Josh Hazlewood: భారత్‌తో తొలి టెస్టుకు ముందు ఆసీస్‌కు ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2023-02-05T16:47:02+05:30 IST
భారత్‌తో తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) నాగ్‌పూర్ టెస్టుకు
నాగ్‌పూర్: భారత్‌తో తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) నాగ్‌పూర్ టెస్టుకు దూరమయ్యాడు. ఎడమకాలి మడమ వద్ద గాయంతో బాధపడుతున్న తాను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లోని తొలి టెస్టుకు దూరమవుతున్నట్టు హేజిల్‌వుడ్ స్వయంగా వెల్లడించాడు. రెండో టెస్టుకు మాత్రం అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
జోష్ తప్పుకోవడంతో స్కాట్ బోలాండ్(Scott Boland)కు అవకాశం దక్కనుంది. హేజిల్‌వుడ్ మద్దతు కూడా బోలాండ్‌కే ఉంది కాబట్టి తొలి టెస్టులో అతడు బరిలోకి దిగడం పక్కా అని చెబుతున్నారు. ఎంసీజీ లాంటి ఫ్లాట్ వికెట్‌పైనే స్కాటీ అద్భుతంగా బౌలింగ్ చేశాడని జోష్ చెప్పుకొచ్చాడు. అతడి బౌలింగ్ సగటు కూడా బాగుందని ప్రశంసించాడు. స్కాట్, రివర్స్ స్వింగ్‌లో రాణిస్తున్న లాన్స్ మోరిస్(Lance Morris) ఇద్దరూ ఉపఖండం పిచ్‌లపై ఆడేందుకు ఉవ్విళ్లూరుతున్నారని అన్నారు. వీరిద్దరికీ ఆడేందుకు అర్హత ఉందన్నాడు. జోష్ తన గాయం గురించి చెబుతూ.. గత నెలలో దక్షిణాఫ్రికాతో సిడ్నీ టెస్టు సందర్భంగానే సమస్య తలెత్తిందన్నాడు. అది ఇంకా కొనసాగుతోందన్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 9న నాగ్‌పూర్(Nagpur)లో తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. 17 నుంచి ఢిల్లీలో రెండో టెస్టు జరుగుతుంది. మార్చి 1న ధర్మశాల, అదే నెల 9న అహ్మదాబాద్‌లో మూడు నాలుగు టెస్టులు ప్రారంభమవుతాయి. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. మార్చి 17న జరగనున్న తొలి వన్డేకు ముంబై, 19న జరగనున్న రెండో వన్డేకు విశాఖపట్టణం, 22న జరగనున్న తుది వన్డేకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనున్నాయి.