OHRK: ఆరాధించిన చోటే అనుమానాలు!
ABN , First Publish Date - 2023-02-06T02:21:06+05:30 IST
రాజధాని అమరావతి రైతులకు 2020 నుంచి కష్టాలు మొదలయ్యాయని.. తనకు మాత్రం వారిని పరామర్శించడంతోనే వైసీపీలో కష్టాలు మొదలయ్యాయని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
అక్కడ ఉండలేననే బయటకు వచ్చా
అమరావతి రైతులకు సాయం
చేశాననే జగన్‌కు నాపై కోపం వచ్చింది
ట్యాపింగ్‌పై 4 నెలల ముందే
ఓ జూనియర్ ఐపీఎస్ ఫోన్ చేశారు
కానీ నేను అప్పట్లో నమ్మలేదు
నెల ముందు నిఘా చీఫ్ ఆడియో పంపాక తేలింది
నమ్మకం లేని చోట ఉండకూడదని నిర్ణయించుకున్నా
15 నెలలు అధికారం ఉన్నా ప్రతిపక్షంలోకి వచ్చా
రాజీనామా చేయాలని అడిగే అర్హత వారికి లేదు
టీడీపీ నుంచి వచ్చినవారు రాజీనామా చేశారా?
బాబు, లోకేశ్ అవకాశమిస్తే ఆ పార్టీ నుంచి పోటీచేస్తా
‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
రాజధాని అమరావతి రైతులకు 2020 నుంచి కష్టాలు మొదలయ్యాయని.. తనకు మాత్రం వారిని పరామర్శించడంతోనే వైసీపీలో కష్టాలు మొదలయ్యాయని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. వరదల సమయంలో పాదయాత్ర చేస్తున్న రైతులకు సాయం చేసినందుకే సీఎం జగన్‌కు తనపై కోపం వచ్చిందన్నారు. ఇంతకుమించిన కారణం తనకు కనిపించడం లేదని చెప్పారు. నేనే జగన్.. జగనే నేను అన్నంతగా ప్రేమించానని.. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తారని ఊహించలేదని.. మొదట్లో నమ్మలేదని.. నిఘా చీఫ్ రామాంజనేయులు ఫోన్ చేసి ఆడియో పంపిన తర్వాతే అర్థమైందని తెలిపారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో కోటంరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యాంశాలివీ..
ఆర్కే: మీరు ఇప్పుడు వైసీపీ దృష్టిలో ద్రోహా? లేక స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న పోరాటయోధుడా?
శ్రీధర్‌రెడ్డి: వైసీపీకి దూరంగా జరిగాను కాబట్టి నన్ను ఆ పార్టీ ద్రోహిగా చూస్తోంది. జగన్‌కు నా మీద నమ్మకం సన్నగిల్లిన తర్వాత.. నమ్మకం లేని చోట ఉండకూడదు. ఉండాలని ప్రయత్నించినా విధిలేని పరిస్థితి తెచ్చారు. కొంత సమయం తీసుకుని చూడాలని మిత్రులు, శ్రేయోభిలాషులు చెప్పారు. నెల క్రితం వరకూ వైసీపీని వీడాలని నాకు లేదు. ఆ తర్వాత జరిగిన సంఘటనతోనే ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంలో.. అధికారం ఇంకా 15 నెలలు ఉంది.. ఆఖరి రోజుల్లో వెళ్లొచ్చు అని మిత్రులు చెప్పారు. అయినా మనకు వద్దని అనుకున్న తర్వాత నటించడం నాకు చేతకాదని చెప్పేశా. మా నాయకుడు జగన్‌కు నామీద విశ్వాసం సన్నగిల్లిన తర్వాత.. అధికారం ఎన్నాళ్లు ఉంటుంది.. మళ్లీ వైసీపీ గెలుస్తుందా.. ఇవన్నీ ఆలోచించడం కరెక్టు కాదు.
ఆర్కే: మీమీద నమ్మకం ఎందుకు సన్నగిల్లింది?
