AP Politics : పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తున్న ప్రశ్న.. టీడీపీలో ఎందుకు చేరలేదు అని బాలయ్య అడగ్గా.. పవన్ చెప్పిన సమాధానం ఇదీ.. హై ఓల్టేజ్..
ABN , First Publish Date - 2023-02-10T20:05:41+05:30 IST
ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Jansena Chief Pawan Kalyan).. తనవంతుగా ప్రజలకోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే ఒకట్రెండు ఎన్నికల్లో పోటీచేసిన జనసేన అనుకున్నంతగా ఫలితాలు సాధించలేదు. అయినప్పటికీ..
ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Jansena Chief Pawan Kalyan).. తనవంతుగా ప్రజలకోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే ఒకట్రెండు ఎన్నికల్లో పోటీచేసిన జనసేన అనుకున్నంతగా ఫలితాలు సాధించలేదు. అయినప్పటికీ ఏపీ రాజకీయాలు (AP Politics) మొత్తం అప్పుడూ.. ఇప్పుడూ జనసేనాని చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పటికే బీజేపీతో (BJP) మైత్రి కొనసాగిస్తున్న పవన్.. రానున్న ఎన్నికల్లో ఎవరితో కలిసి ముందుకెళ్లాలని ఆలోచనలో పడ్డారు. సరిగ్గా ఇదే టైమ్‌లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘అన్‌స్టాపబుల్ 2’ (Unstoppable Season-2) షోకి ఫైనల్స్ అతిథిగా విచ్చేశారు పవన్. దీంతో ఒక్కసారిగా హై ఓల్టేజ్ హీట్ పెరిగిపోయింది. మొదటి ఎపిసోడ్‌లో సినిమాలు, ఫ్యామిలీ గురించి ప్రశ్నలు అడిగారు బాలయ్య. అయితే.. రెండో ఎపిసోడ్‌లో మొత్తం రాజకీయాల గురించే నడిచింది. ఇందులో పవన్‌కు బాలయ్య ఓ ఆసక్తికర ప్రశ్న సంధించారు. ఇంతకీ ఆ ప్రశ్నేంటి..? దీనికి పవన్ ఎలా రియాక్ట్ అయ్యారనేది పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తోంది.
ఎందుకు టీడీపీలో చేరలేదు..?
‘అప్పుడు 1983లో సంక్షేమం మీద తెలుగుదేశం (Telugudesam) పార్టీ నిర్మాణం జరిగింది. కూడు, గూడు, గుడ్డ అనేదాని మీద. ఇప్పుడు మళ్లీ అలాంటి ఐడియాలజీ మీద జనసేన పార్టీ మొదలైంది. నాన్నగారు ఎన్టీఆర్ (Sr Ntr) తెలుగు జాతికి గుర్తింపు. ఆయన చేసిన సంస్కరణలు, పథకాలు కానీ ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడ చేయలేని పనులు. నాకు తెలిసి స్వాతంత్ర్యానికి ముందు.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అంతే. ఈ రెండే మనం చరిత్రలో చెప్పుకోదగ్గవి. చంద్రబాబు గారు (Chandrababu) 2004 దాకా సీఎంగా ఉన్నారు. ఇవ్వాళ్టికి కూడా ఏపార్టీ అయినా సరే.. రామారావుగారు లేదా.. టీడీపీ సంస్కరణలు (నవ్వుతూ) గురించి చెప్పుకునే ముందుకెళ్లాల్సిందే. వేరే మార్గం అయితే లేదు. అంతకుమించి మనం ఇంకేం ఇవ్వాలి.. ఏమిస్తాం. అన్ని వర్గాల ప్రజలకు అన్నీ ఇచ్చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు (పవన్ కల్యాణ్) ఎందుకు టీడీపీలో చేరకూడదు. ఎందుకు జనసేన పార్టీని స్థాపించారు..?’ అని పవన్‌కు బాలయ్య ప్రశ్న సంధించారు.
