Share News

World cup: పరువు తీసిన బాబర్ సేన.. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు

ABN , First Publish Date - 2023-10-28T09:05:09+05:30 IST

ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. టాప్ జట్లలో ఒకటిగా టోర్నీలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ అంచనాలను అందుకోలేక డీలాపడింది. ప్రపంచకప్‌ను బాగానే ఆరంభించినప్పటికీ ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేక చతికిలపడింది.

World cup: పరువు తీసిన బాబర్ సేన.. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు

చెన్నై: ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. టాప్ జట్లలో ఒకటిగా టోర్నీలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ అంచనాలను అందుకోలేక డీలాపడింది. ప్రపంచకప్‌ను బాగానే ఆరంభించినప్పటికీ ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేక చతికిలపడింది. వరుస పరాజయాలతో అభిమానులను నిరాశకు గురి చేసింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఎవరూ ఊహించని విధంగా వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ జట్టు చివరి వరకు పోరాడినప్పటికీ విజయం మాత్రం దక్కలేదు. దీంతో ఈ ప్రపంచకప్‌లో బాబర్ సేన వరుసగా నాలుగో పరాజయాన్ని నమోదు చేసింది. టోర్నీ ఆరంభంలో నెదర్లాండ్స్, శ్రీలంకపై గెలిచి ఊపుమీద కనిపించిన పాకిస్థాన్.. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్‌ల్లో భారత్, ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్, సౌతాఫ్రికా చేతిలో ఓడింది. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టు ఓ చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. తమ క్రికెట్ చరిత్రలోనే వన్డే ప్రపంచకప్‌లో తొలి సారి వరుసగా 4 మ్యాచ్‌లు ఓడింది. దీంతో 48 వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ జట్టు తొలిసారి వరుసగా 4 మ్యాచ్‌లు ఓడడం అభిమానులతోపాటు ఆ దేశ మాజీ క్రికెటర్లకు మింగుడుపడడం లేదు. దీంతో ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్న బాబర్ సేనపై అంతటా విమర్శల వర్షం కురుస్తోంది. పాకిస్థాన్ పరువు తీశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.


నిజానికి 1999 నుంచి ప్రపంచకప్‌ టోర్నీలలో సౌతాఫ్రికా చేతిలో పాకిస్థాన్ ఒకసారి కూడా ఓడిపోలేదు. దీంతో ఈ సారి కూడా ఆ రికార్డు కొనసాగుతుందని, టోర్నీలో పాకిస్థాన్ మళ్లీ ఫామ్‌లోకి కూడా వస్తుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. అలాగే వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ జట్టుకు 270+ స్కోర్‌ను అత్యధిక సార్లు డిఫెండ్ చేసుకున్న రికార్డు కూడా ఉంది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు వరకు పాకిస్థాన్ జట్టు 17 సార్లు 270+ టార్గెట్ ఇచ్చినప్పుడు.. ఏకంగా 15 సార్లు డిఫెండ్ చేసుకుంది. కేవలం రెండు సార్లు మాత్రమే ఓడింది. కానీ ఈ మ్యాచ్‌లో తమ రికార్డును కొనసాగించలేకోయింది. ప్రత్యర్థి చేతిలో మూడోసారి ఓడింది. మొత్తంగా ఈ టోర్నీలో అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్న బాబర్ సేనపై అంతటా విమర్శలు వస్తున్నాయి.

ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. పాకిస్థాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓటమి అంచు వరకూ వెళ్లి వికెట్‌ తేడాతో గట్టెక్కింది. మార్‌క్రమ్‌ (93 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 91) అండతో సునాయాసంగా గెలుస్తుందనుకున్న వేళ.. పాక్‌ పేసర్లు డెత్‌ ఓవర్లలో పట్టు బిగించారు. దీంతో 271 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన ఈ జట్టు ఓ దశలో 260/9 స్కోరుతో ఓటమి దిశగా వెళ్లింది. అప్పటికి 11 రన్స్‌ కోసం 27 బంతులున్నా చేతిలో వికెట్లు లేకపోవడంతో ఏ క్షణంలోనైనా పాక్‌దే గెలుపనిపించింది. కానీ కేశవ్‌ (7 నాటౌట్‌) ఒత్తిడిని జయిస్తూ 48వ ఓవర్‌లో ఫోర్‌ బాదడంతో సఫారీలు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే 10 పాయింట్లతో, సూపర్‌ నెట్‌ రన్‌రేట్‌తో టాప్‌లో నిలిచారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ (52), బాబర్‌ ఆజమ్‌ (50), షాదాబ్‌ ఖాన్‌ (43) రాణించారు. స్పిన్నర్‌ షంసీకి నాలుగు, జాన్సెన్‌కు మూడు, కొట్జీకి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ప్రొటీస్‌ 47.2 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షంసీ నిలిచాడు.

Updated Date - 2023-10-28T09:06:17+05:30 IST