Share News

SLBC Tunnel: ఆశలు ఆవిరి?

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:31 AM

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరగ్గా దాదాపు ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా...

SLBC Tunnel: ఆశలు ఆవిరి?

  • సొరంగంలో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో తీసుకురావడం కష్టమే!

  • సహాయ చర్యల బృందం సభ్యులు, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ చెబుతున్నదిదే

  • టీబీఎం కటింగ్‌కు కంపెనీ ఒప్పుకోక ఇన్ని రోజులు వెలికితీతలో ఆలస్యం?

  • మంత్రులతో ఆ కంపెనీ అధినేత భేటీ

  • కటింగ్‌కు నిర్ణయం.. గ్యాస్‌ కట్లర్లు సిద్ధం.. నేడు రానున్న ప్లాస్మా కట్టర్‌

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న 8 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ప్రమాదం జరగ్గా దాదాపు ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా... వారు ఏ ప్రాంతంలో చిక్కుకున్నారనే విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు. పుష్‌ కెమెరాలు, ప్రోబోస్కో్‌పలు వినియోగించడంతో పాటు సోనార్‌ ద్వారా సంకేతాలు కనుక్కోవాలని ప్రయత్నించినా ఇప్పటివరకు వారి ఆచూకీ తెలియలేదు. దీంతో వారిని రక్షించి బయటకు తీసుకురావడంపై ఆశలు ఆవిరవుతున్నాయని సహాయ చర్యల్లో పాల్గొంటున్న ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ, ర్యాట్‌హోల్‌ మైనర్స్‌, ఇతర బృందాల సిబ్బంది అంటున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం, సాయంత్రం మూడు సహాయ బృందాలు లోపలికి వెళ్లాయి. ఒక ఆస్పత్రికి చెందిన కొందరు సిబ్బంది కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక్కో బృందంలో 26 మంది సభ్యుల వరకు ఉండగా ఉన్నతాధికారులు కూడా లోపలికి వెళ్లి వచ్చారు. బేరింగ్‌ వెనుకవైపు ఉన్న బేస్‌ వరకు వెళ్లి వచ్చిన వారు... అక్కడి పరిస్థితి చాలా భయానకంగా ఉందని చెబుతున్నారు. మంగళవారం రాత్రి ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ చాలా దగ్గర వరకు వెళ్లగా అక్కడ మట్టిపై సెగ్మెంట్‌ బ్లాకులు ఆనుకుని ఉండటంతో మరింత కూలిపోతుందనే ఆందోళనతో తిరిగి వచ్చారు.


నేటి నుంచి టీబీఎం కటింగ్‌

ప్రమాదం జరిగిన సమయంలో పెద్దఎత్తున సెగ్మెంట్‌ బ్లాకులు టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం)పై పడటంతో బేరింగ్‌ వెనక భాగం మొత్తం దెబ్బతింది. ఆ తర్వాత ఒత్తిడితో పైపులు, ఐరన్‌ షీట్లతో వ్యర్థాలు ముందుకు తోసుకువచ్చాయి. ఎయిర్‌ పంపింగ్‌, కన్వేయర్‌ బెల్టు కూడా దెబ్బతిన్నాయి. అయితే మూడో రోజునే కట్టర్లు, జనరేటర్లు లోపలకు తీసుకెళ్లినా ఆ వ్యర్థాలను మాత్రం తొలగించలేదు. వాటిని తొలగించకుండానే చిక్కుకుపోయిన వారి జాడ కనుక్కునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. టీబీఎంను కట్‌ చేయడానికి జయప్రకాశ్‌ అసోసియేట్స్‌ యాజమాన్యం కూడా ఇన్ని రోజులూ ఒప్పుకోనట్లు తెలుస్తోంది. భారీ ఖర్చుతో కూడుకోవడం, టీబీఎంను కట్‌ చేస్తే తిరిగి పనులు ప్రారంభించడం కష్టమవుతుందని భావించినట్లు సమాచారం. అందుకే మూడు రోజులుగా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, బుధవారం ఆ సంస్థ చైర్మన్‌ జయప్రకాశ్‌ గౌర్‌ ఢిల్లీ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో టన్నెల్‌ ప్రదేశానికి వచ్చారు. మంత్రులు, అధికారులు, కంపెనీ ప్రతినిధులు, సహాయ బృందాలతో చర్చల అనంతరం టీబీఎంను కట్‌ చేయాలని నిర్ణయించారు.


