Land for jobs Case : కోర్టుకు హాజరైన లాలూ దంపతులు
ABN , First Publish Date - 2023-03-15T10:24:58+05:30 IST
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి బుధవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. భూములు తీసుకుని
న్యూఢిల్లీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి బుధవారం ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. భూములు తీసుకుని రైల్వే ఉద్యోగాలు ఇచ్చిన కేసులో వీరితోపాటు ఇతర నిందితులు కూడా కోర్టుకు హాజరుకాబోతున్నారు. రైల్వే మంత్రిగా లాలూ పని చేసిన కాలంలో ఈ కుంభకోణం జరిగినట్లు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ - CBI) ఆరోపిస్తోంది.
రౌస్ ఎవెన్యూ కోర్టుకు వచ్చినవారిలో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి (Rabri Devi), వారి కుమార్తె మీసా భారతి (Misa Bharati) ఉన్నారు. రైల్వే ఉద్యోగార్థులు తమ భూములను లాలూ (Lalu Prasad Yadav) కుటుంబ సభ్యులకు అమ్మడం కానీ, బహుమతిగా ఇవ్వడం కానీ చేశారని, అందుకు ప్రతిఫలంగా వారు రైల్వే ఉద్యోగాలను పొందారని సీబీఐ ఆరోపిస్తోంది. లాలూ 2004-2009 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా పని చేసిన కాలంలో ఈ కుంభకోణం జరిగినట్లు పేర్కొంది. నియామకాల కోసం భారతీయ రైల్వేలు అనుసరించే విధానాలను, ప్రక్రియలను ఉల్లంఘించి, ఈ నియామకాలు జరిగినట్లు సీబీఐ ఛార్జిషీట్‌లో తెలిపింది. ఉద్యోగార్థులు స్వయంగా తాము కానీ, తమ కుటుంబ సభ్యుల ద్వారా కానీ లాలూ కుటుంబ సభ్యులకు తమ భూములను ఇచ్చారని తెలిపింది. అమ్మిన సందర్భాల్లో మార్కెట్ విలువలో ఐదో వంతుకు అమ్మారని పేర్కొంది.
లాలూ, రబ్రీ, మీసాలను మార్చి 15న హాజరుకావాలని స్పెషల్ జడ్జి గీతాంజలి గోయల్ ఫిబ్రవరి 27న ఆదేశించారు. ఈ మేరకు వీరు బుధవారం కోర్టుకు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి :
Minister: ఆ పరీక్షకు హాజరుకాని విద్యార్థులకు మరో అవకాశం
Kotamreddy: ఏపీ అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెరైటీ నిరసన