సేనాని సమాధానం ఇదీ..
ఇందుకు పవన్ కల్యాణ్ చాలా ఆచితూచి అసలేం చెప్పాలకున్నాడో అంతా క్లియర్ కట్‌గా చెప్పేశారు. ‘నేను రాజకీయాల్లోకి రావడానికి చాలా కారణాలున్నాయి. తమ్ముడు సినిమా వంద రోజులు ఆడిన తర్వాత నల్గొండలో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉండేది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని రక్షిత మంచి నీరు ఇద్దామని ప్రయత్నం చేశాను. కొంతమంది మనుషులను ఆ ప్రాంతానికి పంపించాను. లోకల్ పొలిటికల్ గ్రూప్స్ మేం ఏం చేయాలనుకున్నా చేయనివ్వలేదు. మంచి పనిచేయడానికి ఇన్ని అడ్డంకులా అనిపించింది. ఎందుకింత అభద్రతగా నేతలు ఉన్నారు. ఇలాంటి సంఘటనలు చాలాసార్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఎన్జీవో ద్వారా ప్రారంభిద్దాం అనుకున్నాను. అయితే నాకున్న ఆలోచనా పరిధికి ఒక చిన్నపాటి ఎన్జీవో సరిపోలేదు. ఇంకేదైనా చేద్దాం అని 2008, 2009 మధ్య రాజకీయ పార్టీ స్థాపించాను. నేనేమో ఓ ఆలోచనా విధానంలో ఉన్నాను. ఆ టైమ్‌లో ప్రధాని మోదీ (PM Modi) గారి నుంచి పిలుపు వచ్చింది. ఆ కబురు అహ్మదాబాద్ నుంచి వచ్చింది. ఒకసారి కలవాలని రమ్మని చెప్పారు. టైమ్ తక్కువ అయ్యింది. మార్చిలో పార్టీ పెడితే.. ఏప్రిల్‌లో ఎన్నికలు (Elections) వచ్చాయి. ఈ తక్కువ సమయంలో పార్టీ పెట్డడం అనేది సినిమాల్లో ఉండే స్టార్‌డమ్, పాలిటిక్స్‌లో (Politics) కూడా వచ్చేస్తుంది అని అందరూ అనుకుంటారు. అది నాకు తెలిసి ఎన్టీఆర్ గారి విషయంలో ఒకసారి జరిగింది. ఎంజీఆర్ గారి (MGR) విషయంలోనూ జరిగింది. అది అందరిలో జరగాలని లేదు. ఆ స్పష్టత అయితే నాకు ఉంది. ఒక పార్టీ నిర్మాణం అంటే ఐడిలాజికల్ కన్‌స్ట్రక్షన్ (ఒక ఐడియాను నిర్మించడం). ఇదంతా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్‌తో, పవర్‌ఫుల్ పీపుల్స్‌తో అవ్వొదు. ఆ భావ వ్యాప్తిని పెంపొందించాలంటే.. అది 2 డికేడ్స్ నిర్మాణం. నేను కింది స్థాయి నుంచి అన్నీ నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. అసలు రాజకీయాలంటే ఏంటి.. అని నేర్చుకోవడానికి సిద్ధపడ్డాను. అందుకే దీన్ని నుంచి ఏమీ ఆశించకుండా రాజకీయ అనుభవం తెచ్చుకున్నాను’ అని పవన్ వివరించారు.
టీడీపీలో ఎందుకు చేరలేదంటే..
