Kakani Govardhan: పవన్‌ను మేము గుర్తించం.. అసలు ఆయన గురించి మాట్లాడితేనే..
ABN , First Publish Date - 2023-03-01T13:45:32+05:30 IST
ఎన్నికల్లో 175 నియోజక వర్గాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జగన్ ప్రకటించారని...
అమరావతి: ఎన్నికల్లో 175 నియోజక వర్గాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని జగన్ (CM Jaganmohan Reddy) ప్రకటించారని... ఒంటరిగా 175 చోట్ల ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీ (TDP)కి ఉందా అంటూ సవాల్ చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ (AP CM) సవాలుకు సమాధానం చెప్పలేక ఆ పార్టీ నేతలు ముఖాలు చాటేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాల అమలు చేసి ప్రజల్లోకి వెళ్లి మద్దతు ఇమ్మని అడుగుతున్నామన్నారు. యువగళం (Lokesh YuvaGalam) పాదయాత్రకు జనాదరణ లేదని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ ఆర్థిక సాయంతో పాటు, మాందోస్ తుపాను పంట నష్ట పరిహారం చెల్లించామని అన్నారు. వైసీపీ (YCP) నమ్ముకున్నది ప్రజలను మాత్రమే అని... ఇతర పార్టీలతో పొత్తులు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్యాకేజీలు చెల్లిస్తే కలిసే పార్టీ వైసీపీ కాదన్నారు. ఐదేళ్ల పాటు పాలించిన చంద్రబాబు (Chandrababu Naidu)ను ప్రజలు తిరస్కరించారని, ప్రజల్లో ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. కేవలం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఉందా అని మాత్రమే ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ‘‘పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను, ఆయన పార్టీని అసలు తాము గుర్తించడం లేదు. పవన్ (Janasena Chief) గురించి మాట్లాడితే మాకు అవమానం. పవన్ కళ్యాణ్ స్థాయి తోలుబొమ్మలాటలో జోకర్ మాత్రమే’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి ఇంకా మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అని రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అని వేర్వేరుగా ఉండవని అన్నారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో కలిసే రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని తెలిపారు. 2014కు ముందు చంద్రబాబు (Nara Chandrababu Naidu) రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు వెళ్ళారన్నారు. పీఎం కిసాన్‌తో కలిసి రైతు భరోసా ఇస్తామని పదేపదే వైసీపీ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. రైతులకు సీజన్‌కు ముందుగానే నీళ్ళు ఇచ్చామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కడితే వ్యయం తప్ప ఏమీ ఉండదని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు. నెల్లూరు లాంటి చోట సంగం బ్యారేజిని తమ ప్రభుత్వం నిర్మించిందని చెప్పారు. టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి అయ్యిందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తెనాలికి హెలికాప్టర్‌లో వెళ్ళే అంశాన్ని కూడా ప్రతిపక్షాలు నిర్దేశిస్తాయా అంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాయి.