Rajinikanth : యోగి ఆదిత్యనాథ్‌కు రజినీకాంత్ పాదాభివందనం.. నెటిజన్ల ఆగ్రహం..
ABN , First Publish Date - 2023-08-20T16:58:57+05:30 IST
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) పాదాభివందనం చేయడాన్ని కొందరు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రం ఆయనను సమర్థిస్తూ, ఆయన ఎంతో అణకువగల వ్యక్తి అని అభినందిస్తున్నారు.
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) పాదాభివందనం చేయడాన్ని కొందరు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రం ఆయనను సమర్థిస్తూ, ఆయన ఎంతో అణకువగల వ్యక్తి అని అభినందిస్తున్నారు. ‘జైలర్’ సినిమా విడుదల నేపథ్యంలో రజినీకాంత్ లక్నోలో యోగితోపాటు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను కూడా కలిశారు.
రజినీకాంత్ శనివారం లక్నోలో యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన యోగికి పాదాభివందనం చేసినట్లు కనిపిస్తున్న వీడియో వైరల్ అయింది. దీనిపై ఆయన ఫ్యాన్స్ సానుకూలంగా స్పందిస్తుండగా, ఓ వర్గం యూజర్లు మాత్రం ఇది చాలా దిగ్భ్రాంతికరమని, బాధాకరమని మండిపడుతున్నారు.
‘జైలర్’ సినిమా విడుదల సందర్భంగా రజినీకాంత్ శుక్రవారం ఉత్తర ప్రదేశ్ చేరుకున్నారు. లక్నోలో శనివారం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. యోగికి నమస్కారం చేసిన తర్వాత ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛాన్ని సమర్పించారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
రజినీకాంత్ తీరుపై కొందరు ఎక్స్ యూజర్లు ఘాటుగా స్పందించారు. ‘‘ఈ నెలలో అత్యంత బాధాకరమైన, ముఖాన్ని చేతుల్లో దాచుకోవలసిన, దిగ్భ్రాంతికరమైన వీడియో ఇది’’ అని ఓ ఎక్స్ యూజర్ మండిపడ్డారు.
‘‘ఈ మనిషి (రజినీకాంత్) తమిళనాడుకు సిగ్గుచేటు. ఆధ్యాత్మికత అంటే ఆత్మగౌరవాన్ని కోల్పోవడం కాదు’’ అని మరొక యూజర్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘ఎంత పతనం!! 72 ఏళ్ల రజినీకాంత్ 51 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకడం..’’ అని మరో వ్యక్తి రాశారు.
‘‘ఇది దిగ్భ్రాంతికరం’’ అని ఓ యూజర్ స్పందించారు.
మరో వ్యక్తి ఇచ్చిన సుదీర్ఘమైన పోస్ట్‌లో, ‘‘ఆయన (రజినీకాంత్) ఇతర హీరోల్లాగా కేవలం ఓ నటుడు అయితే ఈ సంఘటన గురించి అంతగా పట్టించుకునేవాడిని కాదు. ఆయన దక్షిణ భారత దేశానికి ప్రముఖుడు. గుర్తింపు పొందిన అతి కొద్ది మంది సెలబ్రిటీల్లో ఆయన ఒకరు. ముఖ్యంగా ఢిల్లీలో, నేను తమిళుడినని పరిచయం చేసుకున్నపుడు, రజినీకాంత్ అంటే మాకు ఇష్టం అని చెప్తూ ఉంటారు. హిందీలో తమిళ సినిమాలను చూస్తుంటామని చెప్తూ ఉంటారు. తమిళనాడు అనే పేరుగల రాష్ట్రం ఒకటి ఉందనే విషయం చాలా మందికి తెలియదు కానీ, రజినీకాంత్‌ను మాత్రం వారికి తెలుసు. ఆయన ఆ గౌరవాన్ని కాపాడుకోవలసింది. ఉత్తరాదివారికి దీనిలో ఎలాంటి తప్పు కనిపించకపోవచ్చు కానీ, తీవ్ర నిరుత్సాహానికి గురైనది మేం’’ అని దుయ్యబట్టారు.
రజినీకాంత్‌ను సమర్థిస్తూ ఓ ఎక్స్ యూజర్ ఏం చెప్పారంటే, ‘‘తలైవర్ హిందువునని కేవలం అభినయించరు, ఆయన మనస్ఫూర్తిగా నిజమైన హిందువు. అందుకే కొందరికి తెలియకపోయినప్పటికీ, సన్యాసులకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో ఆయనకు తెలుసు. అందుకే ఆయన గోరఖ్‌నాథ్ మఠాధిపతి పట్ల తన గౌరవ భావాన్ని చాటుకున్నారు. ఆ మఠాధిపతి వయసులో తన కన్నా 20 ఏళ్లు చిన్నవారైనప్పటికీ, గౌరవాన్ని ప్రదర్శించారు’’ అని తెలిపారు.
మరో యూజర్ స్పందిస్తూ, రజినీకాంత్‌కు ఆధ్యాత్మిక విశ్వాసం చాలా బలంగా ఉందని తెలిపారు. యోగికి పాదాభివందనం చేయడంలో తప్పేమీ కనిపించడం లేదని, ఆశీర్వాదాలు తీసుకోవాలని ఎవరైనా అనుకుంటే, అది వారి ఇష్టమని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
Congress : సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ.. గాంధీలతో పాటు సచిన్, థరూర్‌లకు చోటు..