గ్యాస్‌, ప్లాస్మా కట్టర్ల వినియోగం

టీబీఎంను మామూలు కట్టర్లతో కట్‌ చేయడం అసాధ్యం. ఇప్పటికే టన్నెల్‌లోకి గ్యాస్‌ కట్టర్లను తరలించగా గురువారం మధ్యాహ్నంలోపు ప్లాస్మా కట్టర్‌ను కూడా తీసుకురానున్నారు. వదులుగా ఉన్న సెగ్మెంట్‌ బ్లాకులు కింద పడకుండా ఆసరా పెట్టి.. తర్వాత మట్టిని, సిల్టును తొలగించనున్నారు. ఆరు 150 హెచ్‌పీ పంపుల ద్వారా నీటిని బయటకు తోడే ప్రక్రియ కొనసాగుతోంది.


నీటి శబ్దం తప్ప ఏం వినిపించడం లేదు

12.jpg

అతికష్టంపై దారి చేసుకుని వెళ్లగలిగాం. కానీ ఇంకా మట్టి, రాళ్లు కూలే పరిస్థితి కనిపిస్తోంది. సొరంగంలో చిక్కుకున్న వారిని పిలిచినా ఎటువంటి శబ్దం రావడంలేదు. అందులో నీటి ఊట శబ్దం తప్ప మనుషుల అలికిడి వినిపించడం లేదు. ఆ ఎనిమిది మంది బతికే అవకాశం లేదు.

-అను ఖురేషి, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ టీం సభ్యుడు

వారు బతికే అవకాశాలు తక్కువే

12.jpg

మేం ఉత్తరాఖండ్‌లో జరిగిన మైనింగ్‌ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిని కాపాడాం. కానీ ఇక్కడ చిక్కుకున్న వారిని రక్షించడం చాలా కష్టంగా మారింది. లోపల ఉన్న వారు బతికి ఉండే అవకాశాలు తక్కువే. టీబీఎంను కట్‌ చేసి తొలగిస్తే సహాయ చర్యలు కొనసాగించవచ్చు.

- ఫిరోజ్‌ ఖురేషి, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ టీం సభ్యుడు

ఆ ప్రాంతం భయానకంగా ఉంది

13.jpg

ఎస్‌ఎల్‌బీసీలో చిక్కున్న వారు సురక్షితంగా బయటకొచ్చే అవకాశం లేదు. తాము టీబీఎం ఉన్న ప్రదేశానికి 20 మీటర్ల దగ్గరకు వెళ్లగలిగాం. ఆ ప్రాంతం బురద, రాళ్లతో నిండిపోయి భయానకంగా కనిపిస్తోంది అక్కడ గాలి, వెలుతురు రావడం లేదు. అయినా మా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం.

- నసిరుద్దీన్‌, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ టీం సభ్యుడు

నీటి ఊటను నిలువరిస్తేనే..

13.jpg

రెండు రోజులుగా సొరంగంలోకి వెళ్లి అక్కడి పరిస్థితులను అంచనా వేశాం. ప్రస్తుతం చాలా వరకు టీబీఎం రాళ్లు, మట్టితో నిండిపోయింది, ఇంకా కొన్ని సెగ్మెంట్‌ బ్లాకులు కూలే పరిస్థితి ఉంది. కెమికల్‌ వాడి నీటి ఊటను నిలువరించిన తర్వాత శిథిలాలను తొలగిస్తే చిక్కుకున్న వారిని గుర్తించడం సాధ్యమవుతుంది.

- మున్ను ఖురేషి, ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ టీం సభ్యుడు

Updated Date - Feb 27 , 2025 | 04:31 AM