Visakhapatnam: జగన్ చేసిన ఒక్క ప్రకటనతో ట్విట్టర్ ట్రెండింగ్‌లో విశాఖపట్నం.. కానీ కామెడీ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-01-31T15:19:36+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan) దేశ రాజధాని హస్తిన సాక్షిగా రాజధానిపై (AP Capital) చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్‌గా మారింది. పెట్టుబడిదారులను విశాఖకు..

Visakhapatnam: జగన్ చేసిన ఒక్క ప్రకటనతో ట్విట్టర్ ట్రెండింగ్‌లో విశాఖపట్నం.. కానీ కామెడీ ఏంటంటే..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (AP CM Jagan) దేశ రాజధాని హస్తిన సాక్షిగా రాజధానిపై (AP Capital) చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్‌గా మారింది. పెట్టుబడిదారులను విశాఖకు (Visakhapatnam) ఆహ్వానిస్తూ విశాఖ రాజధాని కాబోతోందని, త్వరలో తానూ విశాఖ వెళ్లబోతున్నానని జగన్ వారితో అన్నారు. జగన్ చేసిన ఈ ఒక్క ప్రకటనతో విశాఖపట్నం హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. #Visakhapatnam పేరుతో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చేయడంతో జాతీయ మీడియా కూడా జగన్ వ్యాఖ్యలను హైలైట్ చేసింది. ‘ఏపీ రాజధానిగా విశాఖను జగన్ ప్రకటించారహో’ అంటూ వార్తలు నెట్టింట కోడై కూస్తున్నాయి.

కామెడీ ఏంటంటే.. న్యాయస్థానాల పరిధిలో ఉన్న ఏపీ రాజధాని అంశంపై జగన్ ప్రకటన చేయడమే అనాలోచిత చర్య అని న్యాయ నిపుణులు అంటుంటే.. ఆ ప్రకటనకు వైసీపీ సోషల్ మీడియా పేజీలు డప్పు కొడుతుండటం కొసమెరుపు. ‘మా రాజధాని విశాఖ పట్నం’ పేరుతో వైసీపీ సోషల్ మీడియా వింగ్ చేస్తున్న హడావిడి చూస్తుంటే.. ‘ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా ఉందని టీడీపీ సోషల్ మీడియా వింగ్ కౌంటర్ వీడియోలు చేస్తోంది. #Visakhapatnam హ్యాష్‌ట్యాగ్‌ను కూడా పనిగట్టుకుని వైసీపీ సోషల్ మీడియా ట్రెండ్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Twitter-Trending.jpg

ఇదిలా ఉంటే.. జగన్ వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేశారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొనేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని అధికార పార్టీ చెబుతున్నప్పటికీ.. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచడంతో ఢిల్లీ పెద్దలను కలిసి గోడు వెళ్లబోసుకునేందుకు హస్తినకు వెళ్లారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. విశాఖను రాజధానిగా ఢిల్లీలో ప్రకటించి ప్రజల దృష్టిని మరల్చేందుకు జగన్ ఈ ప్రకటన చేశారని, అందుకే అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే విశాఖ రాజధాని కాబోతోందని సీఎం జగన్‌ ప్రకటించారనే వాదన తెరపైకొచ్చింది. జగన్‌ ప్రకటనను న్యాయ నిపుణులు తప్పుబడుతున్నారు. కోర్టు విచారణలో ఉండగానే విశాఖను రాజధానిగా ఎలా భావిస్తారని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. జగన్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని అంటున్నారు. ఇటీవల ఉగాది నుంచి విశాఖను రాజధానిగా చేసుకుని జగన్ పాలన సాగిస్తారని వైసీపీ నేతలు బాహాటంగానే ప్రకటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అయితే పదేపదే ఈ ప్రకటన చేస్తుండటం గమనార్హం.

ఇన్వెస్టర్లను విశాఖకు రావాలని, పెట్టుబడులు పెట్టాలని.. మార్చి 3-4 తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ మీట్‌కు ఆహ్వానించడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ.. ఏపీ రాజధాని అంశం అత్యున్నత ధర్మాసనంలో విచారణలో ఉండగానే.. పైగా విచారణకు వస్తున్న రోజునే జగన్ ఈ ప్రకటన చేయడాన్ని మాత్రం కొందరు జర్నలిస్టులు కూడా తప్పుబడుతున్నారు. ఇలాంటి ప్రకటనల వల్ల ఇన్వెస్టర్లు ఏపీకి ముఖం చాటేసే ముప్పుకు జగన్ పరోక్షంగా నాంది పలుకుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజధానిపై జగన్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించడమేనని చెబుతున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై మునుపెన్నడూ లేనంత గందరగోళం నెలకొంది. రాజధాని ఏదో చెప్పలేని స్థితిలో ఏపీ జనం ఉన్నారంటూ ఇతర రాష్ట్రాల ప్రజలు అపహాస్యం చేసే పరిస్థితి రావడం శోచనీయం. అమరావతిని రాజధానిగా కొనసాగించేందుకు జగన్ సర్కార్ ఏమాత్రం ఆసక్తి కనబర్చకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని.. ఏపీకి ఉంటే తప్పేంటని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనతో రాజధానిపై అయోమయం మరింత పెరిగింది. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి వచ్చే ఉగాది నుంచి పాలన సాగించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ సర్కార్ సుప్రీం కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Updated Date - 2023-02-01T12:05:56+05:30 IST