Share News

Cyber Police : డిజిటల్‌ అరెస్టు ముఠా ఆటకట్టు

ABN , Publish Date - Dec 03 , 2024 | 05:56 AM

విజయనగరంలో విశ్రాంత అధ్యాపకురాలిని మోసం చేసిన కేసులో పోలీసులు సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టించారు. వారి వద్ద నుంచి నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

Cyber Police : డిజిటల్‌ అరెస్టు ముఠా ఆటకట్టు

  • విజయనగరం పోలీసుల చొరవ.. మహారాష్ట్రలో నిందితుల అరెస్టు

విజయనగరం క్రైం, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): విజయనగరంలో విశ్రాంత అధ్యాపకురాలిని మోసం చేసిన కేసులో పోలీసులు సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టించారు. వారి వద్ద నుంచి నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను సోమవారం విజయనగరం ఎస్పీ వకుల్‌ జిందాల్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అక్టోబరు 10న విజయనగరంలోని కొత్తఅగ్రహారం ప్రాంతానికి చెందిన విశ్రాంత అధ్యాపకురాలు ఉసిరకళ సుజాత కుమారికి గుర్తుతెలియన వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. తాము పోలీసులమని, మీరు పంపిన పార్సిల్లో డ్రగ్స్‌ ఉన్నాయని, మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తామని బెదిరించారు. బ్యాంక్‌ ఖాతాలో ఉన్న నగదును తాము సూచించిన ఖాతాకు పంపితే విచారణ పూర్తయిన తర్వాత, తిరిగి మీ అకౌంట్‌కు పంపుతామని చెప్పారు. దీంతో వారు సూచించిన బ్యాంక్‌ ఖాతాకు ఆమె రూ. 40,11,000 బదిలీ చేశారు. వెంటనే ఆ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో అనుమానం వచ్చి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తక్షణం స్పందించి నేరగాళ్ల ఖాతాలో ఉన్న రూ. 20లక్షలు ఫ్రీజ్‌ చేయించారు. నిందితుడి ఖాతా జమ్మూకశ్మీర్‌లో ఉందని గుర్తించారు. స్థానిక సీఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ముమిన్‌ తారీఖ్‌ బట్‌ను అరెస్ట్‌ చేసి విచారణ జరిపారు. అతడిచ్చిన సమాచారంతో మహారాష్ట్రకు వెళ్లి డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు. వీరిలో ఖసిద్దీ చంద్రకాంత్‌ సుతార్‌, క్లెవిన్‌ గ్లెన్‌ బ్రిటో, నితిన్‌ నందలాల్‌ సరోజ్‌, సైఫ్‌ తలమీదమాందు అనే ముంబై, పుణెకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 10 లక్షల నగదు, రూ. 9.20 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, 6 సెల్‌ఫోన్లు సీజ్‌చేశామని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Updated Date - Dec 03 , 2024 | 05:57 AM