‘ నా ఇంటెన్షన్ ఏమిటంటే సార్.. జనసేనను ప్రారంభించినప్పుడు.. ఇప్పటికీ అధికారం అందరికీ అందాలన్నదే నా మేజర్ ఆలోచన. ఇది నా నుంచి వచ్చింది అనే కంటే.. రామ్ మనోహర్ లోహియా గారి నుంచి వచ్చింది. నేను ఆయన్ను చాలా ఇష్టపడతాను. రాజకీయాల్లో ఆధిపత్య ధోరణి అంటాం కదా.. నేను కులం అని చెప్పను కానీ రాజకీయాలు కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోయాయి. కిందివాళ్లకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయ్ కానీ సాధికారత అనేది అందట్లేదు. పదవి వస్తోంది కానీ.. వారు పప్పెట్స్ అవుతున్నారు. జనతాపార్టీ జయప్రకాష్ నారాయణ (Jaya Prakash Narayana), మనోహర్ లోహియా (Manohar lohia) గారి ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. అవినీతిపై ఎలా పోరాడాలి అనేది జేపీ గారి నుంచి.. అన్ని కులాలకు అధికారం రావాలనేది లోహియా గారి ఆలోచన. నేను కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్లలేదు. ఎందుకంటే నా వ్యక్తిగత ఆలోచనలు రాబోయే తరానికి ఎంతసేపూ మాట్లాడితే సంక్షేమ పథకాలే మాట్లాడుతాం. అదిస్తాం.. ఇదిస్తాం కాదు. యువతకు ఉద్యోగాలిచ్చేస్తాం అని చెబుతారే కానీ వారిలో ఉండే నేటివిటీ టాలెంట్‌ను ఎందుకు గుర్తించం. పారిశ్రామికవేత్తలగానో.. చూడొచ్చు కదా. స్వరాష్ట్రాన్ని వదిలి విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది. ఎందుకో టాలెంటెడ్ జనరేషన్‌కు సంబంధించి సరైన పొలిటికల్ వాతావరణం లేదని అనిపించింది. అలాగే అధికారం రాని చాలా సమూహాలకు వాళ్లకు నిజంగా సాధికారత ఇచ్చే దిశగా నేను అడుగులు వేయాలంటే వేరే పార్టీల్లోకి వెళితే ఈ భావాన్ని ఎంతవరకు తీసుకెళ్లగలనో అనేది నాకు సందేహం. ఎందుకంటే వారివన్నీ ఫిక్స్‌డ్ పారామీటర్స్ ఉంటాయి. అందుకే నేను రాజకీయ పార్టీ పెట్టాల్సి వచ్చింది. నేను కొన్ని మూల సిద్ధాంతాలు పెట్టుకున్నాను. అందులో భాగంగానే పర్యావరణం కానీ అందరూ ఆలోచించేదే కానీ.. గెలుపు లక్ష్యంగా ఉంటుంది. అందరూ అధికారం లేకపోతే ఏం చేయలేం అనుకుంటారు కానీ.. నేను మాత్రం అధికారం ఉన్నా లేకున్నా ప్రజల్లో చైతన్యం, మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు వేయాలంటే ఎవరికీ సంబంధం లేకుండా ఉండాలని ప్రయత్నంలో జనసేన స్థాపించాల్సి వచ్చింది’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
మొత్తానికి చూస్తే.. బాలయ్య ఎంత సూటిగా ప్రశ్నించారో.. అంతే సూటిగా పవన్ కూడా సమాధానమిచ్చేశారు. బాలయ్య ప్రశ్న అడుగుతున్నంత సేపూ.. సమాధానం ఎలా వస్తుందో అని షో చూడ్డానికి వచ్చిన అభిమానులు ఎంతగానో టెన్షన్ పడ్డారు. అయితే పవన్ మాత్రం తాను చెప్పాలనుకున్నది సుదీర్ఘంగా వివరించారు. ఇదే ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’లో బాలయ్య ఇంకా చాలా ప్రశ్నలే సంధించారు. ఆ ప్రశ్నలంటికీ పవన్ చాలా లాజిక్‌గా సమాధానాలిచ్చారు. అంతేకాదు.. పవన్ జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా ఈ షోలో పంచుకున్నారు.