IND vs SA: తొలి టెస్టుకు సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన టీమిండియా తుది జట్టు ఇదే!
ABN , Publish Date - Dec 24 , 2023 | 03:48 PM
Sunil Gavaskar: మంగళవారం నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై ఒకసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవని టీమిండియా ఈ సారి ఆ లోటు తీర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
సెంచూరియన్: మంగళవారం నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటివరకు సఫారీ గడ్డపై ఒకసారి కూడా టెస్ట్ సిరీస్ గెలవని టీమిండియా ఈ సారి ఆ లోటు తీర్చుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ నెల 26 నుంచి ప్రారంభంకానున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మొదటి టెస్టు మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటే బాగుంటుందనే అంశంపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు మాట్లాడిన సన్నీ ఓపెనింగ్‌లో రోహిత్ శర్మకు జతగా ఎడమ చేతి బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఆడాలని పేర్కొన్నాడు. మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్ ఆడాలని సూచించాడు. గతంలో మూడో స్థానంలో చటేశ్వర్ పుజారా ఆడేవాడు. కానీ ప్రస్తుతం అతను ఫామ్ కోల్పోయి జట్టుకు దూరం కావడంతో సౌతాఫ్రికా పర్యటనలో వన్ డౌన్‌లో ఆడే బ్యాటర్ ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో ఓపెనర్‌గా ఆడుతున్న గిల్ మూడో స్థానంలో ఆడాలని గవాస్కర్ సూచించాడు. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగనున్నాడు. తన ప్లేయింగ్ 11 చాలా సరళంగా ఉంటుందని చెప్పిన గవాస్కర్ ఐదో స్థానంలో కేఎల్ రాహుల్, ఆరో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడాలని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్‌ను వికెట్ కీపర్‌గా ఎంచుకున్నాడు. కాగా ప్రధాన వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసినప్పటికీ అతను పలు కారణాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో కిషన్ స్థానంలో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. కానీ సునీల్ గవాస్కర్ ఎంపిక చేసిన తుది జట్టులో కీపర్‌గా రాహుల్‌కే చోటు దక్కింది. గతంలో ఐదో స్థానంలో రహానే ఆడేవాడు. కానీ అతను ఫామ్ కోల్పోయి జట్టుకు దూరం అయ్యాడు. ఇక ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ను గవాస్కర్ ఎంపిక చేశాడు. వీరిద్దరు స్పిన్ బౌలింగ్ భారాన్ని కూడా మోయనున్నారు. మ్యాచ్ జరిగే సెంచూరియన్ పిచ్ పేస్‌కు అనుకూలించనుంది కాబట్టి ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. తన ప్లేయింగ్ 11లో ముగ్గురు పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్‌ను ఎంచుకున్నాడు. అదే సమయంలో ముఖేష్ కుమార్‌కు బదులుగా ప్రసిద్ధ్ కృష్ణను కూడా ఎంపిక చేయవచ్చని చెప్పాడు. కాగా సౌతాఫ్రికా ‘ఎ’ తో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్ ‘ఎ‘ తరఫున ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లతో సత్తా చాటాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేసినప్పటకీ చీలమండ గాయంతో దూరమైన సంగతి తెలిసిందే.
గవాస్కర్ ఎంపిక చేసిన టీమిండియా తుది జట్టు
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్