Target Kuppam : కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ పదే పదే చెప్పడం వెనుక ఇంత కుట్ర దాగుందా.. బాగోతం బట్టబయలు..!
ABN , First Publish Date - 2023-07-25T22:40:59+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) ఆగడాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) అండ్ కో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ (YSR Congress) ఆగడాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) అండ్ కో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. మరోవైపు.. కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా ఓడించడానికి వైసీపీ లేనిపోని కుయుక్తులు పన్నుతోందని తేటతెల్లమైంది.! ఓడించడం వీలుకాకపోతే కనీసం మెజార్టీ అయినా తగ్గించాలని వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. గత నాలుగైదు రోజులుగా ఏపీ వ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తోంది. ఇంతకీ వైసీపీ చేసిన ప్లానేంటి..? ఎలా బయటికొచ్చింది..? కుప్పంనే ఎందుకు టార్గెట్ చేసింది..? వైసీపీ కుట్రను తెలుగు తమ్ముళ్లు ఎలా బట్టబయలు చేశారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
ఇంత బరితెగింపా..!?
కుప్పంలో చంద్రబాబును (Chandrababu Kuppam) ఓడించాలని వైసీపీ.. లక్ష మెజార్టీ తగ్గకూడదని టీడీపీ వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి.!. ఎన్నికల ముందు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ వస్తోంది వైసీపీ.! అయినప్పటికీ బాబు కంచుకోటను (Babu Kanchukota) కదిలించేందుకు వైసీపీ శక్తి సరిపోలేదట. కుప్పంను సీఎం వైఎస్ జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minsiter Peddireddy) చాలా సీరియస్‌గా తీసుకున్నారట. అందుకే భరత్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం, నెలలో నాలుగైదు సార్లు పెద్దిరెడ్డి కుప్పంలో తిష్టవేయడం.. ఇక స్వయంగా జగనే ఈ నియోజకవర్గం నుంచి ప్రారంభోత్సవాలు, బటన్ నొక్కడాలు పని పెట్టుకున్నారు. ఎన్ని చేసినా, ఎన్ని ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టినా ప్రయోజనం లేదట. దీంతో.. భారీ కుట్రకు వైసీపీ తెరతీసిందట. అదే ‘దొంగ ఓట్లాట’..! బయటికి వ్యక్తులకు దొంగ ఓటరు కార్డులను ఎలాంటి డోర్ నంబర్లు లేకుండా తయారుచేయించడమే వైసీపీ పనిగా పెట్టుకుందట. అయితే.. తిరుపతి ఉపఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన స్థానిక, పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో నుంచే దొంగ ఓట్లపై సందేహాలు లేవనెత్తింది. అయితే ఎన్నికల సంఘం తెలుగు తమ్ముళ్ల ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు దొంగ ఓట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాయి. అయితే.. ఓటర్ల జాబితాను పరిశీలించిన ప్రతిపక్ష పార్టీలు అందులోని లొసుగులు చూసి విస్తుపోతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఒకే డోర్ నంబర్‌లో పదులు, వందల సంఖ్యలో ఓట్లు నమోదై ఉండటం, అసలు డోర్ నెంబరే లేకుండా లేకుండా మరికొన్ని ఉండటం, స్థానికులే కాని వారు పేర్లతో ఓట్లు ఉండటం వంటి లీలలు ఎన్నో బట్టబయలయ్యాయి. ఇంటి నంబర్ల వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. అయితే బీఎల్వోల ఓటరు సర్వే గనుక పారదర్శకంగా జరిగితే చాలానే బయటపడతాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాకపోతే వైసీపీ కార్యకర్తల్లా మారిన వలంటీర్లను వెంటబెట్టుకుని తిరుగుతున్న బీఎల్వోలు వాస్తవాలను వెలికి తీయగలరా అనే అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. దొంగ ఓట్ల నమోదుకు వైసీపీనే బరితెగించిందని.. ఇది వందకు వెయ్యిశాతం నిజమేనని ప్రతిపక్షాలు బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి.
కుప్పం కథ ఇదీ..!
