Work Visa Rules: విదేశీయులను ఆకర్షించేందుకు డెన్మార్క్ మాస్టర్ ప్లాన్.. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!
ABN , First Publish Date - 2023-04-04T11:52:10+05:30 IST
విదేశాల్లో స్థిరపడాలని ఎవరికి ఉండదు చెప్పండి.
ఎన్నారై డెస్క్: విదేశాల్లో స్థిరపడాలని ఎవరికి ఉండదు చెప్పండి. అక్కడ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ అక్కడే ఉండిపోవాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారికి యూరప్ దేశం డెన్మార్క్ (Denmark) బంపర్ ఆఫర్ ఇచ్చింది. అంతర్జాతీయంగా ప్రతిభ కలిగిన వారిని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా తాజాగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను( Denmark Immigration ) సడలించింది. దీనిలో భాగంగానే వర్క్ పర్మిట్ ఫాస్ట్-ట్రాక్ స్కీంను విస్తరించింది. ఈ నిర్ణయంతో విదేశీయులకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలనేది డెన్మార్క్ ఆలోచన. ఇక డెన్మార్క్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం దేశంలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు(Foreign Students) వారి యూనివర్సిటీ డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగం పొందేందుకు ఇప్పటి వరకు ఉన్న గడువును మరింత పెంచినట్లైందని అక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 23న ఆ దేశ పార్లమెంట్ విదేశీయుల చట్టాన్ని సవసరించంది. ఈ సవరణలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.
ప్రస్తుతం యూరోప్‌లోని ఇతర దేశాల మాదిరిగానే డెన్మార్క్ కూడా తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటోంది. ఆ దేశంలో ముఖ్యంగా సైన్స్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్, టీచింగ్, ఐటీ, ఫైనాన్స్ వంటి రంగాల్లో డిగ్రీ స్థాయి వరకు చదువుకున్న వారి కొరత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ జాబితాలోకి వచ్చే ఉద్యోగం మీరు పొందితే.. ఈజీగా రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఇక్కడ ఉద్యోగం పొందడానికి బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ అవసరం అవుతుంది. కాగా, నైపుణ్యం కలిగిన కార్మికుల జాబితాలో ప్రధానంగా సైన్స్, ఇంజినీరింగ్, బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, బుక్ కీపింగ్ వంటి రంగాల్లో ఎన్నో జాబ్స్ ఉన్నాయట. ఒక వేళ మీరు ఆయా రంగాలకు చెందిన డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉంటే మీకు ఆ దేశంలో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది.