Air India : గోవా-ఢిల్లీ విమానంలో దారుణం.. సిబ్బందిపై దాడి చేసిన ప్రయాణికుడు..
ABN , First Publish Date - 2023-05-30T17:55:03+05:30 IST
గోవా-ఢిల్లీ విమానంలో దురుసుగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు ఎయిరిండియా తెలిపింది.
న్యూఢిల్లీ : గోవా-ఢిల్లీ విమానంలో దురుసుగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు ఎయిరిండియా (Airindia) తెలిపింది. విమానంలోని సిబ్బందిని మాటలతో దూషించడమే కాకుండా, సిబ్బందిలోని ఓ వ్యక్తిపై భౌతిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. విమానం నుంచి దిగిన తర్వాత కూడా ఆ ప్రయాణికుడు దురుసు ప్రవర్తనను కొనసాగించినట్లు చెప్పింది. ఈ సంఘటన సోమవారం జరిగినప్పటికీ, మంగళవారం వెలుగులోకి వచ్చింది.
ఎయిరిండియా విడుదల చేసిన ప్రకటనలో, ఎయిరిండియా విమానం ఏఐ882లో ఓ ప్రయాణికుడు మే 29న విమానం సిబ్బందిని మాటలతో దూషించారు. సిబ్బందిలో ఒకరిపై భౌతిక దాడి చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా ఆ ప్రయాణికుడు దురుసు ప్రవర్తనను కొనసాగించారు. ఆయనను ఢిల్లీ (Delhi) విమానాశ్రయంలోని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఈ సంఘటనపై నియంత్రణ సంస్థ డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)కు నివేదిక సమర్పించినట్లు తెలిపింది. ఇదిలావుండగా, ఆ ప్రయాణికుడి వివరాలను ఎయిరిండియా ప్రకటనలో వెల్లడించలేదు. విమానం సిబ్బంది, ప్రయాణికుల భద్రతకు తాము పెద్ద పీట వేస్తామని తెలిపింది. బాధిత సిబ్బందికి అన్ని రకాల సహకారం అందజేస్తామని తెలిపింది.
తరచూ జరుగుతున్న సంఘటనలు
ఇటీవలి కాలంలో విమాన ప్రయాణికులు రెచ్చిపోతున్న సంఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 10న ఢిల్లీ-లండన్ విమానంలో జస్కిరట్ సింగ్ అనే ప్యాసింజర్ దురుసుగా ప్రవర్తించి, ఇద్దరు మహిళా కేబిన్ సిబ్బందికి భౌతిక హానికి తెగబడ్డారు. రెండేళ్లపాటు విమానయానం చేయకుండా సింగ్‌పై ఎయిర్‌లైన్స్ నిషేధం విధించింది. సింగ్‌పై ఢిల్లీ పోలీసులకు ఎయిరిండియా ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
దురుసు ప్రవర్తనను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి ఏమిటంటే...
లెవెల్ 1 : శారీరక సైగలు, హావభావాలు, నోటి మాటలతో వేధింపులు, మితిమీరి మద్యపానం చేయడం
లెవెల్ 2 : వ్యక్తులను తోయడం, నెట్టడం, గుద్దడం, లైంగిక వేధింపులు
లెవెల్ 3 : ప్రాణాపాయం కలిగించే చర్యలు, విమానం ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు నష్టం కలిగించడం, ప్రాణాలు కోల్పోయే విధంగా దాడి చేయడం.
నేర తీవ్రతనుబట్టి దోషిని ఎంత కాలం విమానయానం నుంచి బహిష్కరించాలో సంబంధిత విమానయాన సంస్థకు చెందిన ఇంటర్నల్ కమిటీ నిర్ణయిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Moscow : రష్యా రాజధానిపై డ్రోన్ల దాడి
Delhi excise policy scam : మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు