Election Results 2023: ఈ గెలుపు.. 2024కి బాటలు వేస్తుందా?
ABN , First Publish Date - 2023-03-02T21:41:51+05:30 IST
త్రిపుర(Tripura), మేఘాలయ(Meghalaya), నాగాలాండ్ (Nagaland) శాసనసభలకు
న్యూఢిల్లీ: త్రిపుర(Tripura), మేఘాలయ(Meghalaya), నాగాలాండ్ (Nagaland) శాసనసభలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ(BJP) సత్తా చాటింది.. త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ కూటమి విజయకేతనం ఎగురవేయగా, మేఘాలయలోనూ బీజేపీ చక్రం తిప్పబోతోంది. సీఎం కన్రాడ్ సంగ్మా పార్టీ ఎన్పీపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మార్కును సాధించలేకపోయింది. ఫలితంగా ఇప్పుడు సంగ్మా బీజేపీవైపు చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బీజేపీతో ఆయన చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.
బీజేపీకి కలిసొస్తుందా?
ఎగ్జిట్‌పోల్స్ ఊహించనట్టుగానే ఈ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. మరి ఈ విజయం బీజేపీకి జాతీయ స్థాయిలో ఏ మేరకు మేలుచేస్తుందనే ప్రశ్న ఆ పార్టీ నేతల్లో తలెత్తింది. నిజానికి ఈశాన్య రాష్ట్రాల్లో గెలుపు ఒక గెలుపు కాదనేది విశ్లేషకుల మాట. దీనికి వెనక కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయలేకపోవడం అందులో ప్రధానమైన కారణం. దేశరాజకీయాలు ప్రధానంగా ఉత్తర భారతదేశం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టే ఇటు ఈశాన్య రాష్ట్రాలను కానీ జాతీయ పార్టీలు పెద్దగా పట్టించుకోవు. ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. దీనికి తోడు అక్కడ లోక్‌సభ స్థానాలు కూడా చాలా తక్కువ కావడం అందుకు మరో కారణం.
అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో మార్పు వచ్చింది. ఆ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి ఆ పార్టీ ఇటు తమిళనాడు, కర్ణాటక, కేరళపై బాగా దృష్టి సారించింది. కారణం.. ఈ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు ఎక్కువ కావడమే. ప్రస్తుతం కర్ణాటకను కాషాయ పార్టీ ఏలుతున్నప్పటికీ అనుకున్నంత బలంగా లేదు. కాబట్టి అక్కడ పార్టీని బలోపేతం చేసుకునేందుకు పార్టీ పెద్దలు వ్యూహాలు రచిస్తున్నారు. తరచూ పర్యటనలు చేస్తూ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇక, తమిళనాడులో గత ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసినప్పటికీ తీవ్ర నిరాశే మిగిలింది. అలాగే, కేరళలోనూ ఆ పార్టీ కాలు మోపేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలవుతున్నాయి.
ఇక, మరికొన్ని నెలల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కర్ణాటకలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ శివమొగ్గలో రూ. 450 కోట్లతో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అలాగే, రెండు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇక, తమిళనాడులోనూ ఆ పార్టీ ఉనికి కోసం పాకులాడుతోంది. వచ్చే ఎన్నికల్లో అక్కడ కనీస స్థానాల్లోనైనా గెలిచి ప్రజల దృష్టిని తిప్పుకోవాలని చూస్తోంది.
కాబట్టి ఈశాన్య రాష్ట్రాల్లో గెలుపుతో తమ ఖాతాలో మరో రాష్ట్రం చేరిందని సంబరాలు చేసుకోవడానికి, బలపడుతున్నామని చెప్పుకోవడానికే తప్ప మరేరకంగా అవి బీజేపీకి ఉపయోగపడవని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు.