Chennai Mother Case: ఎంత పని చేశావ్ ‘తల్లి’.. సరదా కోసం చేసిన పని ప్రాణాలు తీసింది
ABN , First Publish Date - 2023-08-14T15:27:24+05:30 IST
చిన్న పిల్లలు మారాం చేసినప్పుడు.. వారిని దారికి తెచ్చుకోవడం కోసం తల్లులు సరదాగా భయపెడుతుంటారు. బూచోడొచ్చి పట్టుకెళ్లిపోతాడనో, మాట్లాడనని చెప్పి ఆటపట్టించడమో..
చిన్న పిల్లలు మారాం చేసినప్పుడు.. వారిని దారికి తెచ్చుకోవడం కోసం తల్లులు సరదాగా భయపెడుతుంటారు. బూచోడొచ్చి పట్టుకెళ్లిపోతాడనో, మాట్లాడనని చెప్పి ఆటపట్టించడమో చేస్తుంటారు. కొందరైతే.. సూసైడ్ చేసుకుంటానని భయపెట్టిస్తుంటారు కూడా! ఓ తల్లి కూడా అలాగే తన కొడుకుని సరదాగా భయపెట్టించాలని అనుకుంది. స్కూలుకి వెళ్లనని కుమారుడు మొండికేయడంతో.. ఆత్మహత్య చేసుకుంటానంటూ భయపెట్టించడానికి ప్రయత్నించింది. కానీ.. ఈ ప్రయత్నం విషాదాంతంగా మారింది. సరదాగా బెదిరించడానికి ట్రై చేస్తే.. అది ఆమె ప్రాణాల్నే తీసుకుంది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని కోయంబత్తూరులో అప్పనేకర్ రోడ్డులో సుధాకర్, యమునాబాబు అనే దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఒక కొడుకు (16), కూతురు (14) ఉన్నారు. ఈ పిల్లలిద్దరు సమీపంలోనే ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నారు. అయితే.. తాను స్కూలుకి వెళ్లనని కుమారుడు కొన్ని రోజుల నుంచి మారాం చేస్తున్నాడు. తనకు స్కూలుకి వెళ్లాలంటే ఇష్టం లేదని, ఇంట్లోనే ఉంటూ ఆడుకుంటానని మొండికేశాడు. తల్లి ఎన్నిసార్లు మందలించినా.. అతడు మాత్రం వినిపించుకోలేదు. ఇంట్లోనే ఉంటానని మారాం చేశాడు. దీంతో.. తన కొడుకుని దారికి తెచ్చుకోవడం కోసం ఆ తల్లి ఉరి నాటకం ఆడింది. స్కూలుకి వెళ్లకపోతే.. తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అప్పటికీ కుమారుడు తేలిగ్గా తీసుకున్నాడు.
దీంతో.. యమునా ఉరితాడు బిగించి, తన మెడకు తగిలించుకుంది. ‘ఇదిగో చనిపోతున్నా’ అంటూ కుమారుడికి చెప్పింది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ ఆమె కాలు జారింది. దాంతో.. మెడకు ఉరితాడు బిగుసుకుంది. ఊపిరి ఆడక ఆమె గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి షాక్‌కు గురైన కుమారుడు.. వెంటనే ఇరుగుపొరుగు వాళ్లను పిలిచాడు. స్థానికులు వెంటనే వచ్చి, ఆమెను కిందకు దించి, ఆసుపత్రికి తరలించారు. అయితే.. యమునా చికిత్స పొందుతూ మృతి చెందింది. యమునా మృతితో వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సరదాగా తన కుమారుడ్ని భయపెట్టించాలనుకున్న ఈ తల్లి ప్రయత్నం.. ఆమెను బలి తీసుకుంది.