Share News

Caste Census: జనాభాలో సగానికి పైనే!

ABN , Publish Date - Feb 03 , 2025 | 03:16 AM

తెలంగాణలో కులాలవారీ జనాభా లెక్క తేలింది. రాష్ట్రంలో ఏ సామాజికవర్గం వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించేందుకు చేపట్టిన కులసర్వే నివేదిక ప్రభుత్వానికి అందింది.

Caste Census: జనాభాలో  సగానికి పైనే!

  • రాష్ట్రంలో తేలిన బీసీల లెక్క.. సర్వే వివరాలను వెల్లడించిన సబ్‌ కమిటీ

  • అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే సర్వే.. 96.9 శాతం ప్రజలు పాల్గొన్నారు

  • దేశ చరిత్రలో గొప్ప ముందడుగు.. రేపు క్యాబినెట్‌కు నివేదిక: మంత్రి ఉత్తమ్‌

  • తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది: పొన్నం

ఇదీ లెక్క.. (శాతాల్లో)

బీసీలు 46.25

ముస్లింలలో

బీసీలు 10.08

మొత్తం బీసీలు 56.33

ఎస్సీలు 17.43

ఎస్టీలు 10.45

ముస్లింలతో కలిసి

ఓసీలు 15.79

హైదరాబాద్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కులాలవారీ జనాభా లెక్క తేలింది. రాష్ట్రంలో ఏ సామాజికవర్గం వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించేందుకు చేపట్టిన కులసర్వే నివేదిక ప్రభుత్వానికి అందింది. సర్వే నివేదికను ప్రణాళిక విభాగం అధికారులు ఆదివారం క్యాబినెట్‌ సబ్‌కమిటీకి అందజేశారు. అనంతరం నివేదిక వివరాలను సబ్‌కమిటీ చైర్మన్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సభ్యులుగా ఉన్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహ సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం.. రాష్ట్ర జనాభాలో బీసీలు 46.25 శాతం, ముస్లింలలో బీసీలు 10.08 శాతం ఉన్నారని తెలిపారు. ఈ రెండు వర్గాలు కలిసి మొత్తం బీసీలు 56.33 శాతం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఎస్సీలు 17.43 శాతం ఉండగా, ఎస్టీలు 10.45 శాతం ఉన్నారని చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఓసీలు 13.31 శాతం ఉండగా.. ముస్లింలలో ఓసీలు 2.48 శాతం ఉన్నట్లు తెలిపారు. వీరితో కలిపి మొత్తం ఓసీ జనాభా 15.79 శాతం ఉందన్నారు. ఓసీలు, బీసీల్లోని ముస్లింలంతా కలిసి రాష్ట్రంలో ముస్లింల జనాభా 12.56 శాతం ఉన్నట్లు పేర్కొన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్య సర్వేలో రాష్ట్రం మొత్తం జనాభాలో 96.9 శాతం మంది పాల్గొన్నారని తెలిపారు. మరో 3.1 శాతం (సుమారు 16 లక్షల) మంది వివిధ కారణాలతో సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. రాష్ట్రంలోని 3.70 కోట్ల జనాభాలో 3.54 కోట్ల మంది సర్వేలో పాల్గొనడం చాలా సంతృప్తిగా ఉందని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ అన్నారు. సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారని, 58 రోజుల్లో సర్వేను పూర్తిచేశారని వెల్లడించారు. సర్వేను ప్రశాంతంగా పూర్తిచేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సర్వే విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించి ఎప్పటికప్పుడు సూచనలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు చెప్పారు. సర్వే నిర్వహణ, నివేదిక రూపకల్పన.. ప్రభుత్వానికి పెద్ద విజయమని అన్నారు.


సబ్బండ వర్ణాలకు న్యాయం కోసం..

వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలనేదే తమ ఆకాంక్ష అని, దానిని నెరవేర్చేందుకే కులసర్వే చేపట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సర్వే నివేదిక రావడంతో ఈ దిశగా ఒక కీలక అడుగు పడిందన్నారు. ‘‘మా పార్టీ అగ్రనేత, కాబోయే ప్రధానమంత్రి రాహుల్‌గాంధీ ఆలోచనతోనే తెలంగాణలో మా ప్రభుత్వం కులసర్వే చేపట్టింది. సామాజిక న్యాయం సాధించడం కోసం తెలంగాణలో జరిగిన కులసర్వే భారతదేశ చరిత్రలో ఒక గొప్ప ముందడుగు’’ అని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. ఈ సర్వే నివేదికను మంగళవారం ఉదయం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెడతామన్నారు. సామాజిక విప్లవం తీసుకురావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. స్వాతంత్య్రం తరువాత చాలాసార్లు జనాభా గణన జరిగిందని, కానీ... ఎప్పుడూ సామాజిక న్యాయం కోసం కుల సర్వే వాస్తవికంగా జరగలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక.. సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాస్తవ వివరాల కోసం ఈ సర్వేను నిర్వహించిందని చెప్పారు. ఇందుకోసం కర్ణాటక, బిహార్‌లో జరిగిన సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని, ఆ ఫలితాలను కులసర్వే విధాన రూపకల్పనలో అనుసంధానం చేశామని తెలిపారు. వివిధ ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు, ఇతర వర్గాల వారి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నామన్నారు.


కుల సర్వే చరిత్రాత్మకం..

తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో కులసర్వే నివేదిక సువర్ణాక్షరాలతో లిఖించదగిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గతేడాది ఫిబ్రవరి 4న క్యాబిబెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని ఏడాదిలోపు పూర్తిచేశామని తెలిపారు. దీని ద్వారా బలహీన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎంతగా కట్టుబడి ఉందో స్పష్టమవుతోందన్నారు. ఈ సర్వేను అడ్డుకోవడానికి కొంత మంది అనేక రకాలుగా అడ్డుపడ్డారని ఆరోపించారు. అయినా అందరి సహకారంతో ప్రభుత్వం వివరాలు సేకరించిందని చెప్పారు. సర్వేను ప్రశాంతంగా పూర్తిచేసినందుకు అధికారులు సందీ్‌పకుమార్‌ సుల్తానియాతో పాటు హైదరాబాద్‌ కలెక్టర్‌ దురిశెట్టి అనుదీ్‌పను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా మాట్లాడుతూ సర్వే నిర్వహించిన తీరును వివరించారు. రాష్ట్రాన్ని 94,261 ఎన్యుమరేటర్‌ బ్లాక్‌లుగా విభజించి.. 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా పరిగణించి సర్వే చేపట్టామన్నారు. ఎన్యుమరేటర్ల పనితీరు, సర్వే నిర్వహణను పరిశీలించడానికి 9,628 సూపర్‌వైజర్లను నియమించామని తెలిపారు. 75 ప్రశ్నలతో ప్రశ్నావళి రూపొందించి, దాని ప్రకారం వివరాలను సేకరించామన్నారు.


జనాభా వారీ సర్వే వివరాలు..

మొత్తం కుటుంబాలు: 1,12,15,134,

జనాభా: 3,54,77,554

పురుషులు: 1,79,21,183 (50.51ు)

స్త్రీలు: 1,75,42,579 (49.45ు)

ధర్డ్‌జెండర్‌ : 13,774 (0.04ు)

కులాల వారీ వివరాలు..

ఎస్సీలు: 61,84,319

ఎస్టీలు: 37,05,929.

బీసీలు: 1,64,09,179

బీసీ ముస్లింలు: 35,76,588

బీసీలు, బీసీ ముస్లింలు కలిపి

ఓసీ ముస్లింలు: 8,80,424 (2.48శాతం)

ఓసీలు: 38,30,691 (13.31 శాతం)

ఓసీలు, ఓసీ ముస్లింలు కలిపి: 47,21,115

మొత్తం ముస్లింలు: 44,57,012 (12.56 %)


ఇవీ చదవండి:

ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి

కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..

భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 03 , 2025 | 03:16 AM