YSRCP : వైసీపీ ఎమ్మెల్యేల్లో నరాలు తెగే ఉత్కంఠ.. సరిగ్గా ఇదే టైమ్‌లో సంచలన ప్రకటన చేసిన చెవిరెడ్డి.. ఇంత ధైర్యమేంటో..!?
ABN , First Publish Date - 2023-04-02T20:46:30+05:30 IST
ఏప్రిల్-3న ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది..? సీఎం వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ (CM YS Jagan) తీసుకుంటారా..? అనే దానిపై చిత్రవిచిత్రాలుగా అటు టీవీల్లో.. ఇటు సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఏప్రిల్-3న ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది..? సీఎం వైఎస్ జగన్ బిగ్ డెసిషన్స్ (CM YS Jagan) తీసుకుంటారా..? అనే దానిపై చిత్రవిచిత్రాలుగా అటు టీవీల్లో.. ఇటు సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ రద్దు చేసి.. ముందస్తుకు వెళ్తారని, మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని వార్తలు గుప్పుమంటున్నాయి. కేబినెట్ నుంచి ఎవర్ని తొలగిస్తారో అని మంత్రులు.. తమ టికెట్‌కు ఎక్కడ ఎసరు పడుతుందో అని ఎమ్మెల్యేల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు ఏపీలో ఏ ఇద్దరు చూసినా ఈ విషయాలపైనే చర్చిస్తున్నారు. అయితే అందరు ఎమ్మెల్యేల్లాగా టెన్షన్ ఏమీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలో (Chevi Reddy Bhaskar Reddy) కనిపించలేదు. సీన్ కట్ చేస్తే.. తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో ఆదివారం నిర్వహించిన వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎవరూ ఊహించని రీతిలో సంచలన ప్రకటన చేశారు. సరిగ్గా ఈ సమయంలోనే ఎందుకీ ప్రకటన చేశారు..? అసలు ఈ ప్రకటన చేయడానికి జగన్ నుంచి అన్ని అనుమతులొచ్చాయా..? ఈ ప్రకటన చేసే సరికి ఆత్మీయ సమ్మేళనంలో జనాల నుంచి ఎలాంటి రియాక్షన్లు వచ్చాయ్..? అనే విషయాలపై ప్రత్యేక కథనం..
అసలేం జరిగింది..!?
ఏప్రిల్-3 చుట్టే ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గడప గడపకు మన ప్రభుత్వం (Gadapa Gadapa Ku Mana Prabutvam) కార్యక్రమంపై వైసీపీ ఎమ్మెల్యేలతో (YSRCP MLAs) సీఎం వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో భాగంగా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు..? ఎవరికి టికెట్ ఇస్తారు..? ఎవరికి హ్యాండిస్తారనే దానిపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వారసులెవ్వరికీ టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని.. ఏ ఎమ్మెల్యే కూడా ఆ ఆశలు పెట్టుకోవద్దని ఈసారికి మాత్రం అది జరిగే పని కాదని తేల్చి చెప్పేశారు కూడా. దీనిపై సోమవారం జరగబోయే సమావేశంలో మరోసారి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే జగన్ ఆదేశాలు, సీఎం మాటలను లెక్కచేయకుండా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక ప్రకటన చేసేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని (chevireddy Mohith Reddy) నిలబెడుతున్నామని తనకు తానుగా ప్రకటించేశారు. ఈ ప్రకటనను టీవీల్లో చూసిన వైసీపీ ఎమ్మెల్యే కంగుతిన్నారట. తాము కూడా తమ వారసులను రంగంలోకి దింపాలని భావిస్తున్నామని.. తమను కాదని చెవిరెడ్డికి జగన్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారబ్బా అని తలలు పట్టుకుంటున్నారట.
ఆశీర్వదించండి..!
ఆదివారం నాడు తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నుంచి తాను పోటీచేయట్లేదని ప్రకటించారు. అంతేకాదు.. ప్రత్యక్ష రాజకీయాలనుంచి బయటికెళ్తున్నట్లు చెప్పేశారు. ‘మీ అందరి కళ్లముందు పెరిగిన బిడ్డ.. మీ చేయి పట్టకుని నడిచిన బిడ్డ.. తెలిసీతెలియక ఏదైనా తప్పు చేసి మీ మనస్సుకు కష్టం కలిగించియుంటే పెద్ద మనస్సుతో క్షమించండి.. మీ బిడ్డగా మోహిత్ రెడ్డిని ఆదరించి ఆశీర్వదించండి. 2014 ఎన్నికల నుంచి మీతో పాటే గడపగడపకు తిరుగుతున్నారు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. చంద్రగిరి ప్రజలు రాజకీయ జీవితాన్ని ఇచ్చారు. అందుకే నా కుటుంబం వేరు కాదు.. నా ప్రజలు వేరు కాదన్న భావన నాలో కలిగింది. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు నా శక్తి వంచన లేకుండా పనిచేశాను. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న తనతో పాటు ఉండాలన్న ఒకే ఒక్కమాటకు కట్టుబడి ప్రత్యక్ష రాజకీయాల నుంచి బయటకు వెళుతున్నా.. 2024 ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ముందుండి నడిపించి విజేతగా తీసుకురావాలి’ అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
కార్యకర్తల రియాక్షన్ ఇదీ..!
