Share News

Supreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు.. ఆ పది బిల్లుల్ని ఎందుకు తిప్పి పంపారు..

ABN , First Publish Date - 2023-11-21T08:11:57+05:30 IST

చీటికిమాటికి బిల్లుల్ని పెండింగ్‌లో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)పై

Supreme Court: మూడేళ్లుగా ఏం చేస్తున్నారు.. ఆ పది బిల్లుల్ని ఎందుకు తిప్పి పంపారు..

- 8 కోట్ల మందికి నష్టం కలిగిస్తారా

- గవర్నర్‌ తీరుపై ‘సుప్రీం’ ఆగ్రహం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): చీటికిమాటికి బిల్లుల్ని పెండింగ్‌లో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)పై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము నోటీసులు ఇచ్చిన తరువాతే పెండింగ్‌లో ఉన్న పది బిల్లుల్ని ప్రభుత్వానికి తిప్పి పంపుతారా అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ కాలయాపన ద్వారా 8 కోట్లమంది ప్రజానీకానికి నష్టం చేకూరుస్తారా అంటూ నిగ్గదీసింది. ఆ పది బిల్లుల్ని రాష్ట్రప్రభుత్వం మళ్లీ అసెంబ్లీలో ఆమో దించి గవర్నర్‌కు పంపినందున, దానిపై గవర్నర్‌ ఎలా స్పందిస్తారో చూస్తామంటూ తదుపరి విచారణను డిసెంబరు 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది. శాసన సభ ఆమోదించిన కీలకమైన బిల్లు లను ఆమోదించకుండా తీవ్రజాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ గవర్నర్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం ఉదయం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

సుదీర్ఘకాలం పెండింగ్‌లో...

తొలుత రాష్ట్రప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ఏఎం సింఘ్వీ వాదనలను వినిపిస్తూ... రాష్ట్ర గవర్నర్‌ ఇటీవల తిప్పి పంపిన 10 బిల్లులు సహా 15 బిల్లులను యేళ్ల తరబడి బుట్టదాఖలు చేశారని, శాసనసభ ఆమోదించిన కీలకమైన బిల్లుల్ని ఇలా సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచడం భావ్యం కాదని ఇదివరకే సర్వోన్నత న్యాయస్థానం హితవు పలి కిందంటూ గుర్తు చేశారు. బిల్లులను దీర్ఘ కాలం పెండింగ్‌ లో ఉంచి, ఆ తరువాత తిప్పి పంపడం ద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ పాలనను గవర్నర్‌ స్తంభింపజేస్తున్నట్లేనని వివరించారు.

మూడు రోజుల తర్వాత...

మరో సీనియర్‌ న్యాయవాది విల్సన్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ బిల్లులను గవర్నర్‌ ఇలా నెలల తర బడి పెండింగ్‌లో ఉంచడాన్ని పట్టించు కోకుండా ఉంటే ప్రభుత్వ యంత్రాంగం అచేతనమవుతుం దన్నారు. ఈ వాదనలను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకట రమణి దృష్టికి తీసుకెళ్లిన ధర్మాసనం.. ఈనెల 13న పది బిల్లులను గవర్నర్‌ ప్రభుత్వానికి తిప్పి పంపి నట్లు చెబుతున్నారని, ఈ నెల 10న ఈ పిటిషన్‌ లపై తాము కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసిన మూడు రోజుల తర్వాత వాటిని తిప్పి పంపడ మేంటని ప్రశ్నించింది. ఆ బిల్లులన్నీ 2020 నుండే బుట్టదాఖలై ఉండటం చూస్తే న్యాయస్థానం నోటీసు జారీ చేసే తర్వాతే ఆయన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. అలాంటప్పుడు గవర్నర్‌గా ఆయన మూడేళ్లపాటు ఏం చేశారని ప్రశ్నించింది. ప్రభుత్వాలు న్యాయస్థానాలను ఆశ్రయించేంతవరకు గవర్నర్లు ఇలా వేచి చూడటం ఎందుకని మండిపడింది.

గవర్నర్‌ హక్కులకు భంగం...

అటార్నీ జనరల్‌ వివరణ ఇస్తూ.. విశ్వవిద్యాలయాలకు వైస్‌ఛాన్సలర్లను నియమించే వ్యవహారంలో గవర్నర్‌కున్న హక్కులను హరించే విధంగా ఉండటం వల్ల, ఆ బిల్లులను పునఃసమీక్షించడానికి తిప్పి పంపారన్నారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆ బిల్లులు 2020 జనవరి నుండే పెండింగ్‌లో ఉన్నాయి కదా అని ప్రశ్నించింది. అటార్నీ జనరల్‌ బదులిస్తూ ఆర్‌ఎన్‌ రవి 2021 నవంబర్‌లో గవర్నర్‌ బాధ్యతలు చేపట్టారని తెలిపారు. బిల్లులను ఓ గవర్నర్‌ మాత్రమే పెండింగ్‌లో ఉంచినట్లు తాము చెప్పటం లేదని, సాధారణంగానే గవర్నర్లు ఇలా బిల్లులను పెండింగ్‌లో ఉంచి ఎందుకు కాలయాపన చేస్తున్నారన్నదే తమ ప్రశ్న అని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ.. గవర్నర్‌ తిప్పి పంపిన పది బిల్లుల్ని గత శనివారం శాసనసభ మళ్లీ ఆమోదించినట్లు పంపినట్లు వివరించారు. దీంతో గవర్నర్‌ తదుపరి చర్యలపై వేచి చూస్తామంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

Updated Date - 2023-11-21T08:11:59+05:30 IST