TS Assembly Polls : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బాంబ్ పేల్చిన కేటీఆర్.. ఎప్పుడు ఉండొచ్చని చెప్పారంటే..?
ABN , First Publish Date - 2023-09-12T16:12:28+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Polls) సంబంధించి ఇక నోటిఫికేషన్ రావడమే ఆలస్యమని ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి కేటీఆర్ బాంబ్ పేల్చారు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Polls) సంబంధించి ఇక నోటిఫికేషన్ రావడమే ఆలస్యమని ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి కేటీఆర్ బాంబ్ పేల్చారు. మంగళవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన మంత్రి.. ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. అక్టోబర్-10లోపు నోటిఫికేషన్ వస్తేనే.. సమయంలోపు (డిసెంబర్ నెలలో) ఎన్నికలు జరుగుతాయన్నారు. సమయంలోగా నోటిఫికేషన్ వచ్చేది అనుమానమేనన్నారు. అంతేకాదు.. ఎన్నికలు ఎప్పుడు జరగొచ్చేదానిపై కూడా మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఎన్నికలు కూడా ఏప్రిల్ లేదా మే నెలలో జరగొచ్చు అని కేటీఆర్ ఒకింత జోస్యం చెప్పారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తెలంగాణలో జరిగే ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశముందని చెప్పుకొచ్చారు. మరి కేటీఆర్‌కు ఈ విషయాలన్నీ ఎలా తెలుసో.. ఎక్కడ్నించి సమాచారం వచ్చిందో పెరుమాళ్లకే ఎరుక.
పార్టీలు, గెలుపు స్థానాలపై..
‘90 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో మా పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉన్నది. కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రజలకు చాలా స్పష్టత ఉంది, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయి. ప్రతిపక్షాల తాపత్రయం రెండవ స్థానం కోసమే. సిట్టింగులకు సీట్లు ఇవ్వకుంటే మా దగ్గరికి వస్తారని ప్రతిపక్షాలు భావించాయి. తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్ సిట్టింగ్ స్థానాలకు సీట్లు ఇచ్చారు. 65 సంవత్సరాలలో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్ కాలేజీలు, కేవలం రెండు మాత్రమే. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.. నర్సింగ్ కాలేజీ ఇవ్వలేదు.. కనీసం నవోదయ పాఠశాల ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదు.మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్, ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదు. ఢిల్లీ నుంచి వచ్చి సీల్డ్ కవర్లు, వారికి అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితి. ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మారణహోమం సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్. సొంత పార్టీ నాయకులపైనే చెప్పులు విసిరిన పార్టీ కాంగ్రెస్.తెలుగువారి గౌరవం పీవీ నరసింహారావు పైనే చెప్పులు విసిరిన ఘనత కాంగ్రెస్‌ది. ఢిల్లీ బానిస పార్టీలు.. జాతీయ పార్టీలు. ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరు. తెలంగాణ ప్రజలకు ఢిల్లీ బానిసలు కావాలా..? తెలంగాణ బిడ్డ కావాలా..? అనేది తెలుసుకోవాలి. కేవీపీ రామచంద్రరావు, షర్మిల, తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారు. తెలంగాణ ఈరోజు వారు కాంగ్రెస్‌ను గెలిపిస్తారంట. తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ, షర్మిల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి తేస్తాం అంటున్నారు. ఇంతటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి పట్టింది. తెలంగాణ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టలేని కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజల పైన రైఫిల్ తీసుకువెళ్లిన రేవంత్ రెడ్డి.. వీరు తెలంగాణ కోసం ముసుగులో వచ్చారు’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
మంత్రి మాటలకు అర్థాలే వేరులే!
మొత్తానికి చూస్తే.. రాష్ట్రంలో డిసెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలకు ఇప్పట్లో జరగవని గట్టిగానే కేటీఆర్ నమ్ముతున్నారన్న మాట. ఈయన మాటల ప్రకారం చూస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌తో పాటే జరుగుతాయని, జరగాలని గట్టిగానే మంత్రి అనుకుంటున్నారన్న మాట. అసలే ఇప్పుడు జమిలి ఎన్నికల వ్యవహారంపై దేశ వ్యాప్తంగా పెద్ద రచ్చే జరుగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ ఇలా కామెంట్స్ చేయడంతో ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల కదనరంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ ఇలా వెనకడుగు వేస్తోందంటే దీనికి సవాలక్ష కారణాలున్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే.. ఓటమి భయంతోనే ఇలా మాట్లాడుతున్నారని కొందరు అంటుంటే.. ఎన్నికలు వాయిదా వేయాలని బీఆర్ఎస్ అధిష్టానే కేంద్రంలో ఏదో చేస్తోందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సరిగ్గా తెలంగాణ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయిన టైమ్‌లో కేటీఆర్ ఇలా ఎందుకు కామెంట్స్ చేశారని సొంత పార్టీ నేతలు సైతం ఆలోచనలో పడ్డారట.