World cup: అఫ్ఘానిస్థాన్ సంచలన విజయాల్లో టీమిండియా క్రికెటర్ కీలక పాత్ర.. ఎవరా ఆటగాడు? ఏం చేశాడు..?
ABN , First Publish Date - 2023-10-24T18:33:49+05:30 IST
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ చెలరేగుతోంది. టోర్నీ ప్రారంభానికి ముందు పసికూనలా కనిపించిన ఆ జట్టు ప్రస్తుతం బలీయంగా తయారైంది. బలమైన జట్లను ఓడించి సంచలనాలు సృష్టిస్తోంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ చెలరేగుతోంది. టోర్నీ ప్రారంభానికి ముందు పసికూనలా కనిపించిన ఆ జట్టు ప్రస్తుతం బలీయంగా తయారైంది. బలమైన జట్లను ఓడించి సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచకప్ హాట్ ఫెవరేట్లుగా బరిలోకి దిగిన ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లను అఫ్ఘానిస్థాన్ సునాయసంగా ఓడించడం అందరినీ ఆశ్చర్యపరించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, మాజీ ఛాంపియన్ పాకిస్థాన్ జట్లు అఫ్ఘానిస్థాన్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయాయి. దీంతో రానున్న రోజుల్లో ఆ జట్టు మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలున్నాయి. ఈ ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్తాన్ జట్టు ఇదే ఊపులో సెమీస్ చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పసికూనలా ఉన్న అఫ్ఘానిస్థాన్ బలంగా తయారై నేడు టాప్ జట్లను ఓడించే స్థాయికి ఎదగడంలో భారత్ పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా మన టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా పాత్ర కీలకమైనదిగా చెప్పుకోవచ్చు.
మొదటి నుంచి అఫ్ఘానిస్థాన్ క్రికెట్ అభివృద్ధికి భారత్ ఎంతో సహకరించింది. కడు పేదరికంలో ఉన్న అఫ్ఘనిస్థాన్ క్రికెట్‌కు మౌలిక సదుపాయాలను కల్పించింది. అలాగే అఫ్ఘానిస్థాన్‌లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సహాయం చేసింది. అలాగే ఆ జట్టు ఆటగాళ్లను ఐపీఎల్‌కు ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో అఫ్ఘాన్ ఆటగాళ్లకు అన్ని విధాల ప్రోత్సహాలను అందించింది. ఇక తాజాగా ఆ జట్టు విజయంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్‌కు మెంటార్‌గా ఉన్న జడేజా ఆ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. పసికూనలా ఉన్న అఫ్ఘానిస్థాన్ జట్టును పులిలా తయారుచేశాడు. టోర్నీ ఆరంభానికి కేవలం వారం రోజుల ముందు అఫ్ఘానిస్థాన్‌తో చేరినప్పటికీ ఆ జట్టును బలీయంగా తయారుచేశాడు. అఫ్ఘాన్ ఆటగాళ్లతో బాగా కలిసిపోయిన జడేజా జట్టును అన్ని విధాల ధృడంగా తయారుచేశాడు. స్వతహాగా టీమిండియా క్రికెటర్ కావడంతో మన దేశంలోని పిచ్‌లపై జడేజాకు పూర్తి అవగాహన ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ జడేజాకు కావాల్సినంత అనుభవం ఉంది. టీమిండియా కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.
ఇంకేముంది తన అనుభవాన్నంతా ఉపయోగించి తక్కువ సమయంలో అఫ్ఘానిస్థాన్ జట్టును సానబెట్టాడు. ఆటగాళ్లందరిని మెరికల్లా తయారు చేశాడు. మొదటి నుంచి కూడా అఫ్ఘానిస్థాన్ దగ్గర మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. ముఖ్యంగా రషీద్ ఖాన్ వంటి అద్భుత స్పిన్నర్ ఉన్నాడు. నబీ వంటి మంచి ఆల్ రౌండర్ కూడా ఉన్నాడు. అలాగే నవీన్ ఉల్ హక్, ముజీబ్ రూపంలో మంచి పేసర్లు ఉన్నారు. కానీ బ్యాటింగే కాస్త బలహీనంగా ఉండేది. ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన జడేజా బ్యాటింగ్ యూనిట్‌ను బలంగా తయారు చేశాడు. అందుకే ఈ ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ జట్టు మంచి స్కోర్లు సాధిస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 283 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం చేధించింది. అంతెందుకు భారత్‌తో మ్యాచ్‌లో కూడా అఫ్ఘానిస్థాన్ జట్టు 272/8 మంచి స్కోర్ సాధించింది. ఆ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు కాబట్టి సరిపోయింది కానీ.. లేదంటే లక్ష్యాన్ని చేధించడం టీమిండియాకు కష్టమయ్యేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
స్వతహాగా మంచి హిట్టరైనా అజయ్ జడేజాకు పాకిస్థాన్‌పై మంచి రికార్డు ఉంది. ఆటగాడిగా 1996 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై చెలరేగాడు. ఆ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జడేజా 25 బంతుల్లోనే 45 పరుగులతో చెలరేగాడు. టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కూడా అనేకసార్లు పాకిస్థాన్‌పై జడేజా చెలరేగాడు. తన కెరీర్ మొత్తంలో పాకిస్థాన్‌తో 40 మ్యాచ్‌లాడిన జడేజా 892 పరుగులు చేశాడు. రెండు వికెట్లు కూడా తీశాడు. తాజాగా మెంటార్‌గానూ పాకిస్థాన్‌పై తన విజయాల రికార్డును కొనసాగించాడు. తన కెరీర్ మొత్తంలో 196 వన్డే మ్యాచ్‌లు ఆడిన జడేజా 37 సగటుతో 5359 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలున్నాయి. 20 వికెట్లు కూడా తీశాడు. ఇక 15 టెస్టుల్లో 26 సగటుతో 576 పరుగులు చేశాడు. 13 మ్యాచ్‌ల్లో టీమిండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఏది ఏమైనా అజయ్ జడేజా సలహాలు, సూచనలు, అఫ్ఘనిస్థాన్ ఆటగాళ్ల అద్భుత ప్రతిభతో ఈ ప్రపంచకప్‌లో అప్ఘానిస్థాన్ సంచలన విజయాలు సాధిస్తోంది. తద్వారా తాలిబన్ల పాలనలో కష్టాలు, ఇటీవల సంభవించిన భారీ భూకంపాలతో కన్నీటిపర్యంతమైన అఫ్ఘానిస్థాన్ దేశస్తుల మొహాల్లో కాస్త చిరునవ్వు చిగిరించిందని పలువురు అంటున్నారు.