I-PAC Survey: ఐప్యాక్ బృందం సర్వేతో వెలుగులోకి ఇంట్రస్టింగ్ విషయాలు.. ఎమ్మెల్యే రోజా పరిస్థితేంటంటే..
ABN , First Publish Date - 2023-07-04T14:14:14+05:30 IST
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను సమస్యలపై స్థానికులు నిలదీస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా వైసీపీకి అనుసంధానమైన ఐప్యాక్ బృందం సర్వే నిర్వహించింది.
ఆ ఇద్దరికీ టిక్కెట్ అనుమానమేనా?
ఐప్యాక్ సర్వేలో చిత్తూరు, పలమనేరు ఎమ్మెల్యేలపై జనంలో అసంతృప్తి
చిత్తూరు(ఆంధ్రజ్యోతి): ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గడప గడపకు వెళ్తున్న ఎమ్మెల్యేలను సమస్యలపై స్థానికులు నిలదీస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా వైసీపీకి అనుసంధానమైన ఐప్యాక్ బృందం సర్వే నిర్వహించింది. జనంలో అసంతృప్తి ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు 40 మంది ఉన్నట్లు జాబితా సిద్ధం చేసినట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ పార్టీ నేతల అంచనా ప్రకారం.. ఆ 40 మందిలో జిల్లాకు సంబంధించి చిత్తూరు, పలమనేరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, వెంకటేశ్ గౌడ ఉన్నట్లు సమాచారం.
చిత్తూరులో ఇదీ పరిస్థితి
చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై భూఆక్రమణల ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొన్ని ఆక్రమణల్లో ఆయన పేరు బయట పడితే, మరికొన్నిచోట ఆయన అనుచరులు.. వైసీపీ రెండో స్థాయి నాయకుల పేర్లు ఉంటున్నాయి. కొన్ని అంశాల్లో గడప గడపలోనూ ఆయనకు ప్రజల నుంచి నిలదీతలు ఎదురయ్యాయి. ఏ శాఖలో ఏ స్థాయి అధికారి పోస్టింగ్ తీసుకోవాలనుకున్నా ఎమ్మెల్యేకు తెలియకుండా జరగడం లేదు. కార్పొరేషన్ సహా ఇతర కార్యాలయాల్లో ప్రధాన పనులు జరగాలంటే ఆ ఫైల్ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి రావాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి. ఇక సొంత పార్టీలోనూ ఆయనకు ఇబ్బందులు ఉన్నట్లు చెబుతారు. దీనికి తోడు ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి నగదును విరివిగా ఖర్చు పెడుతున్నారు. ఈసారి చిత్తూరు టికెట్టు ఆయనకేనంటూ అతడి అనుచరులు విస్తృతంగా చెబుతున్నారు.
పలమనేరులో ఇలా..
ఇక పలమనేరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ ఎమ్మెల్యే వెంకటేశ్ గౌడకు బలమైన వ్యతిరేక వర్గాలున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన ప్రారంభంలో పలమనేరు సమీపంలోని ఓ క్వారీని ఈయన స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకోవాల్సిందేనన్న విమర్శలున్నాయి. ప్రజల నుంచీ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇక, నియోజకవర్గానికి చెందిన జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యేకి మధ్య నిత్యం ప్రొటోకాల్ రగడ నడుస్తూనే ఉంది. ఇలా, పార్టీలోనే నెలకొన్న తీవ్ర వ్యతిరేకత కూడా ఈయనకు ప్రతికూలంగా మారిందన్న ప్రచారం జరుగుతోంది.
మరికొందరికీ పార్టీలోనే వ్యతిరేకత
జీడీనెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామికి, నగరిలో రోజాకు వారి నియోజకవర్గాల్లో బలమైన వ్యతిరేక వర్గాలు తయారయ్యాయి. ఈసారి వారికి టిక్కెట్లు ఇస్తే పనిచేయమని, వారి వ్యతిరేక వర్గ నాయకులు పలువురు బహిరంగంగా చెప్పేస్తున్నారు. నారాయణస్వామితో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే ఎం ఎస్‌బాబుకు గడప గడప.. కార్యక్రమాల్లో నిత్యం నిలదీతలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల సమయానికి ఐప్యాక్ ఇచ్చే జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయోననే ఆందోళన ఎమ్మెల్యేల్లో లేకపోలేదు.