Chennai: గవర్నర్‌కు వ్యతిరేకంగా నల్లజెండాల ప్రదర్శన
ABN , First Publish Date - 2023-08-25T09:04:55+05:30 IST
వాణిజ్యనగరం కోయంబత్తూరులో గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi)కి వ్యతిరేకంగా తందై పెరియార్ ద్రావిడర్ కళగం ఆధ్వర్యంలో
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వాణిజ్యనగరం కోయంబత్తూరులో గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi)కి వ్యతిరేకంగా తందై పెరియార్ ద్రావిడర్ కళగం ఆధ్వర్యంలో గురువారం ఉదయం నల్లజెండాల ప్రదర్శన జరిగింది. కోయంబత్తూరు(Coimbatore) భారతీయార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్ వెళ్ళారు. నీట్ వ్యతిరేక బిల్లుపై సంతకం చేయనంటూ గవర్నర్ అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఖండిస్తూ, డీఎంకే ప్రభుత్వం ప్రతిపాదించే బిల్లులను తిప్పిపంపటాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు కోయంబత్తూరు లాలీ రోడ్డులో నల్లజెండాలు పట్టుకుని ప్రదర్శన జరిపారు. గవర్నర్ రాకకు అరగంట ముందే ఆ ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు నల్లజెండాలతో ఊరేగారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారు. ప్రదర్శనలో పాల్గొన్న 50 మంది కార్యకర్తలను అరెస్టు చేసి వ్యాన్లలో తరలించారు. ఈ సంఘటన కారణంగా ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పట్టాల ప్రదానం...
కోయంబత్తూరులోని భారతీయార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో గవర్నర్ ఆర్‌ఎన్ రవి పాల్గొన్ని 93 వేల మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. 1382 మందికి పీహెచ్‌డీ, 334 మంది ఎంఫిల్ పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఆర్ట్స్ విభాగంలో పదివేలమందికిపైగా విద్యార్థులు గవర్నర్ చేతులమీదుగా పట్టాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతవిద్యాశాఖ మంత్రి పొన్ముడి, ప్రధాని ఆర్థిక సలహాకమిటీ సభ్యుడు సంజీవ్ సన్యాల్ తదితరులు పాల్గొన్నారు.