Jagan On UCC: భేటీ అయినా ఏం లాభం..? ఎటూ తేల్చని జగన్..?

ABN , First Publish Date - 2023-07-19T22:06:57+05:30 IST

ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ) అంశంపై ముస్లిం మత పెద్దలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే.. ఈ సమావేశంలో UCC అంశంపై సీఎం జగన్‌ ఎటూ తేల్చకపోవడం గమనార్హం. ఈ బిల్లుతో ముస్లింలకు నష్టం కలిగితే వ్యతిరేకిస్తామని జగన్‌ చెప్పినప్పటికీ, UCCపై స్పష్టంగా హామీ ఇవ్వాలంటూ ముస్లిం మత పెద్దలు కోరినా సీఎం జగన్‌ సమాధానం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.

Jagan On UCC: భేటీ అయినా ఏం లాభం..? ఎటూ తేల్చని జగన్..?

అమరావతి: ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ) అంశంపై ముస్లిం మత పెద్దలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే.. ఈ సమావేశంలో UCC అంశంపై సీఎం జగన్‌ ఎటూ తేల్చకపోవడం గమనార్హం. ఈ బిల్లుతో ముస్లింలకు నష్టం కలిగితే వ్యతిరేకిస్తామని జగన్‌ చెప్పినప్పటికీ, UCCపై స్పష్టంగా హామీ ఇవ్వాలంటూ ముస్లిం మత పెద్దలు కోరినా సీఎం జగన్‌ సమాధానం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.

గురువారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో యూసీసీ బిల్లులను ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై ముస్లిం పెద్దలు ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా మత పెద్దల అభిప్రాయాలు తెలుసుకుని, యూసీసీ వల్ల కలిగే లాభనష్టాలపై చర్చించాలని జగన్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేంద్రానికి యూసీసీ అంశంపై వైసీపీ వైఖరిని తెలియజేయాలని జగన్ భావించారు. కానీ.. ఆ దిశగా నిర్ణయం తీసుకోవడంలో జగన్ వెనుకడుగు వేసినట్లు తాజా సమావేశంతో స్పష్టమైంది.


ఉమ్మడి పౌరస్మృతిపై స్పష్టమైన మద్దతు ఇవ్వాలని సీఎం జగన్‌కు కేంద్ర పెద్దలు ఇప్పటికే సూటిగా చెప్పినట్లు తెలిసింది. ‘‘రాజ్యసభలో మీ 9 మంది సభ్యుల మద్దతు మాకు కీలకం. ఏపీ అసెంబ్లీలో కూడా ఈ బిల్లును ఆమోదించాలి’’ అని ఢిల్లీలో ఇటీవల తనను కలిసిన జగన్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నట్లు ఢిల్లీలోని బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు తాడేపల్లిలో జగన్‌ను కలిసిన సందర్భంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆయన కూడా ఉమ్మడి పౌర స్మృతిపై మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. యూసీసీపై కేంద్రం వేసిన నలుగురు మంత్రుల కమిటీకి కిరెన్‌ రిజిజూ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

2019కి ముందు విపక్షంలో ఉన్నప్పటి నుంచే కేంద్రానికి జగన్‌ ‘బేషరతు’ మద్దతుదారుగా ఉన్నారు. అన్ని బిల్లులకూ మద్దతిస్తున్నారు. ఇక.. కేంద్రం కూడా జగన్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తోంది. ‘మీరు అడిగినవన్నీ ఇస్తున్నాం. ఇప్పుడు మేం అడిగినట్లు యూసీసీకి మద్దతు ఇవ్వాల్సిందే’ అని సూటిగా జగన్‌కు కేంద్రం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సొంత అవసరాలు, ఇతరత్రా ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు మోదీ సర్కారుతో జగన్‌ అంటకాగుతుండటం నిజం. అయినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ పెద్దలను కలుస్తున్నట్లుగా ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు యూసీసీకి మద్దతు తెలిపితే ముస్లిం ఓటర్లు పూర్తిగా దూరమవుతారని జగన్‌ భయపడుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-07-19T22:07:17+05:30 IST