Parliament : రాజకీయ స్థిరత్వంపై రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-31T12:35:48+05:30 IST

వరుసగా రెండుసార్లు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu)

Parliament : రాజకీయ స్థిరత్వంపై రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు
President Draupadi Murmu

న్యూఢిల్లీ : వరుసగా రెండుసార్లు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ధన్యవాదాలు తెలిపారు. తన ప్రభుత్వం (ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం) ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తుందని, విధానపరమైన వ్యూహాన్ని సమూలంగా మార్చే దృఢనిశ్చయాన్ని ప్రదర్శిస్తుందన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 2047నాటికి వందేళ్లు పూర్తవుతుందని, అభివృద్ధి చెందిన దేశంగా భారత దేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పాతికేళ్ళ కాలం అమృత కాలమని చెప్పారు. మనమంతా, దేశంలోని ప్రతి పౌరుడు మన కర్తవ్యాలను ఆచరించడంలో అత్యున్నత స్థాయిని ప్రదర్శించవలసిన సమయం ఇది అని తెలిపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముర్ము లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం మాట్లాడారు.

యువ శక్తి, నారీశక్తి...

2047 నాటికి మన దేశాన్ని పూర్వ వైభవం, ఆధునిక కాలపు సువర్ణాధ్యాయాల అనుసంధానంతో నిర్మించాలని ఆకాంక్షించారు. నేడు ప్రతి భారతీయుడి ఆత్మ విశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉందన్నారు. నేడు ప్రపంచం మనల్ని చూస్తున్న తీరు అద్భుతమని తెలిపారు. గతంలో మనం ప్రపంచంపై ఆధారపడేవారమని, ఇప్పుడు ప్రపంచమే మనపై ఆధారపడుతోందని చెప్పారు. ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతున్నామని చెప్పారు. పేదరికంలేని భారత దేశాన్ని నిర్మించాలన్నారు. మధ్య తరగతి ప్రజలు కూడా సంపన్నులు కావాలన్నారు. సమాజానికి, దేశానికి దిశా నిర్దేశం చేయడానికి యువత, నారీశక్తి ముందు వరుసలో ఉండాలని తెలిపారు. కాలానికి రెండు అడుగులు ముందు నిలిచే యువత గల దేశంగా భారత దేశం ఎదగాలన్నారు.

అవినీతి గురించి...

ప్రజాస్వామ్యానికి, సాంఘిక న్యాయానికి అతి పెద్ద శత్రువు అవినీతి అని తన ప్రభుత్వానికి స్పష్టమైన అభిప్రాయం ఉందన్నారు. అందుకే గత కొన్ని సంవత్సరాల నుంచి అవినీతిపై నిరంతర పోరాటం జరుగుతోందన్నారు. అదే సమయంలో నిజాయితీపరులకు గౌరవం దక్కే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక నేరాలకు పాల్పడి, పరారయ్యే నేరగాళ్ళ ఆస్తులను జప్తు చేసేందుకు ఫ్యూజిటివ్ ఎకనమిక్ అఫెండర్స్ యాక్ట్‌ను తన ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తన ప్రభుత్వంలో జవాబుదారీతనం పెరిగిందని తెలిపారు. అవినీతి రహిత దేశంగా మారే దిశగా భారత్ పయనిస్తోందన్నారు.

పన్నుల గురించి...

పన్ను చెల్లింపుదారులు తాము చెల్లించిన పన్ను రిఫండ్ కోసం గతంలో సుదీర్ఘ సమయం ఎదురు చూడవలసి వచ్చేదని తెలిపారు. నేడు ఐటీఆర్ (Income Tax Return)ను దాఖలు చేసిన కొద్ది రోజుల్లోనే రిఫండ్ పొందగలుగుతున్నారన్నారు. నేడు పారదర్శకతతోపాటు జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) ద్వారా పన్ను చెల్లింపుదారుల గౌరవ, మర్యాదలకు భరోసా లభిస్తోందని తెలిపారు.

శాశ్వత సంస్కరణలు

ఒక దేశం-ఒకే రేషన్ కార్డ్‌, జన్‌ ధన్-ఆధార్-మొబైల్ నంబర్ల అనుసంధానం వల్ల బూటకపు లబ్ధిదారులను తొలగించగలిగినట్లు తెలిపారు. అతి పెద్ద శాశ్వత సంస్కరణను అమలు చేశామని చెప్పారు. కొన్ని సంవత్సరాల నుంచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT), డిజిటల్ ఇండియా ద్వారా శాశ్వత, పారదర్శక వ్యవస్థను సిద్ధం చేసిందన్నారు.

రాజకీయ అస్థిరత గురించి...

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత నెలకొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచంలో రాజకీయ అస్థిరత ఎక్కడ ఉన్నా, ఆ దేశాలు పెద్ద ఎత్తున సంక్షోభంలో చిక్కుకుంటాయని ద్రౌపది ముర్ము తెలిపారు. తన ప్రభుత్వం దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాల వల్ల భారత దేశం ఇతర దేశాలతో పోల్చినపుడు మెరుగైన స్థితిలో ఉందని తెలిపారు.

వందేళ్ళలో అతి పెద్ద సంక్షోభం (కోవిడ్ మహమ్మారి) వచ్చిందని, ఆ తర్వాత అనేక పరిణామాలు సంభవించాయని, అటువంటి పరిస్థితులను పరిష్కరించడంలో సుస్థిర, నిర్ణయాత్మక ప్రభుత్వం వల్ల కలిగే ఫలితాలను, ప్రయోజనాలను మనం నేడు పొందుతున్నామని చెప్పారు.

రక్షణ దళాలపై...

నరేంద్ర మోదీ నేత‌త్వంలోని ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా రక్షణ రంగంలో ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయని ద్రౌపది ముర్ము చెప్పారు. ఐఎన్ఎస్ విక్రాంత్ రూపంలో తొలి స్వదేశీ విమాన వాహక నౌక నావికా దళంలో చేరడం గర్వకారణమని తెలిపారు.

మోదీ ప్రభుత్వం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆయుధాలు, మందుగుండు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఇతర పరికరాలను మన దేశంలోనే తయారు చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తోంది.

ద్రౌపది ముర్ము గత ఏడాది రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ఆ తర్వాత పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించడం ఇదే తొలిసారి. సంప్రదాయం ప్రకారం సంవత్సరంలో మొదట జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఆసీనులైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి ముర్ము ప్రసంగించారు. అంతకుముందు, ముర్ముకు ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ (Jagdeep Dhankar), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), లోక్‌సభ సభాపతి ఓం బిర్లా (Om Birla), తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.

Updated Date - 2023-01-31T14:48:31+05:30 IST