శ్రీధర్‌రెడ్డి: ఏ రోజూ నేను జగన్ ఆలోచనలకు భిన్నంగా పని చేయలేదు. ఆయనే కాదు.. వైఎ్‌సతోనూ, రాజారెడ్డిగారితోనూ నాకు అనుబంధం ఉంది. వైఎస్ చనిపోయాక జగన్ పార్టీ పెడతారో లేదో తెలియదు.. ఆయన ఆలోచన ఏమిటో కూడా తెలియదు.. కాంగ్రె్‌సలో జగన్ పరిస్థితి ఏమవుతుందో తెలియదు.. కానీ ఆయన వెంటే ఉన్నాను. ఆ రోజున జగన్‌కు మద్దతుగా చాలామంది ముందుకు రాని సమయంలోనే నేను, అంబటి, కొండా సురేఖ, గట్టు రామచంద్రరావు తదితరులం ముందుకొచ్చాం. ఐదేళ్లు ప్రతిపక్ష కాలంలో కూడా ఆయనతోనే ఉన్నాను. వారికి నచ్చని పని ఏదైనా జీవితంలో చేశాను అంటే.. అది చేయాలని చేసింది కాదు.. మానవత్వంతో చేసింది. అమరావతి రైతులు యాత్ర చేస్తూ జిల్లాలోకి వచ్చిన సమయంలో.. నా నియోజకవర్గంలో ప్రజలు వరద ప్రాంతాల్లో చిక్కుకున్న సమయంలో నేను పర్యటిస్తున్నా. ఆ దారిలోనే అమరావతి రైతులు ఉంటే వారి దగ్గరకు వెళ్లి పరిచయం చేసుకోవాలనుకున్నా. అయితే వారు నన్ను గుర్తుపట్టి పలకరించారు. వారు విడిది చేసిన భవంతిలోకి వెళ్తే అక్కడున్న మహిళలు నన్ను చూసి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నేను సున్నిత మనస్కుడిని. వారి బాధను చూసి కళ్లు చెమర్చాయి. ఆ సమయంలోనే వారు నన్ను జై అమరావతి అని నినదించమంటే.. చాలా స్పష్టంగా చెప్పాను. నేను వచ్చింది మీ ఉద్యమానికి మద్దతు పలకడానికి కాదు.. ఈ వరదలో ఉండలేరు.. మీకు మెయిన్‌రోడ్‌లో ఉన్న మండపంలో కావలసిన ఏర్పాట్లు చేస్తానని అన్నాను. వారిని చూసిన తర్వాత వారిని పెయిడ్ ఆర్టిస్టులని ఎవరూ అనుకోరని కొన్ని వేలమందికి చెప్పాను. కడుపు రగిలి.. ఒక ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాన్ని, తమ త్యాగాన్ని మరో ప్రభుత్వం గుర్తించకపోవడంతో వాళ్లు దగా పడి ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలూ ఉన్నారు. అదే జగన్ గారికి కోపం తెప్పించింది.
ఆర్కే: జగన్ మిమ్మల్ని పిలిచి అడిగారా?
శ్రీధర్‌రెడ్డి: కాస్త గట్టిగానే అడిగారు. నువ్వు చేసింది కరెక్టు కాదన్నారు. ఇలా చేయడమేంటని అన్నారు. అన్నా.. నేను చేసినదాని వల్ల మన పార్టీ గౌరవం.. మీ గౌరవం పెరుగుతుందన్నాను. నేను అక్కడ జై అమరావతి అనలేదు.. మా నాయకుడు చేసిన నిర్ణయమే నాకు శిరోధార్యమని అమరావతి రైతులకే చెప్పానన్నాను. 2020 నుంచి అమరావతి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. నాకు మాత్రం ఆ అమరావతి రైతుల పరామర్శతోనే వైసీపీలో కష్టాలు మొదలయ్యాయని క్రమేణా అర్థమైంది.
ఆర్కే: అది మనసులో పెట్టుకుని మీకు ఏ పదవీ
ఇవ్వలేదు. అయితే ట్రిగ్గర్ ఆఫ్ వార్ ఎక్కడైంది?
శ్రీధర్‌రెడ్డి: నాలుగు నెలల ముందు ఒక జూనియర్ ఐపీఎస్ అధికారి నాకు ఫోన్ చేశారు. మీ ఫోన్.. ట్యాపింగ్ జాబితాలో ఉంది జాగ్రత్తని చెప్పారు. పార్టీపరంగా నేను సవాళ్లు విసరను.. అవతల వాళ్లను అని.. అనిపించుకోను.. నా ఫోన్ ట్యాపింగ్‌లో పెట్టడం ఏమిటని అడిగాను. అవన్నీ నాకు తెలియదు.. మరో గంటలో మీ ఫోన్ ట్యాపింగ్‌లోకి వెళ్తుందని చెప్పారు. నేను నమ్మలేదు. ఇతను జగన్ దగ్గరకు ఏదైనా పని కోసం వెళ్తే ఆయన చేసి ఉండరు.. నేను సీఎంకు దగ్గరగా ఉంటాను కాబట్టి ఒక రాయి జగన్ నెత్తిన వేశారేమో అనుకున్నా.
ఆర్కే: ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని అధికార పార్టీలో అందరికీ తెలుసు. మంత్రి సహా ఎవరైనా ఇప్పుడు వాళ్ల ఫోన్లలో స్వేచ్ఛగా మాట్లాడగలరా?
శ్రీధర్‌రెడ్డి: అధికారంలో ఎవరుంటే వారు అన్ని రకాల వ్యవస్థలను ఇష్టారీతిన వాడుకుంటున్నారు. అయితే 175 స్థానాల్లో జగన్ ఓడిపోతారని తెలిసినా నేను ఆయనతోనే ఉంటాను.. అలాంటి నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారు.. ఇంకా ఎవరిపైనైనా నిఘా పెట్టమని నాకే బాధ్యతలు ఇస్తారన్న విశ్వాసం ఉండేది. అది గుడ్డి నమ్మకమని ఇప్పుడు తెలుస్తోంది. నెల ముందు నిఘా విభాగం డీజీ సీతారామాంజనేయులు వారి సెల్ నుంచే నా సెల్‌కు ఆడియో పంపారు. నేను మళ్లీ ఫోన్ చేస్తే.. మేమేం ట్యాపింగ్ చేయలేదన్నారు. మీరెందుకు సార్ భుజాలు తడుముకుంటున్నారు.. మీరు ట్యాప్ చేశారని నేనన్నానా.. ఆ వాయిస్ నాదే.. అని ఆయనతో అన్నాను.
ఆర్కే: జనవరి 2న జగన్ పిలిపించారు కదా!
శ్రీధర్‌రెడ్డి: అవును.. 1న పిలుపు వస్తే.. మర్నాడు ఆయన్ను కలిశాను. ఏం శ్రీధర్.. విషయాలు ఏమిటని అడిగారు. మీరు చెప్పినవాటిలో కొన్ని జీవోలు వచ్చినా ఆర్థికపరమైన అనుమతులు రాలేదు.. కొన్ని జీవోలైతే అసలు రాలేదని చెప్పాను. వెంటనే ధనుంజయ్‌రెడ్డిగారిని పిలిచి తొందరగా చేయమని చెప్పారు. ఎంతలోపు అవుతాయని అడిగాను.. నెలలోపు చేస్తానని ధనుంజయ్‌రెడ్డి చెప్పారు. నెలయినా అతీగతీ లేదు.
ఆర్కే: ట్యాపింగ్ గురించి జగన్ ఏమైనా అడిగారా?
శ్రీధర్‌రెడ్డి: ఆధారాల్లేకుండా ఎలా అడుగుతాం? ఆ రోజు వరకూ నేను జగన్ భక్తుడినే కదా! ఆ ఐపీఎస్ మాటలను నేను నమ్మలేదు కదా! సీతారామాంజనేయులు ఆడియో పంపిన తర్వాత.. నాకు ఇష్టమైన ఆలయానికి వెళ్లి ఒంటరిగా ఓ గంట కూర్చుని ఆలోచించుకుని.. నమ్మకం లేనిచోట ఇక ఉండకూడదని నిర్ణయం తీసుకున్నా. ప్రాణానికి ప్రాణంగా ఆరాధించిన జగనే నన్ను అనుమానించారు. ఆయన్ను నాయకుడిగా మాత్రమే కాదు.. ఒక నెల్సన్ మండేలాలా, చేగువేరాలా, భగత్‌సింగ్‌లా, సుభాష్ చంద్రబో్‌సలా, ఒక చంద్రశేఖర్ ఆజాద్‌లా ఆరాధించాను. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. జగన్ నన్ను ఎమ్మెల్యేను చేశారు అనేలా ఆరాధించాను.
ఆర్కే: మీరు చంద్రబాబుతో చీకట్లో కలిసి.. మాట్లాడి.. టికెట్ హామీ తీసుకుని ఇదంతా మొదలుపెట్టారని.. హామీ దొరికిఉండకపోతే అన్నిటినీ దిగమింగుకుని ఉండేవారని అంటున్నారు..!
శ్రీధర్‌రెడ్డి: ట్యాపింగ్‌తోనే కదా ఈ నిర్ణయం తీసుకున్నాను. నాలుగు నెలల ముందే సమాచారం ఉన్నా నమ్మలేదు. ఆధారం దొరికిన వెంటనే నిర్ణయం తీసుకున్నా. ఆ తర్వాత నేను ఏం చేశానన్నది ఎవరికీ సంబంధం లేని విషయం కదా!
ఆర్కే: రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎందుకు అంతమంది మీద రౌడీయిజం చేశారు?
శ్రీధర్‌రెడ్డి: గెలిచిన తొలి మూడునెలల్లో కొన్ని తప్పులు చేసిన మాట వాస్తవం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనం ఇలా అధికార మదం ఎక్కించుకోకూడదని నాకు నేనే ఆత్మపరిశీలన చేసుకున్నాను. నావల్ల బాధపడిన వారికి అప్పట్లోనే వారి ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పి వచ్చాను. నన్ను ఇష్టపడేవారికి, వ్యతిరేకించే వారికి క్షమాపణలు చెబుతున్నాను.
ఆర్కే: చీకట్లో చంద్రబాబును కలిసింది వాస్తవమేగా?
శ్రీధర్‌రెడ్డి: నెలముందు వరకూ ఏ ఆలోచనా లేదు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఎవరిని కలిసినా దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. మౌనంగా నిష్క్రమిద్దామనుకున్నా. నన్ను కెలికి, రెచ్చగొట్టి ఇలా మాట్లాడే పరిస్థితికి తెచ్చారు. నాకు బాలినేని, పేర్ని, కొడాలి నానిలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఆర్కే: ఇప్పుడు వారితోనే తిట్టించారు కదా!
శ్రీధర్‌రెడ్డి: జగన్ పిలిచి ఇది నువ్వు మాట్లాడాలని చెబితే మాట్లాడక తప్పదు కదా! ఎవరైనా మాట్లాడతారు. ఇక మాపార్టీకి చెందిన 30-35 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంపీలు నాకు ఫోన్ చేసి మా ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతున్నాయి. నువ్వు బయటపడ్డావు.. మేం బయటపడలేదని చెప్పారు. అభద్రతా భావం అందరిలో ఉంది. ట్యాపింగ్ మీద ఫిర్యాదు చేస్తాను. వదిలేది లేదు.
ఆర్కే: మీ మిత్రుడే రికార్డు చేశారని బాలినేని అంటున్నారు
శ్రీధర్‌రెడ్డి: దొరికిన తర్వాత దానికి ఏదో విధంగా ఫుల్‌స్టాప్ పెట్టాలని కొత్త విన్యాసాలేమో! ప్రభుత్వం మీది. వ్యవస్థలు మొత్తం మీ చేతుల్లో ఉన్నాయి. మీరనుకుంటే ఏమైనా చేయొచ్చు. ట్యాపింగ్ జరిగి ఉంటే భగవంతుడు నాకు న్యాయం చేస్తాడు. అలా కాకుండా నేనే నానాయాగీ చేసి ఉంటే దేవుడే నాకు శిక్ష వేస్తాడు. దేవుడు, ప్రకృతి బలంగా ఉన్నాయని నమ్ముతా.
ఆర్కే: మీరు చేసే కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్‌కు ఇబ్బందులు వస్తాయేమో?
శ్రీధర్‌రెడ్డి: బలిపీఠం ఎక్కుతానా.. అమరుడిని అవుతానా.. వీరుడిని అవుతానా.. నేను అన్నిటికీ సిద్ధం. ఇంకా 15 నెలలు అధికారం ఉంది. అధికార పార్టీకి దూరం అయినప్పుడు ఏం జరుగుతుందో తెలియని అమాయకుడిని కాదు. ఇక్కడ ఇంకోటి ఉంది. పోనీలే పాపం.. మన శ్రీధర్ మనతో కష్టాల్లో ఉన్నాడు.. నాయనకు దగ్గరగా ఉన్నాడు.. ఏదో దూరంగా జరిగాడులే, వదిలేద్దాంలే అని జగన్ అనుకున్నా కూడా పక్కనున్న శక్తులు మౌనంగా ఉండే ప్రశ్నే లేదు.
ఆర్కే: అంటే జగన్‌పై కొంత సానుకూలత ఉంది?
శ్రీధర్‌రెడ్డి: ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎంతో బాధ ఉంది. జగన్‌ను ఎంతో ప్రేమించా. ఆరాధించా. నాకు ఇలా జరిగి ఉండకూడదని అనుకుంటున్నా. ఆయనపై నాకున్న బాధ కసిగా మారకూడదని కోరుకుంటున్నా.
ఆర్కే: జగన్ మీ మీద పగ పడతారు కదా!
శ్రీధర్‌రెడ్డి: జగన్ సీఎం.. వైసీపీ అధ్యక్షుడు. తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి తాపత్రయపడతారు. నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను కాబట్టి కోపం ఉండొచ్చు. రాజకీయ వ్యూహాలనేవి చెప్పినా ఫలించవు. మన వ్యూహం ప్రత్యర్థికి తెలిసేలోపు కొత్త వ్యూహం వేయాలి. ఇవన్నీ జరిగేలోపు ఎన్నికలు అయిపోవాలి. తర్వాత ప్రత్యర్థి ఎందుకు ఓడిపోయానో అని పోస్టుమార్టం చేసుకోవాలి.
ఆర్కే: వైసీపీలో అసంతృప్తి తీవ్రంగా ఉందనేది నిజమేనా?
శ్రీధర్‌రెడ్డి: అసంతృప్తి ఉందన్నది కచ్చితంగా నిజమే. ఇంకా 15నెలలు అధికారం ఉంది. ఆ అసంతృప్తి పెరిగినా ప్రభుత్వం పడే పరిస్థితి లేదు కదా టీడీపీలో చేరితే కచ్చితంగా ఆ పార్టీ కోసమే పని చేస్తా. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తా. అయితే వ్యక్తిగతంగా జగన్‌పై కసి పెంచుకుని తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, తిట్టడం వంటి పనులకు నేను వ్యతిరేకం. చంద్రబాబు, లోకేశ్ అవకాశం ఇస్తే పోటీచేస్తా. జిల్లాలో పది సీట్లలో టీడీపీ గెలిచేందుకు పనిచేస్తా. అంకితభావంతో ఉంటా.
ఆర్కే: ప్రస్తుతానికి మీ లక్ష్యం.. ఫోన్ ట్యాపింగ్ నిజమని నిరూపించుకోవడం?
శ్రీధర్‌రెడ్డి: క్లియర్ ఎవిడెన్స్. వారు మరోదానికి కూడా సమాధానం చెప్పుకోవాలి. నిఘా చీఫ్ అంటే ముఖ్యమంత్రి కళ్లూ, చెవులు. ఆయన నుంచే ఆడియో వచ్చిందంటే అంతకంటే ఆధారం ఏం కావాలి? వాళ్లు కూడా నిరూపించుకోవాలి కదా! అది ఆయన నుంచి కాదు.. ప్రభుత్వం నుంచే వచ్చిందనుకుంటున్నా.
ఆర్కే: బిహార్ పోతా.. స్టాలిన్ పార్టీ ఉందిగా!
శ్రీధర్‌రెడ్డి: రాజకీయాలు నాకు శ్వాస, ధ్యాస, ఆశ. నన్ను ఇక్కడున్న వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ అన్ని పార్టీలు.. నాయనా నువ్ మాకొద్దు అనుకున్నా కూడా... బిహార్ పోయి తేజస్వి యాదవ్, యూపీ పోయి ములాయం కొడుకు అఖిలేశ్‌ని లేదా మాయవతినో కలిసి ఆ పార్టీలో పదవి కాగితం ఇవ్వండని అడిగి తెచ్చుకుని వాహనానికి జెండా కట్టుకుని తిరుగుతా. దానికంటే.. అక్కడికి పోవాలంటే విమానం ఎక్కాలి కాబట్టి పక్కనే ఉన్న తమిళనాడుకు పోయి స్టాలిన్ దగ్గరకు పోయి ఆ పార్టీ పదవి తెచ్చుకుంటే మనకు మూడు వేల మంది ఓటర్లు కూడా ఉన్నారు. దానికి ఓ మిత్రుడు అదంతా ఎందుకన్నా.. ఇప్పుడు బీఆర్‌ఎస్ ఉంది కదా.. పెద్ద సంఖ్యలో సెటిలర్లు ఉన్నారు.. అడిగితే ఎమ్మెల్యే సీటు కూడా వస్తుందని సరదాగా అన్నాడు.