Congress : లండన్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై శశి థరూర్ ఘాటు స్పందన
ABN , First Publish Date - 2023-03-17T15:23:24+05:30 IST
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదని ఆ పార్టీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదని ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) అన్నారు. బీజేపీ తెలివిగా రాజకీయాలు చేస్తోందన్నారు. భారత దేశ ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని లండన్ పర్యటనలో రాహుల్ గాంధీ చెప్పడంతో ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
శశి థరూర్ ఇండియా టుడే కాన్ఫరెన్స్, 2023లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ చేస్తున్న డిమాండ్‌ను ప్రస్తావించినపుడు థరూర్ మాట్లాడుతూ, బీజేపీ తెలివిగా రాజకీయాలు చేస్తోందన్నారు. క్షమాపణ చెప్పవలసినదేమీ లేదన్నారు. ఆయన మాట్లాడని మాటలకు ఆయనను నిందితునిగా చేశారన్నారు. ఆ ఆరోపణలపైనే వారు నిలబడగలుగుతున్నారన్నారు. మన ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవాలని ఆయన ఇతర దేశాలను కోరలేదన్నారు. అటువంటి వాక్యం ఒకటి కూడా లేదని చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గతంలో విదేశాలకు వెళ్లినపుడు చాలాసార్లు భారత దేశం 65 ఏళ్ళలో ఏమీ మారలేదని చెప్పేవారన్నారు. ఆ వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెబితే, విదేశాల్లో మాట్లాడిన మాటలకు ప్రతి ఒక్కరూ క్షమాపణ చెబుతారన్నారు. రాహుల్ గాంధీ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదన్నారు.
రాహుల్ ఏమన్నారంటే...
రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో మాట్లాడుతూ, భారత దేశ ప్రజాస్వామిక మౌలిక నిర్మాణం కిరాతక దాడికి గురవుతోందని, పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. అన్ని వ్యవస్థల్లోనూ బీజేపీ, ఆరెస్సెస్ చొచ్చుకెళ్లాయని ఆరోపించారు. ఈ ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని పార్లమెంటులో బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలావుండగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘‘కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటుండటం దురదృష్టకరం. దేశం పదే పదే తిరస్కరిస్తుండటంతో రాహుల్ గాంధీ ఇప్పుడు దేశ వ్యతిరేక (anti-nationalist) టూల్‌కిట్‌లో భాగస్వామిగా మారారు’’ అన్నారు. భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో వేరొక దేశం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
weddings: భర్తలతో పాటు భార్యలకు కూడా తప్పడం లేదు..
Karnataka : బంగ్లాదేశీయుల రాకతో మన సంస్కృతికి ముప్పు : హిమంత బిశ్వ శర్మ