Salem Dog: ఇంట్లో వాళ్లు కూడా ఆ బాధను మర్చిపోయి ఉండొచ్చేమో.. కానీ పాపం ఈ శునకం..!
ABN , First Publish Date - 2023-03-14T12:49:29+05:30 IST
ఆసుపత్రిలో చేరిన తన యజమాని చనిపోయాడన్న విషయం తెలియక ఆయన కోసం బయటే పడిగాపులు కాస్తోంది ఓ శునకం. వచ్చేపోయేవాళ్లను గమనిస్తూ..
యజమాని చనిపోయాడని తెలియక..!
3 నెలలుగా ఆసుపత్రి వద్ద వేచి వున్న కుక్క
ప్యారీస్ (చెన్నై): ఆసుపత్రిలో (Salem Hospital) చేరిన తన యజమాని చనిపోయాడన్న విషయం తెలియక ఆయన కోసం బయటే పడిగాపులు కాస్తోంది ఓ శునకం. వచ్చేపోయేవాళ్లను గమనిస్తూ, తన యజమాని కోసం కన్నీటితో ఎదురు చూస్తోంది. సేలం నగరంలోని ప్రభుత్వ మోహన కుమారమంగళం జనరల్ ఆసుపత్రిలో (Government Mohan Kumaramangalam Hospital) మూడు నెలల క్రితం గుండెనొప్పితో (Heart Pain) బాధపడిన ఓ రోగిని కుటుంబ సభ్యులు చేర్పించారు.
రోగితో పాటు ఆయన పెంచుకున్న కుక్క (Salem Dog) కూడా ఆసుపత్రికి తొలిరోజు వచ్చింది. అయితే ఆసుపత్రి సిబ్బంది కుక్కను ఆసుపత్రి బయటే నిలిపేశారు. దీంతో అది గేటు వద్దనే వుండిపోయింది. ఆసుపత్రిలో చేరిన రోగి.. కొద్దిసేపటికే కన్నుమూశాడు. దాంతో వైద్యులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పజెప్పడంతో.. వారు వెనుక వైపు నుంచి తీసుకొనివెళ్లిపోయారు. అయితే ఈ విషయం తెలియని కుక్క.. తన యజమాని కోసం గేటు వద్దనే ఎదురు చూస్తోంది.
ఎవరైనా ఏదైనా ఇస్తే తింటూ అక్కడే తన యజమాని కోసం ఆశగా ఎదురు చూస్తోంది. ఆసుపత్రి సిబ్బంది వచ్చి తరిమేసినా అది అక్కడి నుంచి కదలడం లేదు. దీనిపై ఆసుపత్రి సిబ్బంది మాట్లాడుతూ.. ఒక రోగితో పాటు వచ్చిన కుక్క.. ఆయన కోసమే ఎదురు చూస్తూ బక్కచిక్కిపోతోందని, ఇప్పటికైనా దాని యజమాని కుటుంబసభ్యులెవరైనా వచ్చి దానిని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.