CM Jagan: వెంకటగిరి సభలో సీఎం జగన్ ఏం మాట్లాడారంటే..!
ABN , First Publish Date - 2023-07-21T14:24:17+05:30 IST
ఇప్పటివరకూ లక్షా ఇరవై వేల రూపాయిలు ప్రతి నేతన్నకి ఇచ్చాం. రూ.194 కోట్లు నేరుగా అకౌంట్లోకి చేరుతుంది. అయిదేళ్లుగా రూ.970 కోట్లు ఈ ఒక్క పథకం ద్వారా ఇచ్చాం. రూ.2,25000 కోట్లు నేరుగా రాష్ట్ర ప్రజల ఖాతాల్లోకి బటన్ నొక్కి ఈ యాభై నెలల్లో వేశాం.
వెంకటగిరి, ఉమ్మడి నెల్లూరు: సొంత మగ్గం కలిగి ఉన్న ప్రతి నేతన్నకి ప్రతి సంవత్సరం రూ.24 వేలు ఇస్తున్నామని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. వెంకటగిరిలో నేతన్న నేస్తం పథకం ఐదో విడత నిధులను ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘ఇప్పటివరకూ లక్షా ఇరవై వేల రూపాయిలు ప్రతి నేతన్నకి ఇచ్చాం. రూ.194 కోట్లు నేరుగా అకౌంట్లోకి చేరుతుంది. అయిదేళ్లుగా రూ.970 కోట్లు ఈ ఒక్క పథకం ద్వారా ఇచ్చాం. రూ.2,25000 కోట్లు నేరుగా రాష్ట్ర ప్రజల ఖాతాల్లోకి బటన్ నొక్కి ఈ యాభై నెలల్లో వేశాం. ముప్పై లక్షల పట్టాలు మహిళల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ప్రతి ఏటా 44 లక్షల మంది మహిళలు, 84 లక్షల మంది పిల్లలకి రూ.26 వేల కోట్లకి పైగా అమ్మ ఒడి అందేలా చర్యలు చేపట్టాం. కోటి మంది పొదుపు సంఘల మహిళలకి ఆసరా ద్వారా రూ.19,178 కోట్లు ఇచ్చాం. సున్నా వడ్డీ రుణాలు రూ.3,615 కోట్లు మహిళలకి అందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రూ.14,129 వేల కోట్ల రూపాయిలు అందేలా చేశాం. రైతు భరోసా కింద రూ.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.31 వేల కోట్లు బటన్ నొక్కి పంపించాం. ఆల్తూరుపాడు ఇరిగేషన్ ప్రాజక్టు అంచనాలు రూ.553 కోట్లు రివైజ్‌కి అనుమతులు ఇస్తాం. ఆరు మండలాలకి డ్రైన్, సీసీ రోడ్లకి రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నా. వెంకటగిరి మున్సిపాలిటిలోని ఒక్కో సచివాలయానికి రూ.50 లక్షలు కేటాయింపులు చేస్తాం. వెంకటగిరి పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తున్నాం.’’ అని సీఎం తెలిపారు. అనంతరం నేషనల్ అవార్డు అందుకున్న చేనేత కార్మికులకి జగన్ సన్మానం చేశారు.