Rushikonda Construction : అబ్బే సెక్రటేరియట్ కాదు.. రుషికొండ నిర్మాణాలపై మరోసారి మాటమార్చిన వైసీపీ..!
ABN , First Publish Date - 2023-08-13T16:49:24+05:30 IST
రుషికొండపై (Rushikonda) జగన్ సర్కార్ (Jagan Govt) చేపట్టిన నిర్మాణాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొండపై ఏం నిర్మాణాలు చేపడుతున్నాం అనేదానిపై ప్రభుత్వానికే క్లారిటీ లేకపోవడంతో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన (YSRCP Vs TDP, Janasena) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో (Social Media) తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి..
రుషికొండపై (Rushikonda) జగన్ సర్కార్ (Jagan Govt) చేపట్టిన నిర్మాణాలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొండపై ఏం నిర్మాణాలు చేపడుతున్నాం అనేదానిపై ప్రభుత్వానికే క్లారిటీ లేకపోవడంతో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన (YSRCP Vs TDP, Janasena) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో (Social Media) తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. ఇంత రచ్చ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో వైసీపీ తప్పులో కాలేసింది. అయితే ఆ తప్పును 24 గంటల్లో సరిచేసుకుంది కానీ.. ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టీడీపీ, జనసేన పార్టీలు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బంతాట ఆడుకుంటున్నారు. ఇంతకీ వైసీపీ మొదట చేసిన ఆ ట్వీట్ ఏంటి..? తప్పు అని తెలుసుకున్న తర్వాత చేసిన రెండో ట్వీట్ ఏంటి..? దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అయ్యింది..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇదీ అసలు కథ..!
రుషికొండ.. రుషికొండ.. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపై చర్చ.. అంతకుమించి రచ్చ..!. ప్రకృతిని సర్వ నాశనం చేస్తూ ప్రభుత్వం ఇలా నిర్మాణాలు చేపట్టడం ఎంతవరకూ సబబు అని కోర్టులకు వెళ్లడం, ప్రతిపక్ష పార్టీలు నిలదీయడంతో ఇది మరింత వివాదాస్పదంగా మారింది. ఇటీవల రుషికొండలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పర్యటించడం, అక్కడ జరుగుతున్న నిర్మాణాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో మరోసారి ఇది హాట్ టాపిక్ అయ్యింది. కాగా.. మూడు రాజధానుల్లో వైజాగ్ ఒకటని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. రుషికొండపై సెక్రటేరియట్ (AP Secretariat) నిర్మిస్తున్నామని నిన్న, మొన్నటి వరకూ ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారిక ట్విట్టర్‌లో (YSRCP Twitter) కూడా ఇదే విషయాన్ని తెలిపింది. ‘ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు జగన్.. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి రుషికొండపై సచివాలయం నిర్మిస్తున్నారు. దానిపై కూడా టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఇది చూస్తుంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం ఆ పార్టీకి ఇష్టం లేదనిపిస్తోంది’ అని శనివారం రాత్రి ట్వీట్ చేసింది. అయితే.. వాస్తవానికి అక్కడ నిర్మిస్తున్నది సెక్రటేరియట్ కాదు.. దీంతో నాలుక్కరుచుకున్న వైసీపీ.. వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసేసింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లక్షలాది మందికి ఆ ట్వీట్ చేరిపోవడం, అంతకుమించి కామెంట్స్ రావడం.. కౌంటర్లు వచ్చేశాయి. దీంతో తప్పయిపోయిందని మరోసారి ట్వీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిపడింది.
రెండోసారి ఇలా..?