చెవిరెడ్డి ప్రకటనతో ఆత్మీయ సమ్మేళనంలో సంబరాలు మొదలయ్యాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ.. కరతాళ ధ్వనులతో మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. మోహిత్‌కు తమ మద్దతును పూర్తిగా ఉంటుందని ఇలా తెలియపరచారు. తనను నమ్ముకుని తనతో పాటు ప్రయాణించిన నాయకులు, కార్యకర్తల కష్టాన్ని మరచిపోలేనని , చంద్రగిరి నుంచి రాష్ట్ర స్థాయి నాయకునిగా తనకు గుర్తింపు వచ్చిందంటే అదంతా మీరు పెట్టిన బిక్ష అంటూ చెవిరెడ్డి స్పష్టం తెలిపారు. రాజకీయంగా తన కుటుంబం పట్ల విశ్వాసం చూపించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రగిరి వైసీపీ నేతలు, కార్యకర్తల్లో తమ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చూపిన ప్రేమ, అభిమానాన్ని మోహిత్ రెడ్డి పైనా చూపించారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహిత్ రెడ్డిని ప్రకటించిన తర్వాత వేద పండితుల ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత సుమారు గంటకుపైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువలు, పుష్ప గుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అంతేకాక ప్రజల వద్దకు దగ్గరుండి తీసుకు వెళతామని, 2024 ఎన్నికల్లో గెలిపించి జగనన్నకు కానుకగా అందిస్తామని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీకి పనిచేస్తున్న నేతలు ఆ వేదికపై నుంచి హామీ ఇచ్చారు.
తప్పు జరిగితే క్షమించండి..!
ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి, తిరుపతి రూరల్ మండలం ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ‘ఆత్మీయ సమావేశంకు వచ్చిన అందరి ముందు తాను చాలా చిన్నవాడిని.. తెలియకుండా తప్పు జరిగితే క్షమించి మీ బిడ్డగా సర్దుకుపోండి. మీ అందరిలో ఒక్కడిగా కలసి పెరిగిన నేను 2014, 2019 ఎన్నికల్లో నాన్న గెలుపు కోసం మీ చేయి పట్టుకుని ప్రతి ఇల్లు తిరిగాను. నిత్యం ప్రజల మధ్యన తిరగాలనుకునే నా తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగనన్న దగ్గర ఉండాల్సి రావడంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. నా తండ్రి అడుగుజాడలో మీ అందరి ఆశీస్సులు, జగనన్న ఆశయం సాధనకై జనం ముందుకు వస్తున్న నాకు బాసటగా నిలవాలని అభ్యర్థిస్తున్నాను. గడపగడపకు మహా పాదయాత్రలో మీరు చూపించిన ప్రేమకు వెలకట్టలేను. చంద్రగిరి ప్రజలకు ఏ కష్టం వచ్చినా మీ అందరితో కలసి వారికి అండగా నిలిచేందుకు నేను అన్ని వేళలా సిద్ధంగా ఉంటాను’ అని ఆత్మీయ సభావేదికగా మోహిరెడ్డి హామీ ఇచ్చారు.
అంత నమ్మకమా..!
వైఎస్ ఫ్యామిలీకి (YS Family) మొదట్నుంచీ చెవిరెడ్డి అత్యంత సన్నిహితుడు. వైఎస్ హయాంలో జడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చెవిరెడ్డి.. వైఎస్ జగన్ వైఎస్సార్సీపీని స్థాపించిన తర్వాత చిత్తూరు జిల్లాలో పేరుగాంచిన గల్లా ఫ్యామిలీని (Galla Family) ఓడించే స్థాయికి చేరారు. నాటి నుంచి నేటి వరకూ వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా చెవిరెడ్డి (Chevi Reddy) ఉంటూ వస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ తరఫున గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే జగన్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వస్తారేమో కానీ.. చెవిరెడ్డికి మాత్రం అలాంటివేమీ అక్కర్లేదు.. డైరెక్టుగానే వెళ్లేంత చనువు ఉంది. అలాంటిది జగన్ అనుమతి లేకుండా.. ఆయన ఎలాంటి హామీ ఇవ్వకుండానే చెవిరెడ్డి ఇలా చేసి ఉండరని వైసీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట. మరోవైపు తాను ఏం చేసినా జగన్ కాదనరని.. పక్కాగా ఓకే అంటారని సీఎంకు చెప్పకుండానే ఈ ప్రకటన చేశారని.. ఎలాగో ఏప్రిల్-3న ఇదే ప్రకటన ఉంటుందని ముందుగానే చెవిరెడ్డి ఇలా ఆత్మీయ సభలో మాట్లాడరని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయ్. అసలు ఈ విషయం జగన్‌కు తెలుసో.. తెలియదో అని కూడా ప్రశ్నలు వస్తున్నాయ్. అయితే.. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టే చెవిరెడ్డి ఇంత నమ్మకంతో ప్రకటన చేశారని దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా సోమవారం నాడు ఎమ్మెల్యేలతో సమావేశానికి ముందే చెవిరెడ్డి ఇలా ప్రకటన చేయడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ అయ్యింది.
మొత్తానికి చూస్తే.. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయితే మారారు. అటు టీడీపీ తరఫున కూడా బలమైన అభ్యర్థినే బరిలోకి దింపాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఈ పరిస్థితుల్లో మోహిత్ రెడ్డిని ఏ మాత్రం చంద్రగిరి ప్రజలు ఆదరిస్తారో.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన చెవిరెడ్డి ఏం చేయబోతున్నారు..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.