AP News: జగన్‌కు ఓటమి భయం: అయ్యన్న
ABN , First Publish Date - 2023-06-10T20:26:58+05:30 IST
ఓటమి భయంతోనే సీఎం జగన్ (CM Jagan) టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) ఆరోపించారు.
విశాఖ: ఓటమి భయంతోనే సీఎం జగన్ (CM Jagan) టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరిట నోటీసులు ఇవ్వకుండానే లక్షలాది మంది టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం బీఎల్‌వో ఆధ్వర్యంలో ఓటర్ల జాబితాల పరిశీలన జరగాలన్నారు. వైసీపీకి అనుకూలంగా భారీగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని శ్యామలానగర్ 38వ బూత్‌లో 2-14-121 డోర్ నంబరు మీద 800 ఓట్లు ఉన్నాయన్నారు. ఒక కళాశాలకు సంబంధించిన డోర్ నంబర్‌పై 46 ఓట్లు ఉన్నాయన్నారు. ఒక్క బూత్‌లోనే 800 దొంగ ఓట్లు ఉన్నాయంటే... రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దొంగ ఓట్లు నమోదై ఉంటాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. 2023 జనవరి ఐదో తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన జాబితాలో పది లక్షల ఓట్లు తొలగించారని తెలిపారు. ఒక ఓటరు చనిపోతే ఆ కుటుంబానికి నోటీసు ఇచ్చి...అతని ఓటు తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఈ విధంగా జరగడం లేదని విమర్శించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 17 వేల దొంగ ఓట్లు, చనిపోయినవారి ఓట్లు గుర్తించి ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే వాటిలో కేవలం 2,443 ఓట్లు మాత్రమే తొలగించారని అయ్యన్నపాత్రుడు తెలిపారు.