‘మా అధికారిక ట్విటర్ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్‌లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణనలోకి తీసుకోగలరు’ అని వైసీపీ మరో ట్వీట్ చేసింది. వాస్తవానికి రుషికొండపై టూరిజం శాఖ ఆధ్వర్యంలో పలు నిర్మాణాలు జరుగుతున్నట్టు గతంలో హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. అయితే అది సెక్రటేరియట్ అంటూ ఇప్పుడు చెప్పడం కొత్త వివాదాలకు దారితీసింది. అంటే హైకోర్టునే ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందా..? అనే సందేహాలు వచ్చాయి. అయితే వెంటనే ఆ ట్వీట్‌ను డెలిటీ చేసి అధికారికంగా తప్పు దిద్దుకోవాలని ప్రయత్నం మొదలు పెట్టింది. రెండోసారి ఇలా వివరణ ఇచ్చుకుంది. ఈ లోపే టీడీపీ ఆ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘‘ఈ ట్వీట్ ఎందుకు డిలీట్ చేశావ్ ‘బుజ్జి కన్నా’? భయం వేసిందా.. ? సిగ్గేసిందా.. ? తాడేపల్లి నుంచి కోటింగ్ పడిందా..?’ అని ఎద్దేవా చేస్తూ టీడీపీ ట్వీట్ చేసింది. దీనిపై వైసీపీ స్పందిస్తూ.. ‘ వాస్తవానికి మానవ తప్పిదాలు అనేవి సహజంగానే జరుగుతుంటాయి.. అలాగే ఇది కూడా జరిగింది. దానిపై ప్రజలకు తిరిగి వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఒక తప్పిదం జరిగితే అది జరిగింది అని ఒప్పుకుని, దానిని ప్రజలకు వివరించి చెప్పే దమ్ము దైర్యం మాకు ఉంది, కానీ మీలాగా మీ నాయకుడు చంద్రబాబు లాగా, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా ప్రజలను మభ్యపెట్టే తప్పుడు కార్యక్రమాలు మేమెప్పుడు చేయలేదు, చేయబోము కూడా. ఇదీ మా నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి గారు మాకు నేర్పిన లక్షణం, ఇదీ మా విశ్వసనీయత’ అని టీడీపీకి వైసీపీ కౌంటరిచ్చింది.
కౌంటర్ ఎటాక్!
‘మళ్లీ చెప్తున్నాం.. పొరపాటు జరిగితే, జరిగిందని నిర్భయంగా ప్రజలకి చెప్పగలిగే పరిస్ధితిలో మేమున్నాం. అంతేగానీ మీ చంద్రబాబు లాగా ప్రజలని తప్పుదోవ పట్టించి మభ్యపెట్టే కార్యక్రమం మేం ఎప్పుడూ చేయలేదు. మీలాగా ఏకంగా పార్టీ మేనిఫేస్టోని సైతం పార్టీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డిలీట్ చేసే కార్యక్రమం అసలే చేయలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం మాకు ఉంది కాబట్టే, ప్రజలు మమ్మల్ని నమ్మి వారికి సేవ చేసే బాధ్యతను కల్పించారు. ఆ ప్రజల ఆశీస్సులతోనే ఈరోజు ఎన్నికల మేనిఫేస్టోలో చెప్పిన హమీల్లో 98% హామీలు నెరవేర్చగలిగాం. ఇదీ మీకూ, మాకూ తేడా!. పోయి సాయంత్రం మీ పప్పు నారా లోకేష్ సభకు జనాల్ని పోగేసుకో పో!’ అని టీడీపీ ట్వీట్‌కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఈ ట్వీట్‌పై మళ్లీ టీడీపీ స్పందించింది. ‘ ఎన్ని కవర్ డ్రైవులు కొట్టినా.. ఇవ్వాల్సిన మెసేజ్ ఇచ్చేశావు థ్యాంక్స్ బ్రో..! తప్పుడు రాతలు, తప్పుడు కూతలు.. మా సాక్షి తప్పు.. మా సైకో తప్పు.. మా అధికారిక ఖాతా తప్పు’ అంటూ సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడిన మాటల తాలుకూ వీడియోను జతచేస్తూ టీడీపీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా ట్వీట్‌తో దిమ్మదిరిగే కౌంటరిచ్చింది. అంతేకాదు.. జగన్ అధికారంలోకి రాక ముందు రుషికొండ ఎలా ఉంది..? అధికారంలోకి వచ్చాక ఎలా ఉండేదనేదానిపై కూడా ఫొటోలు రిలీజ్ చేసి.. టూరిజం మంత్రి రోజా మాట్లాడిన ఓ వీడియోను కూడా జతచేస్తూ ట్వీట్ చేసింది టీడీపీ.
మొత్తానికి చూస్తే.. వైసీపీ ట్వీట్ చేయడం, టీడీపీ కౌంటర్ చేయడం.. ఇందుకు మళ్లీ ప్రతి కౌంటర్ చేయడం.. మళ్లీ పాత ట్వీట్లకు సవరణలు, వివరణలు ఇస్తూ తంటాలుపడుతోంది జగన్ సర్కార్. ఇంతకీ రుషికొండను తొలిచి అక్కడ ఏయే నిర్మాణాలు చేపడుతున్నారనేదానిపై ఇంకెప్పుడు క్లారిటీ వస్తుందో ఏంటో మరి.