Bihar Caste census: బీహార్‌లో కులగణనపై జోక్యానికి సుప్రీంకోర్టు 'నో'
ABN , First Publish Date - 2023-10-06T14:24:26+05:30 IST
బీహార్ రాష్ట్రంలో కులగణనపై 'స్టే' ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై జోక్యానికి సుప్రీంకోర్టు శుక్రవారంనాడు నిరాకరించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలువరించలేమని తెలిపింది.
న్యూఢిల్లీ: బీహార్ (Bihar) రాష్ట్రంలో కులగణన (Caste census)పై 'స్టే' ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై జోక్యానికి సుప్రీంకోర్టు (Supreme court) శుక్రవారంనాడు నిరాకరించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిలువరించలేమని తెలిపింది. నలంద నివాసి అఖిలేష్ కుమార్, ఎన్జీవో 'ఏక్ సోచ్ ఏక్ పర్యాస్' సహా పలువురు వేసిన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రకటించింది. కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ పిటిషనర్లు సుప్రీంకోర్టును అశ్రయించారు.
బీహార్ సర్వే వివరాలు..
నితీష్ కుమార్ ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రంలో కులగణనపై ఇటీవల సర్వే జరిపింది. సర్వే వివరాలను విడుదల చేసింది. రాష్ట్రంలో 13.07 కోట్ల జనాభా ఉండగా, వీరిలో ఓబీసీలు, ఈబీసీలు 63 శాతం ఉన్నారు. వీరిలో ఈబీసీలు 36 శాతం కాగా, ఓబీసీలు ఆ తర్వాత స్థానంలో 27.13 శాతంగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కులానికి చెందిన ఓబీసీ గ్రూప్‌లోని యాదవులు మొత్తం జనాభాలో 14.27 శాతం ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల్లోకి వచ్చే దళితులు 19.65 శాతం ఉన్నారు. ఎస్‌టీలు సుమారు 22 లక్షలు అంటే 1.68 శాతం ఉన్నారు.