High Court: కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు సీరియస్.. కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం
ABN , First Publish Date - 2023-02-23T15:48:04+05:30 IST
అంబర్‌పేట కుక్కల దాడిలో బాలుడి మృతిపై హైకోర్టు (High Court) సీరియస్ అయింది. బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్: అంబర్‌పేట కుక్కల దాడిలో బాలుడి మృతిపై హైకోర్టు (High Court) సీరియస్ అయింది. బాలుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అంబర్‌పేట (Amberpet)లో కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై గురువారం చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌లో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్‌ఎంసీ, తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. జీహెచ్‌ఎంసీ (GHMC) నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్‌ఎంసీ ప్రశ్నించింది.
రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ (Hyderabad)లో నాలుగేళ్ల పసివాడు ప్రదీప్‌ను వీధి కుక్కలు పొట్టనపెట్టుకున్నాయి. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) ఇందల్‌వాయి. ప్రదీప్ కుటుంబానిది ప్రదీప్ పుట్టినప్పుడే అతడి తండ్రి గంగాధర్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ ఎరుకల బస్తీలో ఉంటూ ఛే నంబర్ చౌరస్తాలోని రెనాల్డ్ కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. గంగాధర్‌కు ప్రదీప్‌తో పాటు కుమార్తె మేఘన (6) సంతానం. ఆదివారం పిల్లలను తీసుకుని సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లాడు. మేఘనను పార్కింగ్ సెక్యూరిటీ క్యాబిన్‌లో ఉంచి ప్రదీప్‌ను సర్వీసింగ్ సెంటర్‌లోకి తీసుకెళ్లాడు. అయితే, బాలుడు కొద్దిసేపటికి అక్క వద్దకు వస్తుండగా కార్ల కింద ఉన్న నాలుగు కుక్కలు దాడి చేశాయి. పరుగెత్తబోయి కాలుజారి పడిపోయిన అతడిని తల, చేతులు, కాళ్లు, మెడ, పొట్ట భాగంలో తీవ్రంగా కరిచాయి. చెయ్యి ఒకటి, కాలు మరో కుక్క పట్టి లాగాయి. మేఘన తండ్రి గంగాధర్‌కు చెప్పగా అతడు వచ్చేవరకు దాడి చేస్తూనే ఉన్నాయి. ప్రదీప్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు.
పోలీసుల తీరుపై విమర్శలు
ప్రదీప్ మృతి ఘటనలో అంబర్‌పేట పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పసివాడు మరణించి నాలుగు రోజులు గడిచినా కేసు నమోదు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 19న ఘటన జరిగిన విషయం తెలిసిందే. ప్రదీప్ తండ్రి గంగాధర్ 100కు ఫోన్ చేయగా.. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు, ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం బాధ్యతారాహిత్యమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని, తాము ఎవరిపై కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పడం.. సమస్యను దాటవేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ గోల్నాక సెక్టార్ ఎస్సై విజయ్‌కు ఇన్‌చార్జి సీఐ ప్రభాకర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు.