Varahi Yatra: వారాహి యాత్రకు అడుగడుగునా ఆంక్షలు.. మండిపడుతున్న జనసైనికులు

ABN , First Publish Date - 2023-08-10T10:55:53+05:30 IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Varahi Yatra: వారాహి యాత్రకు అడుగడుగునా ఆంక్షలు.. మండిపడుతున్న జనసైనికులు

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వారాహి యాత్రకు (Varahi Yatra) పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించడంపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు (గురువారం) మధ్యహ్నం జనసేనాని విశాఖకు రానున్నారు. అయితే ఎయిర్‌పోర్టులో పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అదేవిధంగా ఎయిర్‌పోర్టు ఆవరణలో ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. మధ్యాహ్న సమయంలో సిటీలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందంటూ పవన్ వెళ్ళే రూట్‌లో మార్పులు చేర్పులు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి షీలానగర్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ నుంచి టూ టౌన్ మీదుగా వెళ్లాలని పోలీసులు షరతులు విధించారు. కానీ జనసేన నాయకులు ఎయిర్‌పోర్టు నుంచి ఎన్ఏడి కొత్త రోడ్ తాటిచెట్లపాలెం, న్యూకాలనీ మీదుగా సిటీలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము చెప్పిన రూట్‌లోనే వెళ్ళాలని పోలీసులు పట్టు పడుతుండగా.. అది కుదరదని జనసేన నాయకులు చెబుతున్నారు. కేవలం పవన్ కళ్యాణ్‌ను ఎవ్వరూ చూడకూడదని లూప్ లైన్ రూట్‌లో పంపాలని పోలీసులు ప్రత్నిస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు.


కాగా.. ఈరోజు విశాఖలో పవన్ వారాహి మూడవ విడత యాత్ర ప్రారంభంకానుంది. ఈరోజు నుంచి 19 వరకు వారాహి విజయయాత్ర కొనసాగనుంది. విశాఖలో వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ నేడు విశాఖకు చేరుకోనున్నారు. అమరావతి నుంచి విమానంలో 11 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఎన్‌ఏడి కూడలి మీదుగా నగరంలోని దశపల్లా హోటల్‌కు చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు జగదాంబ జంక్షన్‌లో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. 5 గంటల నుంచి 9 గంటల వరకు వారాహి విజయయాత్ర సభ జరుగనుంది.

Updated Date - 2023-08-10T10:55:53+05:30 IST