Share News

Janasena : జనసేనకు కొత్త తలనొప్పి.. ఆలోచనలో పడిన పవన్!!

ABN , First Publish Date - 2023-11-12T14:47:39+05:30 IST

Telangana Elections 2023 : అవును.. జనసేనకు (Janasena) కొత్త తలనొప్పి వచ్చి పడింది. దీంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆలోచనలో పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) బీజేపీతో జనసేన (BJP-Janasena) పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే..

Janasena : జనసేనకు కొత్త తలనొప్పి.. ఆలోచనలో పడిన పవన్!!

అవును.. జనసేనకు (Janasena) కొత్త తలనొప్పి వచ్చి పడింది. దీంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆలోచనలో పడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) బీజేపీతో జనసేన (BJP-Janasena) పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 8 స్థానాలను జనసేనకు కమలం పార్టీ కేటాయించింది. కూకట్‌పల్లి (ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్), తాండూరు (నేమూరి శంకర్ గౌడ్), కోదాడ (మేకల సతీష్ రెడ్డి) , నాగర్‌కర్నూలు (వంగల లక్ష్మణ్ గౌడ్), ఖమ్మం (మిర్యాల రామకృష్ణ), కొత్తగూడెం (లక్కినేని సురేందర్ రావు), వైరా (తేజావత్ సంపత్ నాయక్), అశ్వారావు పేట (ముయబోయిన ఉమాదేవి) స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పొత్తు సరే.. పోటీ సరే ఇంతవరకూ అంతా ఓకే కానీ.. సరిగ్గా ఈ టైమ్‌లో పెద్ద చిక్కొచ్చి పడింది. జనసేన గుర్తు ‘గాజు గ్లాసు’.. (Glass Symbol) అయితే.. మరో పార్టీ పేరు, గుర్తు కూడా ఇంచుమించు ఇలాగే ఉండటంతో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మరో గుర్తుపై ఓటు వేస్తారనే టెన్షన్ జనసేన అభ్యర్థులను వెంటాడుతోంది.


janasena-bjp.jpg

ఇదీ అసలు కథ..

సేనానికి చిక్కులు తెచ్చి పెట్టిన పార్టీ మరేదో కాదండోయ్.. ‘జాతీయ జనసేన’ (Jateeya Janasena). ఈ పార్టీ గుర్తు ‘బకెట్’ (Bucket Symbol). అయితే.. పార్టీ పేర్లతో పాటు, గుర్తులు కూడా ఈవీఎంల మీద ఇంచుమించు ఒకేలా కనిపిస్తాయి. దీంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మరీ ముఖ్యంగా.. 8 స్థానాల్లో పోటీచేసిన జనసేనకు ఈ ఇబ్బందులు అన్నిచోట్లా లేవు కానీ.. హైదరాబాద్‌లో కీలక నియోజకవర్గమైన కూకట్‌పల్లిలో (Kukatpally) ‘జాతీయ జనసేన’ అభ్యర్థి నిలబడుతుండటంతో పవన్ కల్యాణ్‌కు ఏం చేయాలో దిక్కుతోచక ఆలోచనలో పడ్డారట. ఎందుకంటే.. ఈ నియోజకవర్గంలో సెటిలర్లు ఎక్కువగా ఉంటారు.. దీంతో కచ్చితంగా జనసేన గెలుస్తుందని పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి. పైగా పార్టీ తరఫున పోటీచేస్తున్న ప్రేమ్ కుమార్ (Prem Kumar) కూడా టికెట్ కన్ఫామ్ కాకముందు నుంచే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. దీంతో సెటిలర్లు, తాను చేసిన సేవ.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కలిసొస్తాయని జనసేన గంపెడాశలు పెట్టుకుంది. మరీ ముఖ్యంగా టీడీపీ (Telugudesam) క్యాడర్‌ కూడా ఉండటంతో కచ్చితంగా గెలుస్తాని అభ్యర్థి ధీమాగా ఉన్నారు. అయితే ఆ ఆశలన్నీ ఆవిరయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

PAWAN.jpg

ఏం చేద్దాం..?

వాస్తవానికి ఇండిపెండెంట్లు, చిన్న చిన్న పార్టీలవారికి ఇచ్చే సింబల్స్‌తో ప్రధాన పార్టీలకు పెద్ద చిక్కొచ్చి పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గత 2018 ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో ఇలాంటి ఘటనే జరిగింది. బీఆర్ఎస్ గుర్తు ‘కారు’ కాగా.. ఇండిపెండెంట్ అభ్యర్థికి ‘రోడ్డు రోలర్’ గుర్తు ఇవ్వడంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. దీంతో వేముల వీరేశంకు పడాల్సిన ఓట్లన్నీ రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయి. ఓట్లు చీలిపోవడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అవలీలగా గెలిచిపోయారు. ఇప్పుడు 2023 ఎన్నికల్లో ఇదే పరిస్థితి. అందుకే కారును పోలి ఉన్న గుర్తులను ఎవరికీ కేటాయించరాదని ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టును బీఆర్ఎస్ అధిష్టానం సంప్రదించిందినప్పటికీ.. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు జనసేనకు సింబల్ విషయంలో ఇలా జరుగుతుండటంతో ఇదివరకు జరిగిన ఘటనలు తెరపైకి వస్తున్నాయి. అయితే.. జాతీయ జనసేన అభ్యర్థిని నామినేషన్ విరమించుకునేలా చేయాలని జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్.. పార్టీ అధినేత పవన్‌ను గట్టిగా పట్టుబట్టారట. దీంతో ఎలా సంప్రదించాలి..? ఏం చేయాలి..? అని సేనాని ఆలోచనలో పడ్డారట. మరోవైపు.. ఇంతవరకూ రాష్ట్రంలో జనసేనకు గుర్తింపు పొందినపార్టీ కాకపోవడంతో.. గుర్తు రిజర్వ్‌లో లేదని.. గాజు గ్లాసు గుర్తు కేటాయించలేదనే ప్రచారం కూడా పెద్ద ఎత్తునే జరుగుతోంది. ఇందులో నిజానిజాలెంత అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ జనసేన నుంచి ఎలాంటి రియాక్షన్ రాకపోవడం గమనార్హం.


ఇవి కూడా చదవండి


TS Assembly Polls : ఆఖరి నిమిషంలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన కేసీఆర్!!


CM KCR : కేసీఆర్ ఆస్తులు తెలుసుకుని ఆశ్చర్యపోతున్న జనం.. ఎన్ని కోట్లు ఉన్నాయంటే..!?


Komatireddy : ర్యాలీ జోష్‌లో నామినేషన్ మరిచిన రాజగోపాల్.. ఆఖరి నిమిషంలో ఉరుకులు, పరుగులు..!!


TS Assembly Polls : 2023 ఎన్నికల్లో ఊపిరిపీల్చుకున్న కాంగ్రెస్‌‌.. ప్లాన్ అదిరిపోయిందిగా..!!


Updated Date - 2023-11-12T14:49:37+05:30 IST