Karnataka poll result: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ కనుగొలు.. అతడి తర్వాతి టార్గెట్ తెలంగాణ!

ABN , First Publish Date - 2023-05-14T14:31:37+05:30 IST

సరికొత్త వ్యూహాలతో కాంగ్రెస్‌కు ప్రచారాస్త్రాలు.. అభ్యర్థుల ఎంపికలోనూ కీలకపాత్ర... కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం వెనుకాల ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకుందాం...

Karnataka poll result: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ కనుగొలు.. అతడి తర్వాతి టార్గెట్ తెలంగాణ!

కర్ణాటకలో (Karnataka Election result) కాంగ్రెస్ పార్టీ (Congress party) చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 136 స్థానాల్లో గెలుపుతో అధికార పీఠాన్ని దక్కించుకుంది. బీజేపీ (BJP) రాజకీయాలకు విరుగుడుగా కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలతో పోరాడి గెలిచింది. అధికార పార్టీ అవినీతినే ప్రధానాస్త్రంగా మలుచుకొని విజయబావుటాను ఎగురవేసింది. ఈ గొప్ప గెలుపు కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలకే దక్కుతుందని అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ తెరపైన కనిపించని ఓ వ్యక్తి కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక ముఖ్యభూమిక పోషించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారాస్త్రం వరకు అన్నింటిలోనూ దిశానిర్దేశనం చేశారు. ఆయనే ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగొలు (Sunil kanugolu). 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున పనిచేసిన ఈయనే ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా వ్యవహరించి పార్టీని గట్టెక్కించారు. సరికొత్త వ్యూహాలతో కాంగ్రెస్‌కు ప్రచారాస్త్రాలను అందించారు. అభ్యర్థుల ఎంపికలోనూ కీలకపాత్ర పోషించారు. కొంతమంది అభ్యర్థులు మినహా మిగతావారందరినీ సునీల్ టీమ్ చేపట్టిన సర్వేల ఆధారంగానే ఎంపిక చేశారు. కాగా గతేడాది మార్చిలో పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కొనుగోలును కాంగ్రెస్ నియమించుకుంది. ఆ రెండు నెలలకే పార్టీ 2024 లోక్‌సభ ఎలక్షన్ టాస్క్ ఫోర్స్‌లో చేర్చుతూ సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు.

Untitled-4.jpg

గతంలో పీకే టీమ్‌లో..

నిజానికి సునీల్ కనుగొలు గురించి ఆన్‌లైన్‌లో పెద్దగా సమాచారం కనిపించదు. కర్ణాటకకు చెందిన వ్యక్తి. చెన్నైలో పెరిగారు. ఇదివరకే ఆయన తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలకు పనిచేశారు. గతంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర బృందంలో పనిచేశారు. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో సునీల్ అత్యంత క్రియాశీలకపాత్ర పోషించారు. బీజేపీకి చెందిన అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్‌కి (ABM) హెడ్‌గా వ్యవహరించారు. అంతేకాదు ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ గెలుపులో కృషిచేశారు.

మరిన్ని రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్....

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ అగ్రనతే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్లాన్ చేసింది కూడా సునీల్ కనుగొలు కావడం విశేషం. కర్ణాటక ఎన్నికలకు ముందు రాహుల్ చేపట్టిన ఈ యాత్ర పార్టీకి బాగా కలిసొచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక మున్ముందు ఎన్నికల జరగనున్న రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా సునీల్ కనుగొలు పనిచేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా ఆయన వ్యూహాలను రచిస్తున్నారు. తెలంగాణతోపాటు రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పార్టీ కోసం పనిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా 2024 సాధారణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కోసం ఇప్పటికే పని మొదలుపెట్టిన సునీల్‌.. ‘కాంగ్రెస్ వార్ రూమ్‌’ వ్యవహారంలో పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు ఆరోపణలు రావడంతో సైబర్ క్రైం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణలో అతడి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు.

Updated Date - 2023-05-14T14:34:02+05:30 IST