Travis Head: వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు.. టీమిండియాకు విలన్‌గా మారిన ట్రావిస్ హెడ్
ABN , First Publish Date - 2023-11-20T15:09:16+05:30 IST
ICC Tournaments: వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అయితే ట్రావిస్ హెడ్ టీమిండియాకు విలన్‌గా మారడం ఇది తొలిసారి కాదు. వరుసగా రెండోసారి. ఈ ఏడాది ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో కూడా ట్రావిస్ హెడ్ కారణంగానే టీమిండియా ఓటమి పాలైన సంగతిని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 10 విజయాలు సాధించిన టీమిండియాకు ఫైనల్ పోరులో మాత్రం చుక్కెదురైంది. ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ జట్టు ఓపెనర్ ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో మరోసారి టీమిండియా అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అయితే ట్రావిస్ హెడ్ టీమిండియాకు విలన్‌గా మారడం ఇది తొలిసారి కాదు. వరుసగా రెండోసారి. ఈ ఏడాది ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో కూడా ట్రావిస్ హెడ్ కారణంగానే టీమిండియా ఓటమి పాలైన సంగతిని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగుల భారీ స్కోరు సాధించింది. స్టీవ్ స్మిత్ 121 పరుగులు చేయగా.. మిడిలార్డర్‌లో వచ్చిన ట్రావిస్ హెడ్ 163 పరుగుల భారీ సెంచరీతో అదరగొట్టాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా స్మిత్, హెడ్ సెంచరీలతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయగలిగింది.
అనంతరం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకే ఆలౌటైంది. రహానె (89), జడేజా (48) తప్ప మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్ తలో రెండు వికెట్లు సాధించారు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటింది. అలెక్స్ క్యారీ (66), లబుషేన్ (41), స్టార్క్ (41) రాణించడంతో 270/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల టార్గెట్ నిలిచింది. కానీ ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోవడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటై 209 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ అతడే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావడం మరో విశేషం. ఇలా రెండు ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు ట్రావిస్ హెడ్ విలన్‌గా మారి కోట్లాది మంది అభిమానుల మనసులను గాయపరిచాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.