ఓటర్ల జాబితాల్లో సుమారు 4 లక్షల ఇళ్లకు డోర్ నంబర్లు(Door numbers) కనిపించకపోవడంతో, వీటి వెనుక ఉన్న మతలబు ఏమిటని రాజకీయ పార్టీలు ఆరా తీయడం మొదలు పెట్టాయి. ఇవి దొంగ ఓట్లా? లేక నిజంగానే ఆ ఇళ్లకు నంబర్లు లేవా? అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. అయితే.. ఒక కుప్పంలో మాత్రమే ఇప్పటి వరకూ 2123 ఓట్లు బయటికి వచ్చాయి. ఇవన్నీ కేవలం ఒకట్రెండ్రోజల వ్యవధిలోనే బయటపడ్డాయి. బీఎల్వోల ఓటరు సర్వే గనుక పారదర్శకంగా చేస్తే ఇంకా వేలాది ఓట్లు బయటపడతాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఇదంతా చంద్రబాబును ఓడించే దమ్ము లేక వైసీపీ చేస్తున్న కుట్ర అని తెలుగు తమ్ముళ్లు దుమ్మెత్తి పోస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఓడిస్తాం.. ఓడిస్తామని జగన్ రెడ్డి మొదలుకుని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు చెబుతుంటే ఏదో అనుకున్నాం.. సీన్ కట్ చేస్తే ‘దొంగ ఓట్లాట’తో గెలుచుకోవాలని చూశారన్న మాట. అయితే.. అసలు కథ బట్టబయలు కావడంతో దీనికి కౌంటర్‌గా చిత్రవిచిత్రాలుగా వైసీపీ నుంచి రియాక్షన్ వస్తుండటం గమనార్హం. ఇవన్నీ చంద్రబాబు హయాంలోనే నమోదైన ఓట్లని ఇవే కాదు ఇంకా 25వేల దొంగ ఓట్లు ఉన్నాయని స్వయంగా పెద్దిరెడ్డే మీడియా ముందుకొచ్చి చెప్పడం సిగ్గుచేటు.!. అయితే ఎవరెన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ఈసారి ఎన్నికల్లో లక్షకు మెజార్టీ తగ్గదని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వామ్మో.. మామూలు కథ కాదే..!
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓటర్ల నమోదు తీరుపై గత మూడేళ్ళుగా సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా ఆయా ఓటర్ల జాబితాలపై పెద్దఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ ఏకపక్ష విజయాలకు ఓటర్ల నమోదులో అక్రమాలు కూడా ప్రధాన కారణమన్న ఆరోపణలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇపుడు అందరి దృష్టీ ఓటర్ల జాబితాలపైకి మళ్ళుతోంది. ఇటీవల శాసనమండలి ఎన్నికల సమయంలో తిరుపతి నియోజకవర్గంలో ఒకే డోర్ నంబరులో పదుల సంఖ్యలో ఓటర్లను నమోదు చేయడాన్ని వామపక్షాల నేతలు ఆధారాలతో సహా గుర్తించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.అలాంటివి రానున్న ఎన్నికల్లో జరక్కుండా చూడాలని ప్రతిపక్ష పార్టీలు అధిష్ఠానం నుంచీ గ్రామస్థాయి నాయకుల దాకా ప్రయత్నిస్తున్నారు. వీరికి తోడు పలువురు వ్యక్తులు, సంస్థలు, సంఘాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాయి.
మొత్తానికి చూస్తే.. వైసీపీ చీప్ పాలిట్రిక్స్‌ను మూడేళ్లుగా చిత్తూరు జిల్లాలో నడిపిస్తోందన్న మాట. ఇప్పటికైతే రెండు వేలే దొంగ ఓట్లు బయటపడ్డాయ్. ఇంకా పారదర్శకంగా ఓట్ల పరిశీలన జరిగితే ఇంకెన్ని వేలు బయటికొస్తాయో వేచి చూడాలి మరి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అటు వైసీపీ అధిష్టానం.. ఇటు టీడీపీ పెద్దలు ఎలా ముందుకెళ్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.