TANA: 'తానా' మహాసభల వేదికపై అస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్
ABN , First Publish Date - 2023-06-18T08:55:51+05:30 IST
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.
TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. తెలుగు సినీరంగంలో పాటల రచయితగా ఉన్న చంద్రబోస్‌ను తానా మహాసభలకు ఆహ్వానించినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు.
తెలుగు పాటను విశ్వ వేదిక మీద నిలబెట్టి భారతదేశం తరఫున ఆస్కార్ పురస్కారం అందుకున్న తొలి గేయ రచయితగా చంద్రబోస్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ పాటను రాసిన చంద్రబోస్‌ను అమెరికాలోని ప్రవాసాంధ్రులు ఎంతోమంది అభినందించారు. అలాంటి చంద్రబోస్‌తో నేరుగా మాట్లాడే అవకాశాన్ని తానా మహాసభలు కల్పిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా తానా మహాసభలకు వచ్చి చంద్రబోస్ మాటలను, తెలుగు పాటలోని గొప్పదనాన్ని ఆయన మాటల్లోనే వినండి. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశాన్ని వదులుకోకండి. మహాసభల్లో పాల్గొనేందుకోసం వెంటనే మీ పేర్లను రిజిష్టర్ చేసుకోండి.