Budget2023: కేంద్ర బడ్జెట్ సరే.. మీ బడ్జెట్ సంగతేంటి.. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయో, పెరుగుతాయో చూడండి..
ABN , First Publish Date - 2023-02-01T15:37:42+05:30 IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (NirmalaSitharaman) 87 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో (Budget2023 Speech) కొన్ని కీలక ప్రకటనలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల లోపు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (NirmalaSitharaman) 87 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో (Budget2023 Speech) కొన్ని కీలక ప్రకటనలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల లోపు (2024 Parliament Elections) ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని టీవీల్లో వీక్షించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ స్పీచ్ పూర్తిగా చూసి, విన్న తర్వాత ఏఏ వస్తువుల ధరలు పెరగనున్నాయో (Costlier), ఏఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయో (Cheaper) క్లారిటీ వచ్చేసింది.
ముఖ్యంగా ఆదాయపన్ను పరిమితి పెంపు, కొన్నిరకాల వస్తు, సేవల పన్ను శాతాల తగ్గింపు వంటివాటిని నిర్మల ప్రకటిస్తారని, తమకు ఊరట కలిగిస్తారని బీజేపీకి అత్యంత కీలకమైన ఓటుబ్యాంకుగా ఉన్న మధ్య, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎదురుచూశారు. బీజేపీ వ్యూహాత్మకంగానే వారి ఆశలను నిజం చేసింది. పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం తగ్గించింది. దీంతో.. టీవీలు, మొబైళ్లు, కెమెరాలు, లెన్స్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ (Customs Duty) 2.5శాతం తగ్గించింది. లిథియం బ్యాటరీలపై 21 నుంచి 13శాతానికి కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయని కేంద్ర బడ్జెట్‌తో స్పష్టమైనప్పటికీ కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరగనుండటం కూడా గమనార్హం. టైర్లు, సిగరెట్ల ధరలు (Cigarettes) భారీగా పెరగనున్నాయి. సిగరెట్లపై 16 శాతం పన్ను పెంపుతో పొగరాయుళ్ల జేబులకు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వజ్రాలు, బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో బంగారం, వెండి ధరలు (Gold Prices) కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. బ్రాండెడ్ దుస్తుల ధరలు పెరగనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెరగనుంది. వీటితో పాటు మరికొన్ని వస్తువుల ధరలపై కేంద్ర బడ్జెట్ ప్రభావం ఏమేర ఉండబోతోందో తెలుసుకోండి..
ధరలు తగ్గనున్న వస్తువులివే..
* మొబైల్ ఫోన్లు (Mobile Phones)
* మొబైల్ ఫోన్ల విడి భాగాల ధరలు
* టీవీ ప్యానల్స్ (TV Panel)
* ఎలక్ట్రిక్ వాహనాలు
ధరలు పెరగనున్న వస్తువులివే..
* గోల్డ్ బార్స్ నుంచి తయారయ్యే బంగారు ఆభరణాలు
* సిగరెట్లు
* వెండి
* ఇమిటేషన్ జువెలరీ (గిల్ట్ నగలు)
* ఎలక్ట్రానిక్ కిచెన్ చిమ్నీ
* దిగుమతి చేసుకుని అమ్మే బొమ్మలు, సైకిల్స్
* దిగుమతి చేసుకుని విక్రయించే ఎలక్ట్రానిక్ వాహనాలు
2019లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు పెట్టబోతున్న ఆఖరు బడ్జెట్ ఇదే. వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో.. మధ్య తరగతి వర్గమే టార్గెట్‌గా కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.