TDP-JSP First List: గెలుపు గుర్రాలతో సై..
ABN , Publish Date - Feb 25 , 2024 | 03:54 AM
టీడీపీ, జనసేన అధిపతులు తొలి విడత ‘గెలుపు గుర్రాల’తో సై అన్నారు. షెడ్యూలు విడుదలకంటే ముందే ... ఒకే రోజు, ఒకే విడతలో 99 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు.
ఉమ్మడిగా ప్రకటించిన చంద్రబాబు, పవన్
94 టీడీపీ 5 జనసేన 99 మందితో తొలి జాబితా
18మంది సిటింగ్‌లు 24 మంది కొత్తవారు
టీడీపీ, జనసేన తొలి జాబితాలో ఒకరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఇద్దరు పీహెచ్‌డీ చేశారు. 30 మంది పీజీ చదివారు. ముగ్గురు ఎంబీబీఎస్ పూర్తి చేయగా, గ్రాడ్యుయేట్లు 63మంది ఉన్నారు.
టీడీపీ టికెట్లు లభించిన 94 మందిలో 20 మంది దళితులు, 18 మంది బీసీలు, ముగ్గురు ఎస్టీలు, మైనారిటీ వర్గానికి చెందినవారు ఒకరు ఉన్నారు.
కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు 21 మంది, రెడ్లు 17 మంది, క్షత్రియ
కులస్థులు నలుగురు ఉండగా, వెలమకు ఒకటి, వైశ్యులకు 2, కాపులకు 7 సీట్లు లభించాయి.
జనసేన ఇచ్చిన ఐదు సీట్లలో కాపులకు 2, గవర, బ్రాహ్మణ, కమ్మ వర్గాలకు ఒక్కొక్కటి దక్కాయి.
టీడీపీ, జనసేన అధిపతులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ తొలి విడత ‘గెలుపు గుర్రాల’తో సై అన్నారు. షెడ్యూలు విడుదలకంటే ముందే ... ఒకే రోజు, ఒకే విడతలో 99 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో 94 మంది టీడీపీ (Telugu Desam) అభ్యర్థులు... ఐదుగురు జనసేన (Janasena) అభ్యర్థులు! పొత్తుల్లో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కూటమిలో కలవాలని భావిస్తున్న బీజేపీకి 4 లోక్‌సభ, నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఒకటీ అరా పేర్లతో, అది కూడా ‘మీరు అభ్యర్థులు కాదు.. సమన్వయకర్తలు మాత్రమే’ అని అధికార పార్టీ తడబడుతుండగా... టీడీపీ దూకుడుగా ఒకేసారి 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం!