Bangalore: బెంగళూరులో వాళ్లను ఉండనీయకూడదని ప్రభుత్వం నిర్ణయం.. వాపసు పంపేందుకు హోం శాఖ కసరత్తు

ABN , First Publish Date - 2023-02-23T11:00:03+05:30 IST

రాజధాని బెంగళూరు(Bangalore) నగరంలో వీసా గడువు ముగిసినప్పటికీ 600 మందికి పైగా విదేశీయులు తిష్ట

Bangalore: బెంగళూరులో వాళ్లను ఉండనీయకూడదని ప్రభుత్వం నిర్ణయం.. వాపసు పంపేందుకు హోం శాఖ కసరత్తు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరు(Bangalore) నగరంలో వీసా గడువు ముగిసినప్పటికీ 600 మందికి పైగా విదేశీయులు తిష్ట వేసినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరందరినీ వారి దేశాలకు వాపసు పంపేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన యువతిని ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)కు చెందిన యువకుడు వివాహమాడి బెంగళూరులో కాపురం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చాక నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పాక్‌ యువతిని స్వదేశానికి తిప్పి పంపిన తరహాలోనే నగరంలో తిష్ట వేసిన ఆఫ్రికా(Africa) దేశాలకు చెందిన వారిని కూడా వాపసు పంపే ప్రయత్నాలు చేపట్టినట్టు నగర పోలీసు యంత్రాంగం వెల్లడించింది. బెంగళూరులో అక్రమంగా తిష్ట వేసిన 400 మందికి పైగా విదేశీయులపై క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయని వీరిలో కొందరు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉండగా మరికొందరు బెయిల్‌పై బయటకు వచ్చారని పోలీసు వర్గాలు అంటున్నాయి.

34 మందిని వెనక్కి పంపారు

బెంగళూరులో అక్రమంగా తిష్టవేసిన విదేశీయుల్లో ఇంతవరకు 34 మందిని గుర్తించి వారి దేశాలకు తిప్పి పంపారు. వీరిలో ఆఫ్రికా, నైజీరియా, బంగ్లాదేశ్‌ వాసులు ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరో 50 మందిని అదుపులోకి తీసుకుని బెంగళూరు నగర శివారులోని నెలమంగల సొండేకొప్ప డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచారు. ఆయా దేశాల రాయబార కార్యాలయాలకు సమాచారం అందించారు. అటువైపు నుంచి గ్రీన్‌సిగ్నల్‌(Greensignal) రాగానే మరో నెలరోజుల్లో వీరిని కూడా తిప్పి పంపాలని భావిస్తున్నారు.

తూర్పు ప్రాంతంలోనే అధికం

రాజధాని నగరంలోని తూర్పు ప్రాంతాలైన బాణసవాడి, రామమూర్తినగర్‌, హెణ్ణూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆఫ్రికా దేశాలకు చెందినవారు పెద్దసంఖ్యలో నివసిస్తున్నారు. వీరిలో 40 మంది వీసా గడువు ముగిసినా కూడా తిష్ట వేసినట్టు గుర్తించిన ఈశాన్య విభాగం పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. రెండో విడత తనిఖీలు చేపట్టాల్సిందిగా నగర పోలీసులకు హోంశాఖ నుంచి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది.

మరో డిటెన్షన్‌ సెంటర్‌

నెలమంగలలోని సొండేకొప్ప డిటెన్షన్‌ సెంటర్‌లో కేవలం 50 మందిని మాత్రమే ఉంచేందుకు అవకాశం ఉంది. అక్రమంగా తిష్ట వేసిన విదేశీ మహిళలను తుమకూరులో ఉంచేందుకు వీలుగా అక్కడ ఒక డిటెన్షన్‌ కేంద్రం, బెంగళూరు నగరంలో మరో డిటెన్షన్‌ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర హోంశాఖ విదేశీయుల రిజిస్ట్రేషన్‌ ప్రాంతీయ కార్యాలయం (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అధికారులను కోరినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు.

ఇదో సుదీర్ఘ ప్రక్రియ

వీసా గడువు ముగిసినప్పటికీ నగరంలో తిష్ట వేసిన విదేశీయులను ఒక్కసారిగా విదేశాలకు పంపడం సాధ్యం కాదని ఇదొక సుదీర్ఘ ప్రక్రియ అని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ శరణప్ప అంటున్నారు. వీసా అవధి ముగిసిన విదేశీయుల కదలికలపై డేగకన్ను వేసి ఉంచామన్నారు. ప్రత్యేకించి ఇలా అక్రమంగా నివసిస్తున్నవారిలో కొందరు మాదక ద్రవ్యాల(Drugs) వ్యవహారం, వ్యభిచార కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నట్టు తేలిందన్నారు. విదేశీయులను తిప్పి పంపేందుకు తొలుత ఆ దేశ రాయబార కార్యాలయాలతో చర్చించాల్సి ఉంటుందని, ఈలోపు వారిపై మనదేశంలో దాఖలైన క్రిమినల్‌ కేసులు క్లియర్‌ కావాల్సి ఉంటుందని శరణప్ప వివరించారు. పైగా అక్రమంగా తిష్ట వేసిన విదేశీయులను తిరిగి స్వీకరించేందుకు ఆయా దేశాలు అంగీకరించాల్సి ఉంటుందని, వారి ప్రయాణ ఖర్చులు భరించాల్సి ఉంటుందని వివరించారు. ఈ ప్రధాన కారణాల వల్లనే విదేశీయులు అక్రమంగా తిష్ట వేసినా వారిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు.

Updated Date - 2023-02-23T11:01:45+05:30 IST