుమానంతో విచారణకు కమిషనర్ ఆదేశం
- 32 మంది ఆపరేటర్లు, ఏఎంసీ, ఏఎంఓహెచ్‌ల పాత్రపైనా విచారణ
- పోలీస్ ఉన్నతాధికారులకు జీహెచ్‌ఎంసీ లేఖ
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ పరిధిలో గత ఆరు నెలల్లో 74 హోం బర్త్ (ఇళ్లలో ప్రసవం జరిగినట్టు) సర్టిఫికెట్లు జారీ కావడంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబరిది(GHMC Commissioner Elambaridi) స్పెషల్ బ్రాంచ్(ఎస్‌బీ) పోలీసు విచారణకు ఆదేశించారు. గత జూలై నుంచి డిసెంబరు వరకు గ్రేటర్‌లో జారీ చేసిన హోం బర్త్ సర్టిఫికెట్లలో 34 సర్టిఫికెట్లు యూసుఫ్ గూడ సర్కిల్‌లోని శిశువిహార్‌లో ఉండే వారివి కాగా, మరో 40 ఇతర సర్కిళ్లలోనివిగా కమిషనర్ గుర్తించారు.
ఈ వార్తను కూడా చదవండి: Special officers: ఇక ప్రత్యేక అధికారుల పాలన..
ప్రస్తుత పరిస్థితుల్లో.. అదీ అడుగడుగునా ఆస్పత్రులు ఉన్న నగరంలో ఇళ్లల్లో ప్రసవాలు జరుగుతున్నాయా..? ఇదంతా వాస్తవమేనా..? అని అనుమానాలు తలెత్తడంతో ఆరు నెలల్లో ఇచ్చిన సర్టిఫికెట్లలో సక్రమమెన్ని..? అక్రమమెన్ని..? తేల్చాలని సూచించారు. గ్రేటర్(Greater)లోని 30 సర్కిళ్లతోపాటు కేంద్ర కార్యాలయంలోని సిబ్బందితో కలిపి 32 మంది ఆపరేటర్లు పని చేస్తున్నారు. 10 నుంచి 15 ఏళ్లుగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తోన్న కంప్యూటర్ ఆపరేటర్ల పనితీరుపైనా విచారణ జరుగనుంది. ఆయా స్థానాల్లో వాళ్లు ఎప్పటి నుంచి పని చేస్తున్నారు..? వారి నియామకం ఎలా జరిగింది..?
వారికి ఎందుకు స్థాన చలనం జరగలేదు..? తదితర అంశాలపై విచారణ అధికారులు ఆరా తీయనున్నారు. సబ్ రిజిస్ర్టార్లుగా ఉన్న అసిస్టెంట్ మునిసిపల్ కమిషనర్ (ఏఎంసీ), రిజిస్ర్టార్‌గా వ్యవహరిస్తోన్న సహాయ వైద్యాధికారుల(ఏఎంఓహెచ్) పాత్రపైనా విచారణ జరుగుతుందని ఓ అధికారి తెలిపారు. కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో సంస్థలోని ఆరోగ్య విభాగం అధికారులు విచారణ కోసం పోలీస్ శాఖకు లేఖ రాశారు. సంస్థలోని విజిలెన్స్ విచారణతో వాస్తవాలు బహిర్గతం కావన్న ఉద్దేశంతో బయటి అధికారులతో విచారణ చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
జైలుకు పంపిస్తా..
హెల్త్ విభాగం అధికారులతో ఇలంబరిది శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ తీరును ప్రస్తావిస్తూ ఏఎంఓహెచ్‌లు, ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ ఇష్టానికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తారా..? తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తే ఎవరు బాధ్యులు..?’ అని మండిపడినట్టు సమాచారం. నిబంధనలు అతిక్రమించినా.. అవక తవకలు జరిగినా.. సంబంధిత అధికారులను జైలుకు పంపిస్తా’ అని తీవ్రంగా హెచ్చరించి నట్టు ఓ అధికారి తెలిపారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా మరింత పారదర్శకంగా పౌరసేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని హెల్త్ విభాగం అధికారులను ఆదేశించారు.
ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు
ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం
ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్ నజర్
ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు
Read Latest Telangana News and National News