Budget 2023: బడ్జెట్ తర్వాత కొన్ని వస్తువులు మరింత ప్రియం! ఈ జాబితాలో ఏమున్నాయంటే..
ABN , First Publish Date - 2023-01-10T17:29:41+05:30 IST
కేంద్ర బడ్జెట్ 2023 (Union Budget2023) ప్రవేశపెట్టడానికి ఇంకా కొంత సమయమే ఉంది. 20 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో బడ్జెట్ కూర్పులో కేంద్ర ప్రభుత్వం (Central Govt) నిమగ్నమైంది.
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023 (Union Budget2023) ప్రవేశపెట్టడానికి ఇంకా కొంత సమయమే ఉంది. 20 రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో బడ్జెట్ కూర్పులో కేంద్ర ప్రభుత్వం (Central Govt) నిమగ్నమైంది. వివేకంతో ఆర్థిక నిర్వహణతోపాటు దీర్ఘకాల వృద్ధికి (Long-term Growth) కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీర్ఘకాల లక్ష్యాల్లో భాగంగా బడ్జెట్ ప్లాన్స్‌లో (Budget Plans) కస్టమ్స్ డ్యూటీ పెంపు (Customs duty) ఉండొచ్చని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ తెలిపింది. కస్టమ్స్ డ్యూటీ పెంపు సాధ్యాసాధ్యాలకు సంబంధించి మొత్తం 35 వస్తువుల జాబితాను సిద్ధం చేస్తోందంటూ పేర్కొంది. ఈ జాబితాలో అధిక విలువైన కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు (High-end Electronics), కొన్ని ప్లాస్టిక్ వస్తువులు (Plastic goods), నగలు (Jewellery), హై-గ్లాస్ పేపర్ (High Glass Paper), విటమిన్స్(Viamins), ప్రైవేట్ జెట్స్ (Private jet), హెలికాప్టర్స్ (Helicopters) ఈ జాబితాలో ఉన్నాయి. దిగుమతులను గణనీయంగా తగ్గించి దేశీయంగా తయారీకి ప్రాధాన్యత ఇవ్వడమే దీని వెనుకున్న ప్రభుత్వ లక్ష్యమని ఒక అధికారి తెలిపినట్టు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.
దిగుమతి సుంకం పెంపు ద్వారా దిగుమతులను నిరుత్సాహపరిస్తే కరెంట్ ఖాతా లోటును కూడా తగ్గించుకోవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం 2022 రెండవ త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు 4.4 శాతానికి పెరిగిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇదే విషయమై.. దిగుమతి సుంకాల పెంపునకు అవకాశమున్న నిత్యావసరేతర వస్తువుల జాబితాలను అందించాలంటూ వేర్వేరు మంత్రిత్వశాఖలను గత నెల్లోనే వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ కోరింది.
దీర్ఘకాల లక్ష్యంలో భాగమే..
నిత్యావసరేతరాలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు అంశం ప్రభుత్వ వ్యూహాత్మక దీర్ఘకాల లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా దిగుమతుల భారాన్ని క్రమంగా తగ్గించుకోవాలనుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దిగుమతుల భారం కారణంగా భారత్ పొరుగునే ఉన్న 2 దేశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రణాళికబద్ధంగా వ్యహరించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత బడ్జెట్‌లో పలు వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ప్రణాళికలో భాగంగా వచ్చే బడ్జెట్‌లో కూడా కొన్ని వస్తువుల రేట్లు పెంపు తప్పకపోవచ్చని చెబుతున్నారు. రానున్న సాధారణ ఎన్నికలు-2024 దృష్టిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం దీర్ఘకాల వృద్ధిపైనే ఫోకస్ చేయనుందని డీబీఎస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ తైముర్ బేగ్ విశ్లేషించారు.