Rahul disqualification: రాహుల్ ఎపిసోడ్ నేపథ్యంలో కాంగ్రెస్ కీలక వ్యూహం!.. ఏమిటంటే..
ABN , First Publish Date - 2023-03-26T15:26:50+05:30 IST
రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందుకోసం వ్యూహరచనలు, అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది...
రాహుల్ గాంధీపై అనర్హత వేటు నేపథ్యంలో (Rahul disqualification) నెలన్నర రోజుల్లో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) ఘన విజయం సాధించి, బీజేపీకి (BJP) గట్టి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ (Congress) యోచిస్తోంది. తిరిగి కన్నడనాట పట్టు సాధించి, అధికారంలోకి వచ్చేలా వ్యూహరచనలు (Election strategies of Congress) చేసింది. బీజేపీని దునుమాడేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ (Karnataka poll schedule) విడుదలయ్యే అవకాశాలుండడంతో.. దూకుడు పెంచింది. 224 నియోజకవర్గాలకు గాను.. 124 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది(Announcement of Candidates). ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. అభ్యర్థులంతా ప్రచారపర్వాన్ని ప్రారంభించేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ విషయంలో బీజేపీ, జేడీఎస్‌తోపాటు.. కర్ణాటకలో బోణీతో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న బీఆర్ఎస్ (BRS) కంటే.. కాంగ్రెస్ ముందంజలో ఉంది.
భారీ వ్యూహాలే..!
గత ఎన్నికల్లో ఏ పార్టీకైనా భారీ నష్టం కలిగిందా? అంటే.. కాంగ్రెస్ పార్టీనే ముందంజలో ఉంటుంది. 2013లో 122 స్థానాల్లో విజయం సాధించి, అధికారాన్ని చేపడితే.. 2018లో ఏకంగా 42 సీట్లను కోల్పోయి, 80కి పరిమితమైంది. ఆ తర్వాత బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్/కమల్(Operation Akarsh/Operation Kamal)కు కాంగ్రెస్ కకావికలమైంది. బీజేపీకి అంతకు మును 40 సీట్లుండగా.. గత ఎన్నికల్లో ఏకంగా ఆ సంఖ్యను 104కు పెంచుకుని.. ఓట్ల శాతాన్ని 36.35%(16.3% పెరుగుదల)ను నమోదు చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ వ్యూహమంతా ఓట్లశాతం(Percentage of votes)పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న బీజేపీకి వచ్చిన ఓట్ల శాతంతో పోలిస్తే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్ల శాతం ఎక్కువే(38.14%)..! సీట్లు తగ్గినా.. ఓట్లశాతం 1.4 మేర పెరిగింది. దాదాపు 50 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌పై బీజేపీ స్వల్ప మెజారిటీతో గెలిచింది. భారీ మెజారిటీ(Large Majority) వచ్చిన నియోజకవర్గాల(Assembly segments)ను నిలబెట్టుకుంటూనే.. గతంలో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన స్థానలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. శనివారం ప్రకటించిన 124 స్థానాల అభ్యర్థులను సైతం.. ఆయా నియోజకవర్గాల్లో వారికి ఉన్న క్యాడర్(Cadre), కుల సమీకరణలు(Cast Equations), వర్గ సమీకరణలకు అనుగుణంగా చేసిందని, ఈ వ్యవహారాలను ఏఐసీసీ అధ్యక్షుడు(AICC President) మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) దగ్గరుండి, పర్యవేక్షించారని కర్ణాటక కాంగ్రెస్(Karnataka Congress) వర్గాలు చెబుతున్నాయి. బీజేపీలో కీలక నాయకుల స్థానాల్లోనూ.. బలమైన అభ్యర్థులను ఖరారు చేసినట్లు వెల్లడించాయి.
రాహుల్ ఎపిసోడే ప్రచారస్త్రంగా..
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన తీరును కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్త్రం(Campaign Strategy)గా కర్ణాటక ఎన్నికల బరిలోకి వెళ్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా.. రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతి, పాలకుల నియంతృత్వ ధోరణులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. రాహుల్‌తోపాటు.. మాస్ ప్రజల్లో దూసుకెళ్లేలా ప్రియాంక(Priyanka Gandhi)ను రంగంలోకి దింపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా.. ముంబై-కర్ణాటక(Mumbai-Karnataka), హైదరాబాద్-కర్ణాటక(Hyderabad Karnataka) ప్రాంతాల్లో ప్రియాంక ప్రచారం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య కర్ణాటకలోని ఒకట్రెండు సభల్లో సోనియా(Sonia Gandhi) పాల్గొంటారని, రాహుల్(Rahul Gandhi) కూడా కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి డి.శ్రీధర్‌బాబు(D.Sridhar Babu)తో కలిసి.. అన్ని నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తారని సమాచారం.
రంగంలోకి తెలుగు రాష్ట్రాల నేతలు!
స్టార్ కాంపైనర్ల విషయంలో కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టతతో ఉందని తెలుస్తోంది. హైదరాబాద్-కర్ణాటకలో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తారని సమాచారం. ఇక బెంగళూరులోని ఐటీహబ్‌లో తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య(Ponnala Laxmaiah) లాంటివారు రంగంలోకి దిగుతారని తెలుస్తోంది.
పొత్తులుంటాయా??
కాంగ్రెస్ అధిష్ఠానం శనివారం 124 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించడాన్ని బట్టి.. ఒంటరిపోరు వైపే మొగ్గుచూపుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే.. అవగాహనతో కూడిన ఒప్పందాలను బీజేపీయేతర పార్టీలతో చేసుకునే అవకాశాలున్నాయి. ఫలితాలు వచ్చాక.. మ్యాజిక్ ఫిగర్(Magic Figure) రాకుంటే.. ఆయా పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనేది కాంగ్రెస్ యోచనగా కనిపిస్తోంది. అదే జరిగితే.. కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు జేడీఎస్(JDS), బీఆర్ఎస్(BRS) సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. ఒకట్రెండు సీట్లను బీఎస్పీ కూడా సాధించే అవకాశాలుండడంతో.. ఆ పార్టీ మద్దతును కూడా కాంగ్రెస్ కూడగట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభావం ఎంత?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కూడా కర్ణాటక ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్-కర్ణాటక, ముంబై-కర్ణాటకల్లో ఆ పార్టీకి మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.