Share News

Chandrababu : మీ ఆశలు.. ఆకాంక్షలు నెరవేరుస్తాం

ABN , Publish Date - Jun 30 , 2024 | 04:38 AM

రాష్ట్రంలో జూలై 1న సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో పింఛనుదారులకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు యథాతథంగా....

Chandrababu : మీ ఆశలు.. ఆకాంక్షలు నెరవేరుస్తాం

రాష్ట్రంలో జూలై 1న సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో పింఛనుదారులకు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఆ లేఖలోని వివరాలు యథాతథంగా....

ప్రియమైన పింఛన్లదారులకు నమస్కారం...

‘‘మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే.. మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు, ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యంగా మీ ఈ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి రూ.1000 పెంచి... ఇకపై నెలనెలా రూ.4వేలు ఇస్తున్నాం.

అలాగే దివ్యాంగులకు రూ.3 వేలు పెంచి... ఇక నుంచి రూ.6 వేలు ఇస్తున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్‌ లబ్ధిదారులకు జూలై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నాం. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ.. మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచే మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం.

ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్‌ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. ఆ మూడు నెలల పాటు మీరు పింఛన్‌ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి చలించిపోయాను. మండుటెండలో, వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి.. ఏప్రిల్‌ నుంచే పింఛన్‌ పెంపును వర్తింపజేస్తానని మాటిచ్చాను. అందులో భాగంగా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు కూడా ఈ పెంపును వర్తింపజేసి మీకు అందిస్తున్నాం. మూడు నెలలకు పెంచిన రూ.3వేలు, జూలై నెల పింఛన్‌ రూ.4 వేలు కలిపి మొత్తం రూ.7వేలు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం.

పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై ఇకపై నెలకు అదనంగా 819కోట్ల భారం పడుతుంది. గడిచిన మూడు నెలలకు పెంచిన పింఛను ఇస్తానన్న హామీని నెరవేర్చేందుకు మరో రూ.1,650 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నాం. మీ శ్రేయస్సు కోసం ఆలోచించే మీ ప్రజా ప్రభుత్వం... దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై 1న రూ.4,408 కోట్లను పింఛన్ల రూపంలో మీకు అందిస్తోంది.

సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్‌ విధానానికి ఆద్యుడు ఎన్టీఆర్‌ పేరుతో ‘ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లు’ ఇకపై మీ ఇంటి వద్దనే పంపిణీ చేస్తారు. పెరిగిన పింఛనుతో మీకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ.. మీకు ఎప్పుడూ మంచి చేయాలని చూసే ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతూ...’’

- మీ చంద్రబాబు నాయుడు

Updated Date - Jun 30 , 2024 | 04:38 AM