Pawan Meets CBN : పవన్-చంద్రబాబు ఏకాంత భేటీలో ఏం చర్చించారో పూసగుచ్చినట్లుగా చెప్పిన నాదెండ్ల.. భవిష్యత్తులో..
ABN , First Publish Date - 2023-04-30T12:01:58+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో (TDP Chief Nara Chandrababu) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) భేటీ అయ్యారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో (TDP Chief Nara Chandrababu) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) భేటీ అయ్యారు. ఏపీలో వాడీవేడీగా రాజకీయాలు జరుగుతున్న వేళ ఈ భేటీ జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి శనివారం నాడు స్వయంగా వెళ్లిన పవన్ (CBN-Pawan) సుమారు గంటన్నరపాటు చర్చించారు. పవన్ ఒక్కరే రాగా.. చంద్రబాబు కూడా ఒక్కరే ఏకాంతంగా సమావేశమయ్యారు. గతంలో వారిద్దరూ కలిసిన ప్రతిసారీ తమ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడేవారు. ఈసారి అటువంటిదేమీ జరగలేదు. తమ భేటీ జరిగినట్లుగా ఫొటోలు, వీడియోలు మాత్రమే విడుదల చేశారు. తాజా రాజకీయ పరిణామాలపైనే వారి భేటీ జరిగినట్లు ఆయా పార్టీలవర్గాలు తెలిపాయి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఏం చేయాలి..? ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నదానిపై చంద్రబాబు-పవన్ భేటీలో చర్చించారని తెలుస్తోంది. అయితే నిన్నటి భేటీలో ఏం జరిగింది..? ఏమేం చర్చించారు..? భవిష్యత్తులో మరిన్ని చర్చలు ఉంటాయా..? ఇలాంటి విషయాలపై జనసేన పీఏపీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మీడియాతో మాట్లాడుతూ పూర్తి వివరాలు వెల్లడించారు.
భేటీ వెనుక అసలేం జరిగింది..!?
‘వైసీపీ వ్యతిరేక విధానాలను వ్యతురేకిస్తున్న పార్టీలు ఒక తాటిపైకి రావడం అవసరం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది మా విధానం, నినాదం. నిన్న చంద్రబాబుతో చర్చల్లో అదే కీలక అంశం. భవిష్యత్తులో మరికొన్ని చర్చలు జరుగుతాయి. మంచి ప్రణాళిక, వ్యూహంతో జనసేన అడుగులు వేస్తోంది. అసెంబ్లీ సీట్లపై ప్రచారాలు ఊహాగానాలు మాత్రమే. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో నమ్మకం పోయింది. దానిని భరించలేక దాడులకు పాల్పడుతున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. వైఎస్ జగన్ ఎక్కడ కాపురం పెడితే అక్కడి నుంచే పరిపాలన అనే అభిప్రాయం కల్పించేలా సీఎం వ్యాఖ్యలు చేయడం విచిత్రంగా ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి అమలు చేస్తాం’ అని నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు.
నిన్న భేటీ తర్వాత..!
కొద్దిరోజుల క్రితం పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీలోని వివిధస్థాయి నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలో వారితో చంద్రబాబుతో పవన్ కొంత చర్చించారు. ఆ అంశాలు శనివారం వీరి భేటీలో చర్చకు వచ్చాయని సమాచారం. కర్ణాటక ఎన్నికల తర్వాత రాజకీయ ముఖచిత్రంలో మరింత స్పష్టత వస్తుందని, ఆ ఫలితాల తర్వాత మరోసారి భేటీ కావాలని ఉభయులూ నిశ్చయించుకొన్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, వివిధ వర్గాల వారి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్, అధికార పార్టీ తన ప్రచారానికి అమలుచేస్తున్న వ్యూహం... దానిని ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణ కూడా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. జనసేన పార్టీ తరఫున రూపొందిస్తున్న కార్యాచరణను కూడా పవన్ వివరించారు. చంద్రబాబు-పవన్ భేటీ అలా ముగిసిందో లేదో సోషల్ మీడియాలో వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ఇక వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు చిత్రవిచిత్రాలుగా ట్వీట్స్ చేశారు. మొత్తానికి చూస్తే.. చంద్రబాబు-పవన్ భేటీ ఇకపై వరుసగా ఉంటాయన్న మాట. ఈ భేటీల్లో ఫైనల్‌గా ఏం తేలుస్తారా..? కలిసి అడుగులు ముందుకేస్తారా..? లేదా అనేదానిపై అటు టీడీపీలో.. ఇటు జనసేనలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.